– బిఆర్ఎస్ ప్రకటించిన లక్షను కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై పడిన వడ్డీభారం 11,145 కోట్లు.
– నాట్లు వేసే సమయం కాదు.. కోతల సమయానికి కూడా రైతు బంధు అందించని బిఆర్ఎస్
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: భూమికి, విత్తనానికి ఉన్న సంబంధం.. రైతు, కాంగ్రెస్ పార్టీది. రైతు కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ అర్ధం చేసుకున్నంతగా ఏ పార్టీ అర్ధం చేసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్ 7, 2023 నుండి ఈ క్షణం వరకు రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చాలనే దీక్షతో పని చేస్తుంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగాన్ని తిరిగిలో గాడిలో పెట్టేందుకు ఏడాదిలోనే రైతు సంక్షేమానికి రూ. 54,280 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ధాన్యం కొనకుండా వరి వేస్తే ఉరి అని బెదిరిస్తే వరికి రూ.500 బోనస్ ఇస్తామనే ప్రకటనతో ఈ ఏడాది వరి సాగులో పంజాబ్ ను వెనక్కి నెట్టి 1.53 కోట్ల టన్నుల దిగుబడితో దేశంలోనే తెలంగాణ టాప్ నిలిచింది. వరికి బోనస్ రూపంలో రైతులకు రూ.1154.40 కోట్లు అందజేశాం.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే “రైతు రుణమాఫీ” “వరికి బోనస్” పథకాలను మా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంలో “రైతు భరోసా”, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాలను ప్రారంభించింది.
2018-19 నుంచి రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వడం ప్రారంభమైంది. ఆ సంవత్సరం యాసంగిలో రైతు బంధు సాయం 20-10-2018 నుంచి ప్రారంభించి 30-03-2019 నాటికి పూర్తి చేశారు. ఇందుకోసం 5 నెలల 11 రోజులు తీసుకున్నారు. తర్వాతి 2019-20 సీజన్లో యాసంగి సాయాన్ని 28-01-2020న ప్రారంభించి 16-03-2020న పూర్తి చేశారు. తర్వాతి సీజన్లో 2020-21 సీజన్లో 28-12-2020న ప్రారంభించి 22-03-2021న పూర్తి చేశారు. 2022-23 సీజన్లో 21-12-2022న ప్రారంభించి 18-05-2023న పూర్తి చేశారు.
ఇందుకోసం 4 నెలల 28 రోజులు తీసుకున్నారు. ఈ విధంగా దాదాపు ప్రతి యాసంగి సీజన్లో దాదాపు 5 నెలలపాటు రైతు బంధు సాయాన్ని ఒక ప్రహసనంలా సాగించారు. ఒక్క యాసంగి సీజన్ కాదు మొత్తం రైతు బంధు సాయానికి సంబంధించి గత 10 పంటకాలాల గణంకాలను పరిగణనలోకి తీసుకుంటే, ఏ ఒక్క సంవత్సరము కూడా 4 నెలలలోపు చెల్లించింది లేదు. దారుణమైన విషయం ఏమిటంటే నాట్లు పూర్తి అయి రైతు ధాన్యాన్ని అమ్మిన తర్వాత రైతులకు రైతు బంధు పూర్తి చేశారు.
గత ప్రభుత్వం యాసంగిలో ఇవ్వాల్సిన రైతు బంధుని ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చాక వానాకాలం మొదలు కాకముందే రూ. 7,625 కోట్లు ఒక్క నెలలోనే చెల్లించాం. గత ప్రభుత్వం రాళ్లు, రాప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు సాయం ఇచ్చి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. అలా కాకుండా మా ప్రభుత్వం నిజమైన రైతులకు మరింత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో… గతంలో రూ. 10 వేలు ఇస్తే.. మా ప్రభుత్వం 20 శాతం పెంచి ఏడాదికి ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.
అందుకోసమే సాగు భూముల సర్వే చేయడం జరిగింది. మొన్న జనవరి 26 ఎంపిక చేసిన 561 మండలాల్లోని 577 గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు రూ.569 కోట్ల రైతు భరోసా సాయం అందించడం జరిగింది. పథకాన్ని మొదలు పెట్టిన 24 గంటల్లోపే ఎకరాలతో నిమిత్తం లేకుండా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జయా అయ్యాయి. సాగు భూముల సర్వేను పూర్తి చేసి మార్చి 31లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తాం.
గత ప్రభుత్వం రైతు కూలీలను పూర్తిగా విస్మరించింది. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో రూ. 6 వేల చొప్పున రూ.10 కోట్ల నిధులను జమ చేశాం. మిగతా వారికి మార్చి 31లోపు పూర్తి చేస్తాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయానికి సగటున 4-5 నెలల సాయం తీసుకుంటే మేము మాత్రం మొదటి సారి నెల రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేస్తున్నాం. దీన్నిబట్టి రైతు భరోసా విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఎంటో అర్ధం చేసుకోవచ్చు.
దేశానికి అన్నంపెట్టే రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉంది. అందుకే మా ప్రభుత్వం రైతు భరోసాతోపాటు, ఆ పథకాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి బడ్జెట్లోనే రూ. 72 వేల కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించే పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నాము. గత పదేళ్లలో ఒక్కసారి కూడా మట్టి పరీక్షలు చేపట్టలేదు. మా ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించింది.
2014, 2018 రెండు ఎన్నికల్లో రూ. లక్షలోపు రుణ మాఫీ చేస్తానని మాట తప్పిన విషయాన్ని మరిచిపోయి బిఆర్ఎస్ నాయకులు ఒక్కరికి రుణ మాఫీ జరగలేదని ఆవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014-18 వరకు 16,143.94 కోట్లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో రుణ మాఫీ జరిగింది. దీనివలన రైతులపై రూ.2630 కోట్లు అధిక వడ్డీ భారం పండింది. 2018-23 వరకు రూ. 11,909.31 కోట్లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో జరిగింది. 20,85,832 మంది రైతులకు సంబంధించిన రూ. 8378.97 కోట్లు చేయలేదు. ఏకకాలంలో చేయకపోవడంతో రైతులపై రూ.8515 కోట్లు అధిక వడ్డీ భారం పడింది.
మీ ప్రభుత్వం 2014-23 వరకు నిర్దేశించిన సమయానికి రుణ మాఫీ చేయని కారణంగా రైతుల మీద రూ.11,145 కోట్ల వడ్డీ భారం పడింది. రైతుల మీద రుణ మాఫీ పేరుతో ఇంత భారం మోపిన మీకు రైతు రుణ మాఫీ గురించి మాట్లాడే హక్కు ఉందా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని 3,13,896 మంది రైతులకు తర్వాత రూ.2747.67 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. వీటిని చూడకుండా తమ ప్రభుత్వంలో మాదిరిగానే రుణ మాఫీ జరగలేదనే భ్రమల్లో ఉంటూ, అవే నిజాలుగా నమ్మజెప్పె ప్రయత్నం చేస్తున్నారు. భ్రమల్లో విహరించడం మాని దిగివచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.