– ఏడాదిలో వ్యవసాయ రంగాన్ని తిరోగమనం వైపు మళ్లించారు
వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
– జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో రైతు శేఖర్ రెడ్డి మరణం పట్ల సంతాపం
హైదరాబాద్: మొన్న ఆదిలాబాద్ లో ఒక రైతు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఇంకో రైతు రాథోడ్ గోకుల్ ఆదిలాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలో బొంకూరు శేఖర్ రెడ్డి అనే మిర్చి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పెట్టుబడికి డబ్బులు లేక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ పంటల కొనుగోళ్లు లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.
పదేళ్ల కాలంలో రూ.4.5 లక్షల కోట్లతో కేసీఆర్ వ్యవసాయ రంగానికి చేయూత అందించారు. నేరుగా రైతుల ఖాతాలకు రూ.73 వేల కోట్లు 11 విడతల్లో రైతుబంధు కింద జమ చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది. ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని తిరుగుతున్న రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఏడాదిలో 400 కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.