వారం లోగా టెండ‌ర్లన్నీ పూర్తి కావాలి

-అన్ని ప‌నులు గ్రౌండ‌వ్వాలి
-అధికారుల్లో అల‌స‌త్వాన్ని స‌హించేది లేదు
-నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే అధికారుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వు
-పంచాయ‌తీరాజ్ ప‌నుల గ్రౌండింగ్ ఆల‌స్యంపై మంత్రి ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం
-ఎమ్మెల్యేల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌నులు పూర్తి చేయాలి
-సిఎం కెసిఆర్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాలి
-రాష్ట్రంలోని రోడ్ల‌న్నీ అద్దంలా మెర‌వాలి
-పనుల పురోగ‌తి, అధికారుల ప‌నితీరును మ‌ధింపు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు
– పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ప‌నుల‌పై సంబంధిత‌ అధికారుల‌తో టిఎస్ ఐఆర్‌డి లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మీక్ష‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 24ః సిఎం కెసిఆర్ ఆదేశానుసారం ఈ వారం రోజుల్లోగా టెండ‌ర్లు పూర్తి కావాలి. అన్ని ప‌నుల‌ను గ్రౌండింగ్ చేయాలి. కాంట్రాక్ట‌ర్లు రావ‌డం లేద‌ని ఏవేవో క‌బుర్లు, కార‌ణాలు చెప్పొద్దు. అధికారుల్లో అల‌స‌త్వాన్ని స‌హించేది లేదు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే అధికారుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వు అంటూ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్‌రక్తం చేశారు. ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే సంబంధిత నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. కాంట్రాక్ట‌ర్ల‌తో మాట్లాడండి. ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌నులు పూర్తి కావాలి. పనుల పురోగ‌తి, అధికారుల ప‌నితీరును మ‌ధింపు చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ప‌నుల‌పై సంబంధిత‌ అధికారుల‌తో టిఎస్ ఐఆర్‌డి లో మంత్రి స‌మీక్ష చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడ‌త‌లుగా మ‌నంద‌రి మీద న‌మ్మ‌కంతో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు కావ‌ల్సిన‌న్ని నిధులు ఇచ్చారు. కెసిఆర్ గారి ఆశీస్సుల‌తో… రూ.2,669.74 కోట్ల అంచ‌నా వ్య‌యంతో, 3009 ప‌నులు నిర్ణ‌యించి, మంజూరు చేశాం. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 2,109 ప‌నుల‌కు మాత్ర‌మే టెండ‌ర్లు వ‌చ్చాయి. ఇంకా 900 ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వాల్సి ఉంది. వీటిని తొందర‌గా సెటిల్ చేయాలి. వారం రోజుల్లోగా అన్ని ప‌నుల‌కు టెండ‌ర్లు పూర్తి కావాలి. అన్ని ప‌నులు గ్రౌండ‌యి ఉండాలి. జ‌రుగుతున్న ప‌నుల్లో వేగం పెంచాలి. నాణ్య‌త‌లో రాజీ వ‌ద్దు. నిర్ణీత గ‌డువులోగా ప‌నులు పూర్తి చేయ‌డంపై దృష్టి పెట్టండి అంటూ మంత్రి ఎర్ర‌బెల్లి పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు హిత‌వు ప‌లికారు. ఇప్ప‌టికే ఆయా ప‌నుల్లో కొంత వెసులుబాటును కూడా క‌ల్పించినాం. అయినా ప‌నులకు టెండ‌ర్లు రావ‌డం లేద‌న‌డాన్ని ఇంజ‌నీర్ల అస‌మ‌ర్థ‌త‌గా భావించాల్సి వ‌స్తుంది. ఆ అవ‌కాశం ఇవ్వొద్దు. అధికారులు కాంట్రాక్ట‌ర్ల‌తో మాట్లాడండి. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని, వాటి ప‌రిష్కారాలు చూపండి. మీ నుంచి కాని స‌మ‌స్య‌లు మా దృష్టికి తీసుక రండి అంటూ మంత్రి తెలిపారు. అలాగే జిల్లాల వారీగా నివేదిక‌ల‌ను ప‌రిశీలించి, ఆయా జిల్లాల ప‌నితీరును స‌మీక్షించారు. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి… ఆయా చోట్ల ప‌నుల వేగ‌వంతానికి అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు మంత్రి ఇచ్చారు.

ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకునే అధికారులు కొంద‌రు స‌మ‌ర్థవంతంగా ప‌ని చేస్తున్నారు. స‌మ‌న్వ‌యం కాని చోటే ప‌నుల టెండ‌ర్లు, గ్రౌండింగ్ ఆల‌స్యం అవుతున్న‌ది. స‌క్సెస్ ఫుల్ గా ప‌ని జ‌రుగుతున్న చోట మీ స‌హ‌చ‌రులైన ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో మాట్లాడండి. వారి ప‌ద్ధ‌తులు అవ‌లంబించండి. తద్వారా మంచి ఫలితాలు సాధించ‌వ‌చ్చు అని మంత్రి అన్నారు. స‌మ‌స్య‌ల‌ను అదిగ‌మించాలి. సాకుల‌తో కాలం వెల్ల‌దీయ‌వ‌ద్దు. ఈ ఆరు నెల‌ల్లోనే ఆయా ప‌నుల‌న్నీ పూర్త‌య్యే విధంగా చూడాలి. కొంచెం క‌ష్ట ప‌డండి. క‌చ్చితంగా మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఆ క్రెడిట్ కూడా మీకే ద‌క్కుతుంది. ప్ర‌భుత్వానికి కూడా మంచి పేరు వ‌స్తుంది. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది. అని మంత్రి ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు వివ‌రించారు.

ఆయా ప‌నుల ప్ర‌గ‌తిని, టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను క్షేత్ర స్థాయిలో ఇ ఎన్ సి, ఇసి, ఎస్ ఇ లు ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి అదేశించారు. సిఎం కెసిఆర్ మ‌నంద‌రి మీద న‌మ్మ‌కంతో.. గ్రామాల‌ను అద్దంగా మార్చే, అభివృద్ధి చేసే అద్భుత‌మైన అవ‌కాశాన్ని ఇచ్చారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుందాం. మ‌న విధుల‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తిద్దాం. నిధుల‌ను అంకే స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేద్దాం. కెసిఆర్ గారి ఆలోచ‌న‌ల మేర‌కు ప్ర‌జ‌ల ముంగిట్లోకి అభివృద్ధిని తీసుకెళ్ళి చూపిద్దాం అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతోపాటు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇ ఎన్ సి సంజీవ‌రావు, సిఇ సీతారాములు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన పంచాయ‌తీరాజ్ ఎస్ ఇ ఇలు, ఇఇలు, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు పాల్గొన్నారు.