Suryaa.co.in

Andhra Pradesh

సాగర్ నీటి విడుదలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు?

-ప్రభుత్వ తప్పిదాల వల్ల నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్తుంది
-పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఫైర్

రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుంటే ప్రభుత్వం మాత్రం సాగర్ నీటి విడుదలపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల సమన్వయ లోపం కారణంగా పచ్చని పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయన్నారు. మాగాణి భూములకు సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం ,జిల్లా అధికార యంత్రాంగం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇస్తే లక్షలాది ఎకరాల్లో వరి పైరు సాగు చేస్తారని పేర్కొన్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతుంటే ప్రభుత్వ తప్పిదాల వల్ల నీరంతా వృధాగా సముద్రంలోకి వెళ్తుందన్నారు. గత ఏడాది సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చివరి భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో బంగారం పండే భూములను రైతులు బీడు భూములుగా వదిలేస్తున్నారన్నారు.

రైతులు ఆయకట్టు పరిధిలో మాగాణి భూముల రైతులు సాగర్ నీరు రావడంలేదని వరి పైరు వేయక బీడు భూములుగా దర్శనమిస్తున్నాయన్నారు. మరి కొందరు రైతులు సాగర్ నీటిపై స్పష్టత లేక ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారని చౌడు భూములలో నీటి ఊటతో పంటలు పండక రైతుల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సాగర్ కుడికాలువ పరిధిలోని పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో సుమారు 11.16లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఆలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టతనిస్తే ఆంధ్రప్రదేశ్లో ధాన్యపు రాశులు పండించే రైతాంగం ఉందన్నారు.

వరి పంటతో ఆహార కొరత ఉండదన్నారు ఇటు రైతులు సంతోషంగా సాగు చేస్తారని పేర్కొన్నారు. పశువులకు సైతం గ్రాసం సమస్య ఉండదన్నారు. పంటలు పండు భూములకు నీరు విడుదల చేయకపోతే ప్రభుత్వ వైఫల్యమే కారణం అవుతుందన్నారు. గత ఏడాది సంఘటనలు పునరావృత్తం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మాగాని భూములకు నిరం అందించేలా ప్రత్యేక ప్రణాళిక చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఎన్ ఎస్ పి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

LEAVE A RESPONSE