Suryaa.co.in

Telangana

కట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్లు దొబ్బడానికే

-కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరివ్వలేదు
-ఈ ప్రాజెక్టువల్ల ఏటా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద పడే భారం 8 వేల 677 కోట్ల రూపాయలు
-మంచి నీళ్ల సంబురాల పేరుతో కోట్లు ఖర్చు
-అసలు కాలువలే తవ్వకుండా కొత్త ఆయకట్టు ఎట్లా సాగులోకి వస్తుంది?
-కేసీఆర్ అద్బుత ఇంజనీరింగ్ అంటే ఇదేనా?
-లెక్కలు చూసుకుందాం.. వస్తారా..?
-శాసనమండలి మాజీ సభ్యులు, బిజెపి తమిళనాడు రాష్ట్ర సహా ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఈ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో 21 రోజుల సంబురాలు చేసుకుంటోంది. నిన్ననే చూసిన మంచి నీళ్ల సంబురాల పేరుతో కోట్లు ఖర్చు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా నీటిపారుదల రంగానికి 1 లక్షా 55 వేల 210 కోట్ల 86 లక్షలు రూపాయలు ఖర్చు చేసింది. తద్వారా 17 లక్షల 23 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరందించినట్లు చెబుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో విడుదల చేసిన ప్రగతి నివేదికలో చెప్పింది.

అదే నివేదికలో ఇంకో విచిత్రమైన మాట చెప్పారు… ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరిచ్చామని చెప్పింది. ఇది కాకుండా ఆ ప్రాజెక్టు ద్వారానే 18 లక్షల 82 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామని చెబుతోంది. ఇదెట్లా సాధ్యం? అదే నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చినప్పుడు.. ఈ ప్రాజెక్టు ద్వారా 19 లక్షల 63 వేల ఎకరాల ఆయకట్టును స్రుష్టించినట్లు చెప్పారు.

అలాగే ఇరిగేషన్ శాఖ వెబ్ సైట్ లో కాళేశ్వరం ద్వారా 57 వేల ఎకరాలకు సాగునీరందించినట్లు చెప్పారు. ఇందులో ఏది నిజం? మీవన్ని తప్పుడు లెక్కలు, అంకెల గారడీ చేస్తున్నారనడానికి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నడు.

రీడిజైన్ల పేరుతో లక్షకుపైగా కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సాధించేదేమిటయ్యా అంటే గుండు సున్నా. పైగా ఈ ప్రాజెక్టువల్ల ఏటా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద పడే భారం ఎంతో తెలుసా? 8 వేల 677 కోట్ల రూపాయలు. ఈ ఏడాది వచ్చిన బిల్లు ఇది. అంటే ఒక్క ఒక్క ఎకరానికి 47 వేల రూపాయల ఖర్చు అవుతుందన్న మాట. ఒక రైతు ఎకరా వడ్లు పండిస్తే కూడా ఇంత పంట రాదు… మెడ మీద తలకాయ ఉన్న వాడెవడైనా సరే… ఇట్లా చేస్తాడా?

ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే… కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరివ్వలేదు. నీళ్లు పంపింగ్ చేయడానికే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఏమనుకోవాలి? ఇట్లాంటి అద్బుత ఇంజనీరింగ్ నైపుణ్యం కేసీఆర్ కే సాధ్యం… ఎందుకంటే ఆయన నదులకే నడక నేర్పినోడు కదా…. నేను సవాల్ చేస్తున్నా…. నువ్వు నిజంగా 18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరిచ్చినట్లు చెబుతున్నవ్ కదా… ఆ వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. అయినా నాకు అర్ధం కాని ప్రశ్న ఒక్కటే కాళేశ్వరం, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు కట్టినవ్… కానీ కాలువలే తవ్వలే… అసలు కాలువలే తవ్వకుండా కొత్త ఆయకట్టు ఎట్లా సాగులోకి వస్తుంది? కేసీఆర్ అద్బుత ఇంజనీరింగ్ అంటే ఇదేనా?

2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాక కొత్తగా కట్టిన ప్రాజెక్టులవల్ల అదనంగా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? మీకు దమ్ముంటే మీరు కట్టిన ప్రాజెక్టులవల్ల ఏ నియోజకవర్గానికి ఎన్ని ఎకరాలకు కొత్తగా సాగునీరందించారో శ్వేత పత్రం విడుదల చేస్తారా?

డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DoES) లెక్కల ప్రకారం… తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2 కోట్ల 76 లక్షల ఎకరాలుంటే అందులో 61 లక్షల 77 వేల ఎకరాలు అటవీ భూమి. 34 లక్షల 59 వేల ఎకరాలు బీడు భూములు. 22 లక్షల 23 వేల ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు (రియల్ ఎస్టేట్, వాణిజ్యం) వినియోగిస్తున్నారు.

ఇక మిగిలింది 1 కోటి 6 లక్షల ఎకరాల భూమి మాత్రమే సాగు యోగ్యమైనది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కట్టిన భారీ, మధ్య రతహా, చిన్న ప్రాజెక్టుల ద్వారా 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందుతోందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నయ్. మిగిలిన భూములన్నీ బోర్లపైనే ఆధారపడి సాగవుతున్నయ్. అంటే తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూమిలో దాదాపు 84% బోర్‌వెల్ నీటిపారుదలపై ఆధారపడి ఉందని ఈ నివేదిక చాలా స్పష్టంగా చెబుతోంది.

అంతేకాదు… తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 18 లక్షలకుపైగా వ్యవసాయ బోర్లుండేవి. ఈ పదేళ్లలో ఆ సంఖ్య 26 లక్షలు దాటింది. అంటే బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది. నువ్వు నిజంగా ప్రాజెక్టులు కట్టి ఉంటే, అవి సాగులోకి వచ్చి ఉంటే బోర్ల సంఖ్య తగ్గేది. కానీ తగ్గకపోగా పెరిగిందంటే…నువ్వు ఒక్క ప్రాజెక్టు కూడా అదనంగా కట్టలేకపోయావని… ఒకవేళ కట్టిన ప్రాజెక్టులన్నీ కమీషన్లు దొబ్బడానికేనని అర్ధమైతుంది…

తొమ్మిదేండ్లలో ఏదో సాధించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీటి సంబురాలు చేసుకుంది.. కాలం కలిసి వచ్చి పుష్కలంగా వర్షాలు పడి రాష్ట్రమంతా చెరువులు, కుంటల్లో నిండుగా నీళ్లున్నాయి తప్పితే కేసీఆర్ గొప్పతనమేం లేదు. పైగా సాగునీటి రంగాన్నే నిండా ముంచి ప్రజల సొమ్మును ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నడు.

ఈ దోచుకోవాలనే ఐడియా కేసీఆర్ కు ఇప్పటిది కాదు.. తెలంగాణ వచ్చిన కొత్తలోనే అసెంబ్లీలో(2016లో) ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తామంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు రంగుల కల చూపించిండు… కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు నిన్న అక్కడెందుకు పండుగ జేయలే. అక్కడేం లేదు గనుకే కొబ్బరికాయ కూడ కొట్టలే. ఒక్క మంత్రి కూడా అటువైపు పోలే. మేడిగడ్డ కాడా మునిగిన పంపులు.. ఖరాబైన మోటార్లు తప్ప అక్కడేం లేదు.

ఏడాది నుంచి అటు వైపు జనాన్ని, ప్రజా ప్రతినిధులను పోకుండా పోలీసులను పెట్టిన కేసీఆర్.. చివరకు ఆయన కూడా అక్కడికి పోయే పరిస్థితి లేదని ముఖం చాటేసిండు. పంపు హౌస్ ల డిజైన్లలో కేసీఆర్ తలదూర్చినందుకే నిరుడు వరదలకు మెడిగడ్డ (కన్నెపల్లి), అన్నారం పంపుహౌస్ లు మునిగిపోయినయ్. ఇంజనీర్లందరూ కేసీఆర్ నిర్వాకం చూసి నవ్వుకుంటున్నరు.

తండ్రీకొడుకులు.. బిడ్డ, అల్లుడు మొత్తం కల్వకుంట్ల కుటుంబం కుటుబమే గోబెల్స్ బ్యాచ్. వీళ్లు రాకముందు తెలంగాణలో రైతులకు పంటలు పండించుడు తెల్వదన్నట్లు, సాగునీళ్లే రాలేదన్నట్లు మాట్లాడుతున్నరు. కాళేశ్వరం ఒక్కటే మొత్తం రాష్ట్రమంతా నీళ్లు పారించినట్లు అబద్ధాలు ఆడుతున్నరు. కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకునేందుకు రిజర్వాయర్లు కట్టుకొని.. దానికి కాళేశ్వరం అని పేరు పెట్టుకున్నరు తప్ప తెలంగాణలో ఈ ఆరేండ్లలో ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా కాళేశ్వరం నీళ్లు అందలేదు.

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నీళ్లే.. ఇప్పుడు రాష్ట్ర మంతట పారుతున్నయి. ఆ నీళ్లు కాకుండా కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు ఎక్కడన్నా పారినట్లు నిరూపించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సత్తా ఉందా..? ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తుకు నీళ్లు ఎత్తిపోసినమని చెప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ ఎల్లంపల్లి దాకా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నరా… కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎన్ని.. ఎల్లంపల్లి నుంచి గేట్లు ఎత్తి గోదావరి లో వదిలేసినవెన్నో.. లెక్కలు చూసుకుందాం.. వస్తారా..?

కాళేశ్వరం నుంచి ఏడాదికి 195 టీఎంసీలను ఎత్తిపోస్తమని కోతలు కోసిందీ ప్రభుత్వం. మొత్తం నాలుగేండ్లలో 154 టీఎంసీలు ఎత్తిపోసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎల్లంపల్లి నుంచి గేట్లు ఎత్తి వదిలేసిన నీళ్లు ఎన్నో లెక్క తీస్తే.. హళ్ళికి హళ్లీ సున్నకు సున్నా. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు.. భారీ ఎత్తుకు నీళ్లు ఎత్తిపోసిందని చెప్పుకుంటరు. నీళ్లు ఎక్కడ పారినయంటే చూపెట్టరు. అసలు వీళ్లు రాకముందు రైతులు పంటలు పండించలేదు. అప్పుడు సాగునీళ్లే రాలేదన్నట్లు మాట్లాడుతున్నరు. కాళేశ్వరం ఒక్కటే మొత్తం రాష్ట్రమంత నీళ్లు పారించినట్లు అబద్ధాలు ఆడుతున్నరు.

ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 32 ప్రాజెక్టులు తెలంగాణ వచ్చే నాటికే దాదాపు 70 శాతం పూర్తయ్యాయి.. వాటి కోసం ఇంకో రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 34 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. ఈ విషయం తెలిసినా కేసీఆర్ వాటిపై ద్రుష్టి పెట్టలే. ఎందుకంటే అవి పూర్తయితే కమీషన్లు రావని వాటిని పక్కన పెట్టిండు. నిజానికి అక్కరకొచ్చే ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతల పథకం అసలు పనికి రాదని పక్కనపెట్టింది కేసీఆరే. కేవలం రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కాదని.. రీడిజైనింగ్ లక్ష కోట్లను కాళేశ్వరంలోనే ముంచిండు.

కేసీఆర్ ఫామ్హౌజ్కు నీళ్లు తెచ్చుకునేందుకు పైపులైన్లు, పంప్ హౌజ్ లు రిజర్వాయర్లు కట్టుకొని.. రైతుల భూములను బలవంతంగా లాక్కున్న కేసీఆర్ తెలంగాణలో ఇప్పటికీ ఒక్క ఎకరం ఆయకట్టుకు కూడా కాళేశ్వరం నీళ్లు అందలేదు. ఖర్చు పెట్టిన లక్ష కోట్లలో 90 శాతం అప్పులే. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ మొట్టమొదట పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు. ఇప్పటి కీ సగం పనులు కూడా కాలేదు. ప్రాజెక్టు కు పర్మిషన్ లు సాధించాలనే ప్రయత్నం కూడా చేయలేదు.. ఎన్నికలు ముంచుకు వస్తుండటంతో ఇప్పుడు ఢిల్లీలో పర్మిషన్ల పేరుతో హడావుడి మొదలు పెట్టారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం సమైక్యం రాష్ట్రంలో కంటే అన్యాయమైన వివక్ష చూపించిండు.

పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో కృష్ణా నీళ్లు తెచ్చుకునే ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు లో కేసీఆర్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయించలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే పనులు ఆగిపోయాయో ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. కాళేశ్వరం తప్ప కేసీఅర్ మొదలు పెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు ఈ తొమ్మిదేండ్లలో పూర్తి కాలేదు. అప్పుడు జలయజ్ఞంలో చేసిన ప్రాజెక్టులనే పాక్షికంగా పూర్తి చేసి 13 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలిగారు తప్ప.. కాళేశ్వరం తోనే కోటి ఎకరాల తెలంగాణ మాగాణం అయ్యిందని చెప్పుకునుట్ల కేసీఆర్ గోబెల్ నుంచి మించిపోయిండు.

కృష్ణా నదిని, శ్రీశైలం ప్రాజెక్టునే మళ్లించుకునేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, రాయలసీమ (సంగమేశ్వరం) ఎత్తిపోతల పథకాలు చేపట్టినా కేసీఆర్ ప్రభుత్వం చడీ చప్పుడు చేయలేదు. నీళ్లు కోసం తెలంగాణ ఉద్యమం చేసిన ప్రజలను మోసం చేసేందుకు రాయలసీమ ను రతనాల సీమ చేస్తానని.. కేసీఆర్ ఆంధ్రాకు పోయి మాట్లాడింది ఇక్కడ జనం మరిచిపోలేదు.

తెలంగాణ ఉద్యమంలో నదిగడ్డ (గద్వాల) ప్రాంతానికి ఆర్డీఎస్ నీళ్ల కోసం కేసీఅర్ పాదయాత్ర చేశారు.. అధికారంలో తొమ్మిదేళ్లుగా ఉన్నా.. ఆర్డీఎస్ ఆధునీకరణ కు పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పై 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఏడేండ్ల కిందట అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టిని కాదని వార్డాపై బ్యారేజీ ఎందుకు నిర్మిస్తున్నారు.. కాళేశ్వరం రీ డిజైన్ లోని లోపాలు బయట పడుతాయనా?.. అప్పుడు రూ.750 కోట్లతో కడుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రూ. 4 వేల కోట్లకు పైగా పెంచింది నిజం కాదా..?

ఇంజనీర్లు వద్దని మొత్తుకున్నా వినకుండా.. కల్వకుర్తి పంపుహౌస్ (ఎల్లూరు) కు దగ్గరలో (400 మీటర్ల దూరంలో) పాలమూరు పంపు హౌస్ కోసం పేలుళ్లు చేపడితే ఏమైంది. ఎల్లూరు పంప్ హౌజ్ మనిగిపోయింది. ఇప్పటివరకు అది బయటకు రాలేదు. ప్రాజెక్టు ల మెయింటనెన్స్ కు నిధులు ఇవ్వక కడెం గేటు, మూసీ ప్రాజెక్టు ల గేట్లు కొట్టుకుపోలేదా?. సరళాసాగర్ ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇసుక దొరుకుతుంది కదా అనే మంత్రులు మీ క్యాబినెట్ లో ఉన్నారా లేరా? నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని మన వాటా నీళ్లు కూడా మనకు దక్కకుండా పోతున్నయ్. ముఖ్యంగా కృష్ణా నదీ జలాలను కాపాడడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు 15.9 TMC జలాలు ఇవ్వాలనే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) దశాబ్దం దాటినా పూర్తి చేయలేకపోవడంతో 5 టీఎంసీల నీరు కూడా వినియోగించుకోలేని దుస్థితిలో ఉన్నం. ఎన్నికలొస్తే మాత్రం కేసీఆర్ దీని గురించే మాట్లాడుతూ సెంటిమెంట్ ను వాడుకోవాలని చూస్తున్నరు. గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన 1 లక్షా 55 వేల 210 కోట్ల 86 లక్షలు రూపాయల డబ్బు ఎటు పోయింది? ఆ సొమ్మంతా కాంట్రాక్టర్ల ద్వారా కేసీఆర్ కుటుంబానికి చేరింది. అక్కడి నుండి హవాలా ద్వారా విదేశాలకు పోయింది.

తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడంలో కేసీఆర్ విఫలమయ్యారు. బండి సంజయ్ గారు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేదాకా (12 మే 2020న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి జలశక్తికి లేఖ రాశారు) కేసీఆర్ కు సోయే లేదు.. సంజయ్ గారి లేఖకు కేంద్ర మంత్రి వెంటనే స్పందించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ఈ ప్రాజెక్టుల నిర్మణాన్ని ఆపాలని కృష్ణా బోర్డును కోరితే… ఆ బోర్డు (KRMB) తెలంగాణ చట్టబద్ధమైన ప్రయోజనాలను కాపాడాలని AP ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు (15 మే 2020, 20 మే 2020, 16 జూన్ 2020, 1 జూలై 2020 మరియు 30 జూలై 2020 తేదీల్లో) రాసింది. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కనీసం కేంద్రానికి లేఖ రాయలేదు. సాయం కోరలేదు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (LIS) ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న సమయంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరిస్తూ బండి సంజయ్ గారు మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తూ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (29 జూలై 2020న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి, జలశక్తికి రాసిన లేఖ) ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం వెంటనే స్పందించి 2020 ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటే…ఆ సమావేశానికి కేసీఆర్ వెళ్లలేదు.

చాలా బిజీగా ఉన్నాను… సమావేశాన్ని మరోసారి వాయిదా వేయమని చెప్పిండు… నేనడుగుతున్న తెలంగాణా ప్రజల నీటి హక్కులను కాపాడడం కంటే కేసీఆర్ కు ముఖ్యమైన పనేముంది? వాయిదా కోరడం ద్వారా APకి సహాయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆడిన డ్రామా మాత్రమే. సీఎంలిద్దరూ ఒకరికొకరు కుమ్మక్కై తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో కృష్ణా జలాలను ఏపీ దోచుకోవడం వల్ల తెలంగాణ శాశ్వతంగా నష్టపోవాల్సి వస్తోంది. నేనే నిఖార్సైన తెలంగాణ వాదినని అడ్డం పొడుగు మాటలు మాట్లాడిన కేసీఆర్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టడం సిగ్గుచేటు.

ఇంకా దుర్మార్గమైన విషయం ఏందంటే….. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా కేటాయించాని బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిస్తే… అందులో తెలంగాణ వాటా 555 టీఎంసీలు రావాలి. కానీ కేసీఆర్ మాత్రం 299 టీఎంసీలకే అంగీకరించి కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను పూర్తిగా కాలరాశారు. 2015 జూన్ 19న కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లోనూ, కేసీఆర్ హాజరైన 1వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించాలని చర్చ జరిగితే… కేసీఆర్ పూర్తిగా అంగీకరించి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.

ఇట్లాంటి మనిషి.. ఇయాళ నీళ్ల పండగ పేరుతో సంబురాలు చేసుకుంటూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు. తెలంగాణ ముసుగేసుకుని 4 కోట్ల ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ సిగ్గులేకుండా అబద్దాలు చెబుతుంటే రక్తం మరిగిపోతోంది. ప్రజలకు కేసీఆర్ నైజం అర్ధమైంది. కర్రు కాల్చి వాతపెట్టేందుకు ప్రజలు సిద్దమైనరు.

నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలే…. నీకు దమ్ముంటే, నేను చెప్పేది అబద్దాలనుకుంటే బహిరంగ చర్చకు రా…. నీటి ప్రాజెక్టుల పేరుతో నువ్వు దోచుకున్నదెంత? నీళ్లు ఇచ్చింది ఎంత? సొంత ఫాంహౌజ్ కు వాడుకున్నదెంత? నీటి కేటాయింపుల్లో ఏపీకి, మహారాష్ట్రకు దోచిపెట్టిందెంత? అనే వివరాలు లెక్కలతో సహా బయటపెట్టేందుకు నేను సిద్దంగా ఉన్నా… డేట్, టైం ఫిక్స్ చేయ్…. నీకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా నా సవాల్ ను స్వీకరించాలి. లేకుంటే నువ్వు ఇరిగేషన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నావనే మా ఆరోపణలు నిజమని అంగీకరించినట్లేనని తెలంగాణ ప్రజలు కూడా అర్ధం చేసుకుంటారు.

LEAVE A RESPONSE