Suryaa.co.in

Andhra Pradesh

విజ్ఞానంతో పాటు సద్వివేచన అత్యంత ఆవశ్యకం

• చదువుకోవటం ఎంత అవసరమో, సమాజాన్ని అర్థం చేసుకుని సామాజిక మనుగడలో భాగస్వాములు కావటం అంతే అవసరం
• ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపు
• షేర్ అండ్ కేర్ అనే జీవన సూత్రానికి ప్రాధాన్యతనివ్వాలి
• ప్రపంచ స్థాయి విజ్ఞానం, భారతీయ వివేచనతో నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి
• విజయవాడలోని కె.సి.పి.సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ ను సందర్శించిన వెంకయ్యనాయుడు
• విద్యార్థులతో కలిసి అల్పాహారం, అనంతరం మాటామంతీ

విజయవాడ, 4 నవంబర్ 2022: మానవజాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, విద్యద్వారా లభించే విజ్ఞానాన్ని సద్వివేచనతో సమాజ అవసరాలను అర్ధం చేసుకుని, అందుకోసం వినియోగించాలని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన కె.సి.పి. సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ ను సందర్శించి, అక్కడి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని సంపాదించటం అత్యంత ఆవశ్యకమన్న ఆయన, మన ఆలోచన మాత్రం భారతీయ విధానంలో ఉండాలని అప్పుడే పరిపూర్ణ అభివృద్ధి సాధ్యమౌతుందని సూచించారు. పాశ్చాత్య అనుకరణ ద్వారా మనదైన విధానాలను కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆయన, గుడ్డి అనుకరణ దేనిలోనూ పనికిరాదని సూచించారు.

విద్యను కేవలం ఉపాధి మార్గంగానే చూడకూడదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, నాలెడ్జ్ (విజ్ఞానం) కంటే విజ్ డమ్ (సద్వివేచన) అత్యంత ఆవశ్యకమని తెలిపారు. మనం విద్య ద్వారా నేర్చుకున్న దాన్ని సమాజ ప్రయోజనం కోసం వినియోగించుకోగలిగినప్పుడే మన చదువుకు సార్థకత చేకూరుతుందనిvenkaiah1 తెలిపారు. విద్యను మార్కుల కోసం నేర్చుకునే అక్షరాలుగా కాకుండా.. మనుగడ కోసం నేర్చుకోవలసిన సంస్కారంగా గుర్తించినపుడే విద్యార్థి సమగ్ర పురోగతి సాధ్యమవుతుందని, అప్పుడే భవిష్యత్ భారత నిర్మాణంలో వారు సమర్థవంతమైన పాత్రను పోషించగలుగుతారని ఆయన సూచించారు.

షేర్ అండ్ కేర్ (నలుగురితో పంచుకోవడం, అందరి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించటం) మన జీవన విధానంలో భాగం చేసుకోవాలన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, సేవలో లభించే సంతృప్తి ఉన్నతమైనదని తెలిపారు. సేవ చేయటం అంటే పెద్ద పెద్ద పనులు చేయడం మాత్రమే కాదని, మనకు చేతనైనంతలో నలుగురికీ సాయం చేయడం కూడా సేవ కిందకే వస్తుందని పేర్కొన్నారు. విద్యతో పాటు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవటం అత్యంత ఆవశ్యకమన్న ఆయన ఇందుకోసం యోగ, వ్యాయామాన్ని మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం చైతన్య రహిత జీవనశైలికి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి అలవాటు పడుతున్న యువత మేల్కొవలసిన అవసరం ఉందన్న ఆయన, మన భారతీయ ఆహారశైలి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని, విస్తృతమైన భారతీయ ఆహారపు విధానం చక్కని పోషణ అందిస్తుందని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్య సాధ్యమౌతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె.సి.పి.సిద్ధార్థ ఆదర్శ్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, బోధన – బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE