సీసీ కెమెరాల నీడలో పరుగు పందెం

చేతులకు రిస్ట్‌ బ్యాండ్‌లు

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల ఎంపికలో మలి అంకంపై తెలంగాణ రాష్ట్రస్థాయి నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) దృష్టి సారించింది. ప్రాథమిక రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల వడబోత పూర్తి కావడంతో ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ) వంటి శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. రాతపరీక్షలో సుమారు 2.69 లక్షల మంది అర్హత సాధించారు. వీరు పార్ట్‌-2 దరఖాస్తులు సమర్పించేందుకు నవంబరు 10 వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పీఈటీ పరీక్షలో భాగంగా తొలుత పరుగుపందెం నిర్వహించనుంది.

ఇందుకోసం మైదానాలను ఎంపిక చేసే పనిలో మండలి నిమగ్నమైంది. పోలీస్‌ శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లపై దృష్టి సారించింది. మొత్తం 12 కేంద్రాల్లో పోటీలు జరిగే అవకాశాలున్నాయి. వీటి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై మండలి ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
గతంలో పరుగు పోటీల నిర్వహణపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యేవి. పోటీలను పర్యవేక్షించే అధికారులు తమకు తెలిసిన అభ్యర్థుల విషయంలో అనుకూలంగా వ్యవహరించే వారన్న ఆరోపణలు వచ్చేవి. అభ్యర్థులు ముగింపు గీత దాటే సమయాల నమోదులో తేడాలకు ఆస్కారముండేది. అర్హత సాధించని అభ్యర్థులు ఆరోపణలు చేసేందుకు తావిచ్చేది. ఈ నేపథ్యంలో ఈసారి పరుగుపందెం పోటీలను సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు. అభ్యర్థి పరుగు ప్రారంభించినప్పటి నుంచి పూర్తి చేసేవరకు మొత్తం ప్రక్రియ కెమెరాల పర్యవేక్షణలో జరగనుంది. ముఖ్యంగా ప్రారంభ, ముగింపు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

పరుగును పూర్తి చేసిన సమయాన్ని బట్టి మార్కులు కేటాయిస్తారు. వీటిపై అభ్యర్థులెవరైనా అభ్యంతరం తెలిపితే కెమెరా ఫీడ్‌ను పరిశీలించనున్నారు. అలాగే అభ్యర్థులు మైదానంలో అడుగుపెట్టిన వెంటనే చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌ బ్యాండ్‌ తగిలించనున్నారు. దీనివల్ల వారు మైదానంలో ఏ సమయంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ పరిజ్ఞానాన్ని తొలిసారిగా వినియోగించనున్నారు. ఒక్కో మైదానంలో సుమారు 130 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించనున్నారు.

Leave a Reply