Suryaa.co.in

Political News

ఇక్కడంతా క్షేమం..!

ప్రియమైన మీకు..!
మీ మిత్రుడి సుపుత్రుడు వ్రాయు క్షేమ సమాచారములు.

గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నన్ను ఘోరపరాజయము..ఘోరపరాభవం పాల్జేసిన మీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలు అవుతున్నది.ఇప్పటికీ ఓటమి ని జీర్ణించుకోలేకపోతున్నాను. అసలు నమ్మలేకపోతున్నాను. నన్ను విడిచి ఒక్కొక్కరు వెళుతున్నారు.
అసలు తట్టుకోలేని విషయం ఒకటో తారీఖునే జీతాలు ఇచ్చేస్తున్నారు.
పెంచిన పెన్షన్లు వలంటీర్ల అవసరం లేకుండా పంపిణీ చేస్తున్నారు.
ఖజానా అంతా ఖాళీ చేసినా మీరు బాగానే సర్దుబాటు చేసుకోగలుగుతున్నారు.
పైకి విమర్శిస్తాము కానీ.. మీరు ఇచ్చిన హామీలు ఒక్కోటి అమలు దిశగా వెళుతున్నారు.
ఇసుక, మద్యం పాలసీ మొదట్లో కొంచెం గజిబిజి ఉన్నా మేము ఎంత అరచి గోల చేసినా అంతా సెట్ అయిపోద్ది.

పెట్టుబడులు ఏంటండీ అలా వచ్చిపడిపోతున్నాయి?
నాలుగు నెలల్లో అరవై వేల కోట్లు.
బుర్ర పాడయిపోతుంది.
నా హయాంలో మా పేటీయమ్ బేచ్ కి సూట్లు వేసి హడావిడి చేసే వాళ్ళం.
అమరావతి, పోలవరం ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు.
యదావిధిగా మేము విషం కక్కుతాము.

వరదలు, తుపానులు ఇలాంటి విపత్తులొచ్చినపుడు..
మీ కష్టం చూసి సిగ్గుపడాలి మేము.
కాని అసలు సిగ్గులేకుండా బరితెగించి దుష్ప్రచారం చేస్తున్నాము.
మీరేమి అనరన్న ధైర్యం!
ఒక్కసారి తరచి చూసుకుంటే..
నా హయాంలో తీసుకున్న నిర్ణయాలు..
జరిగిన అక్రమాలు అన్యాయాలు..
అవనీతి.. దాడులు దుర్మార్గం..
చట్ట ఉల్లంఘనలు పట్ల మీరు మీ బృందం నిత్యం తీవ్ర విమర్శలు చేసారు.

నా అధికారం అంతమైన తర్వాత మీరు కఠిన చర్యలు తీసుకుంటారేమో అని గుబులు కలిగింది.
అందుకే హడావిడి గా తాడేపల్లి వదిలి బెంగుళూరు చెక్కేసాను.
ఎందుకైనా మంచిదని ఢిల్లీ వెళ్ళి లొల్లి చేసాను.
అసలే మీరు నెమ్మది.. ఎందుకొచ్చిన గోల అని తగ్గుతారు అని!
నా స్కెచ్ వర్కవుట్ అయింది.
మా వాళ్ళని అరెస్టు చేసినా నోటీసులు తో పాటు కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు.

మీరంటే భయం లేదు.
కానీ, మీ అబ్బాయి లోకేష్ అన్నా
పవన్ కళ్యాణ్ అన్నా
కొంచెం అదురు ఉన్నది.
మీరు వాళ్ళ బేటరీ కూడా తీసేసినట్టున్నారు.

ఇప్పటికీ నేను చేసింది కరెక్టే అని నమ్ముతున్నాను.
నేను నమ్ముకున్న వ్యవస్ధలు.. నన్ను ఎప్పటికప్పుడు నన్ను ఆదుకుంటున్నాయి.

ఇప్పటికీ అసలు ఎప్పటికీ అర్ధం కాని అర్ధం చేసుకోలేని విషయం ఏమిటంటే..మిమ్మల్ని మీ కుటుంబాన్ని నానా దుర్భాషలాడిన వారిని ఎందుకు వదిలేసారు?
మీ పార్టీ కి దేవాలయం లాంటి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వారిని గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి ఎందుకు బతిమలాడుతున్నారు?
నడిరోడ్డు మీద మీ కార్యకర్తల్ని ఊచకోత కోయించాను.
మీ నాయకుల్ని తుక్కు రేగ్గొట్టించాను.
మా యంపీ..
ఇప్పుడు మీ ఎమ్నెల్యే రాజుగారిని ఏకంగా ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టించాను.
అసలు నేనే కొడదామనుకున్నాను.
మా వాళ్ళు ఆపారు.
మిమ్మల్ని మీ అబ్బాయిని ఎంత ఇబ్బంది పెట్టానో నాకు ఇప్పటికీ గుర్తుంది.
అలాంటిది అది అనుభవించిన మీరెలా మరచి పోయారు?

