– రైతులకు నిరంతరంగా సూచనలు ఇవ్వాలి
– పంట ఉత్పత్తి ఖర్చులు తగ్గేలా కృషి చేయాలి
– పంట మార్పిడిపై రైతులకు చైతన్య వంతులను చేయాలి
– వ్యవసాయ రంగానికిది ఛాలెంజింగ్ సంవత్సరం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
– రాష్ట్ర స్థాయి అగ్రి డాక్టర్స్ 2022 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అన్ని శ్రేణుల అధికారులు మరింత అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. గురువారం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరరాయ భవన్ లో రాష్ట్ర అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ 2022 సంవత్సర డైరీ, క్యాలెండర్ ను వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాములు లతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి నిరంతరంగా సూచనలు, సలహాలను ఇవ్వాలని అన్నారు.చిత్తశుద్ధితో విధులు
నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం పంటల ఉత్పత్తి ఖర్చులు పెద్ద సవాలుగా మారిందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పంటల ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయ శాఖ అధికారులు తగిన కృషి చేయాలని ఆయన సూచించారు.పంట ఉత్పత్తి ఖర్చులు తగ్గితే మార్కెట్ లో వాటి ధరలు సహజంగా తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పంటల మార్పిడిపై రైతులను చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. అందరూ ఒకే రకమైన పంటలను వేస్తే మార్కెట్ లో వాటికి గిట్టుబాటు ధరలు రాకుండా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఆయన తెలిపారు.ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని వినోద్ కుమార్ అన్నారు.వ్యవసాయ శాఖ అధికారులకు నిరంతరంగా వృత్తి నైపుణ్య పునశ్చరణ తరగతులను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆగ్రోస్ ఎండీ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, కమిషనర్ హనుమంతు, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు మధుమోహన్, నర్సింహా రెడ్డి, కృష్ణవేణి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.