Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలనలో సంక్షోభంలో వ్యవసాయరంగం

ఈ నెల 13 నుంచి 17 వరకు రైతు కోసం పోరుబాట
ఘనంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం
రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈ దిశగా తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గం సమాయత్తం కావాలి. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు.. అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 140 మంది సభ్యులతో తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు కమిటీ సభ్యులతో ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి అభినందనలు తెలియజేశారు. తెలుగురైతు రాష్ట్ర కమిటీ కర్తవ్యాల బోధనతో పాటు సభ్యులకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, సీనియర్ నాయకులు గొల్లపల్లి సూర్యారావు, నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీలో అత్యంత ముఖ్యమైన విభాగం తెలుగురైతు విభాగం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 13 జిల్లాల నుంచి సమర్థమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దేశానికి వెన్నెముక రైతులు. కాని ఇది ఆచరణలో సాధ్యం కావడం లేదు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఏ ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నారా? ఆనాడు వైఎస్ హయాంలో క్రాప్ హాలిడే పదం వినిపించింది. మళ్లీ ఇప్పడు జగన్ రెడ్డి పాలనలో క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు.
రైతులకు టీడీపీ ఏంచేసింది.. వైసీపీ ఏం చేసిందనే దానిపై మేం చర్చకు సిద్ధం. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నింటిని రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో సమర్థమైన సాగునీటి నిర్వహణతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాం. రైతులకు అవసరమైన ఇన్ పుట్ సబ్సీడీ, పంట బీమాతో చెల్లింపులతో పాటు పంట రుణాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, యంత్ర పరికరాలు అందించాం. రైతుల విషయంలో చంద్రబాబుగారిపై జగన్ రెడ్డి దుష్ప్రచారం చేశారు. నేడు రిజర్వాయర్లు నిండినా పంటలు ఎండిపోయే పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలతో మాయ చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్ రెడ్డికి.. ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదు.
చంద్రబాబు పాలనలో ధాన్యం డబ్బులు 48 గంటల్లో చెల్లించాం. నేడు 6 నెలలైనా ధాన్యం బకాయిలు ఇవ్వలేకపోయారు. తెలుగుదేశం పోరాటంతో దిగివచ్చి చెల్లింపులు చేశారు. చంద్రబాబుగారు తీసుకువచ్చిన రైతు రథం పథకాన్ని రద్దు చేశారు. రెండున్నరేళ్లలో వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలను అందించడంలో విఫలమయ్యారు. కనీసం కొడవలి పిడికిలి కూడా ఇవ్వలేదు. శ్రీకాకుళంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎరువులు, విత్తనాల కొరత ఉంది. తెలుగురైతు విభాగానికి అనేక బాధ్యతలు ఉన్నాయి. రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యత ఉంది. రైతు వ్యతిరేక విధానాలపై పోరాడి వారికి అండగా నిలవాలి.
టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..
రాష్ట్ర తెలుగు రైతు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అభినందనలు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు తెలుగురైతు రాష్ట్ర కార్యవర్గం అన్ని విధాల అండగా నిలవాలి. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక, దగా పాలనను ఎక్కడికక్కడ ఎండగట్టాలి. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. చంద్రబాబు పాలనలో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రుణమాఫీ కింద రూ.15 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జగన్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.25వేలు నష్టం జరుగుతోంది. 65 లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పి..44 లక్షల మందికి కుదించారు.
కౌలు రైతులు 15 లక్షల మందికి ఇస్తామని చెప్పి.. 59 వేలకు కుదించారు. చంద్రబాబు పాలనలో 90శాతం సబ్సీడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేయడం జరిగింది. జగన్ రెడ్డి ఒక్క పరికరం కూడా ఇవ్వలేదు. సూక్ష్మపోషకాలను చంద్రబాబు గారు 100 శాతం సబ్సీడీతో అందజేయగా.. నేడు ఎత్తేశారు. ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించలేని దీనస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. పంట పండించడం కంటే వదిలేయడమే మేలు అనే అనే విధంగా రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితి. ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేశారు. కాలువల మరమ్మతులు లేక పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయి.చంద్రబాబు పాలనలో తిత్లి తుఫాను సాయంగా హెక్టారుకు రూ.20 వేలు చెల్లించగా.. నేడు జగన్ రెడ్డి పాలనలో రైతులకు సాయం కరువైంది. జగన్ రెడ్డి పాలనలో ప్రకృతి విపత్తుల వల్ల 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగగా.. కేవలం 11 లక్షల ఎకరాలకే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
పంట బీమా కింద రైతుల వాటా చెల్లించకుండా మోసం చేశారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో నిలదీసిన తర్వాత అర్థరాత్రి జీవో ఇచ్చారు. ఇన్సూరెన్స్ మర్చిపోవడం అంటే రైతులను మర్చిపోవడమే. అలాంటి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. ఉచిత విద్యుత్ కు మంగళం పాడే విధంగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. వైఎస్ హయాంలో రైతులను దొంగల్లా చూస్తున్నారా అని వ్యాఖ్యానించగా.. నేడు జగన్ రెడ్డి మీటర్లు ఏవిధంగా పెడతారు? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట పేరుతో ఈ నెల 13 నుంచి 17 వరకు రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాడటం జరుగుతుంది. దీనిని రైతు విభాగం విజయవంతం చేయాలి.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు మాట్లాడుతూ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనుబంధ విభాగాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. తెలుగు రైతు విభాగం సభ్యులు సైనికుల్లా పనిచేసి రైతులకు అండగా నిలవాలి. 2014-19 మధ్య చంద్రబాబు గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశారు. రైతు రుణమాఫీ కింద రూ.15 వేల కోట్లు చెల్లించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.4,500 కోట్లు ఖర్చుపెట్టాం. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారు.
రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా మారాయి. ఆక్వారంగాన్ని చంద్రబాబు గారు ఆదుకోగా.. నేడు నిర్లక్ష్యం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ ను అటకెక్కించారు. జగన్ రెడ్డి ఏ పథకం కూడా రైతులను ఆదుకోలేక పోతోంది. ప్రజలు తాము చేసిన తప్పేంటో రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన చూసి తెలుసుకున్నారు. మోటార్లకు మీటర్లతో రైతులను అప్పులు చేస్తున్నారు. రైతులకు టీడీపీ అండగా నిలుస్తుంది. తెలుగురైతు రాష్ట్ర కమిటీ సభ్యులకు నా అభినందనలు, ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, కార్యదర్శులు, రైతులు పెద్దఎత్తున పాల్గొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

LEAVE A RESPONSE