అసెంబ్లీ గేటు దగ్గర ఛీఫ్ మార్షల్ని ఉసిగొలిపి మీ మీదకు పంపాను.
అతను నా కళ్ళలో ఆనందం కోసం మీ పట్ల దురుసు గా వ్యవహరించాడు.
అతని పట్ల మీ ఔదార్యం!
చాలా ఆశ్చర్యంగా ఉన్నది.
మితిమీరిన క్షమాగుణం.. దయ నేను తట్టుకోలేకపోతున్నాను.
నా బూట్లు నాకిన అధికారుల్ని మీరు క్షమించి వదిలేస్తున్నారు.
మీ సభ్యులు కూడా రాజీ చేసుకుని వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు.

ఇది అసలు ఊహించలేదు.
అచ్చెంనాయుడు ని చూస్తే భయం వేసేది.
అంతెత్తున ధ్వజస్థంభం లా ఉంటాడు.
విచిత్రంగా అతను కూడా ఏమీ అనటం లేదు.
ఇలా అనేక మందిని వేధించాను..
వెంటాడాను.
నాయకులు..
కేడరు.. అధికారులు
ఎవర్నీ వదలలేదు.
ఎన్నో అపచారాలు చేసాను.
ఎంతో కొల్లగొట్టాను.
మరెన్నో అక్రమాలు చేసాను.
అమరావతి మహిళలు రైతులు వృద్ధులను అయితే అత్యంత నీచంగా జుగుప్సాకరంగా వేధించాము.
వారిని మానసికంగా కృంగదీసి కొందరి చావుకు కారణమయ్యాను.

సాక్షాత్తూ మిమ్మల్నే ఎత్తేసాను. దొంగ కేసులు పెట్టి.
అంతెందుకు ఒక్కమాటలో చెప్పాలంటే అన్నిరకాలుగా విధ్వంసం చేసాను.

నన్ను మా వాళ్ళను అలా వదిలేస్తున్నారేంటండి!?

ఇంత సంయమనాన్ని నేనే తట్టుకోలేకపోతున్నాను.
మీ కేడరు, బాధితులు మీకోసం తల్లడిల్లిన వారి పరిస్ధితి ఏంటో మరి?

మీరు నిన్నొక మాట చెప్పారు.
కక్షరాజకీయాలు చేయను. నేనూ బాధితుడనే అని!
నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలి మీకు కచ్చితంగా!

మీ చేతుల్లో రాష్ట్రం బాగుపడుతుంది.
ప్రత్యర్ధుల రక్షణ కూడా మీరే బాధ్యత తీసుకుంటారు.
అంతా అమిరిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు నేనో నాలాంటి వాడో వస్తాడు.. అప్పుడు శుభ్రంగా ఖాళీ చేస్తాడు.
మీ వాళ్ళను ఊచకోత కోస్తాడు.
అప్పుడు మీ శాంతి వచనాలు అక్కరకు రావు.
మీ కేడరు ఇప్పటికే కాడి పడేసారు.
మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలియటం లేదు.
మీ సామాజిక వర్గం దాదాపు అరవై డభ్బై శాతం మీకు దూరం జరిగారు.
మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు కష్టం లో అండగా నిలవరు.
ఇది చరిత్ర చెప్పిన సత్యం!

మీకు నాకూ తేడా ఉంది చాలా!
మీరు సౌమ్యులు..
నేను క్రూరుడను.
మీరు అభివృద్ధి కాముకులు..
నేను విధ్వంసకారుడిని!
మీరు వ్యక్తులకు ఉపయోగపడరు..
మొత్తం సమాజ హితం కోరతారు.
నేను నా వాళ్ళను చూసుకుంటాను..
సమాజం ఏమైపోయినా పర్వాలేదనుకుంటాను.
ఇలా అనేక విషయాల్లో మన ఇద్దరి మధ్య హస్తిమసికాంతరం ఉన్నది.

కాని మీకు కష్టం వస్తే ఇన్నాళ్ళూ నిలబడే వాళ్ళుండేవారేమో..
ఇప్పుడు ఉండరు.
అదే నాకోసం తలతీసే వారు.. తల ఇచ్చేవారు ఉంటారు.

ఏది ఏమైనా మీరు ఆదర్శవంతులు!
తెలుగు వాడిగా గర్వపడుతున్నాను.
ఒక రకంగా ఈర్ష్యగా ఉన్నది.

ప్రజలు ఓడించారు.
మీరు నన్ను రాజకీయంగా పూడ్చిపెట్టేసారు.
నేను మాంసం కొట్టు పెట్టుకోమన్నాను.
మీరు వేలాది కార్పొరేట్ ఉద్యాగాలు ఇచ్చి నా మీద పై చేయి సాధిస్తున్నారు.

మరొక్కసారి మీ ఔదార్యానికి.. పెద్దమనసుకి ప్రణామములు!
చివరగా మీ కేడరు ఎందుకు అసహనంగా ఉన్నారో చూసుకోండి.

ఇప్పటికింతే సంగతులు!
కొద్దిరోజుల్లో మరొక లేఖ ద్వారా క్షేమసమాచారములు తెలియచెయ్యగలవాడను.

ఇట్లు
మీ ప్రియమిత్రుడి సుపుత్రుడు

– అడుసుమిల్లి శ్రీనివాసరావు

LEAVE A RESPONSE