అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి అల్లు కనకరత్నమ్మ మృతి

– అత్తగారి పాడె మోసిన చిరంజీవి, మనవడు అల్లు అర్జున్

హైదరాబాద్‌: అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ తల్లి , అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడి చారు.

శనివారం ఉదయం 9 గంటలకు ఆమె పార్థివదేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహిం చారు. షూటింగ్‌ల నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ నుంచి మధ్యాహ్నానికి నగరానికి చేరుకున్నారు.

అల్లు అరవింద్‌, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. పవన్ కల్యాణ్, నాగబాబు వైజాగ్‌ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నందున, వారు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిసింది.

నానమ్మ మరణవార్త తెలిసిన వెంటనే, ముంబైలో తన సినిమా షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇంటికి చేరుకుని నానమ్మ భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు.

అల్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ వారి నివాసానికి వెళ్లారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తన బావమరిది అల్లు అరవింద్‌ను, తీవ్ర వేదనలో ఉన్న అల్లు అర్జున్‌ను చిరంజీవి ఓదార్చారు. చిరంజీవిని చూడగానే అల్లు అర్జున్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది.

చిరంజీవి తన అత్తమ్మ కనకరత్నమ్మ పాడెను భుజాలపై మోశారు. అల్లు అర్జున్ తో కలిసి ఆయన కనకరత్నమ్మ పాడెను మోశారు. రామ్ చరణ్ కూడా అక్కడే ఉండి, అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిచారు.

అల్లు కనకరత్నమ్మ మర‌ణ‌వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, అల్లు అరవింద్ సన్నిహితులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply