Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో బాబు బంగారు నాణేలు పంచిపెట్టినా గెలిచేది వైఎస్ఆర్సీపీనే

– ఇసుకా లేక ఈనాడుకు మసకా..?
బాబు హయాంలో రూ. 3,750 కోట్లు ఇసుక ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?
– టీడీపీ హయాంలో బాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడి జరిగినా ఈనాడు రామోజీకి కనిపించలేదా..?


రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

పారదర్శకంగా ఇసుక విధానం
గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, పారదర్శకమైన ఇసుక విధానం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులతో కమిటీ వేసి, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నూతన ఇసుక విధానం తీసుకురావడం జరిగింది. ఇసుక విధానంపై పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత అనేక మార్పులు, చేర్పులు చేశాం. ఇందులో భాగంగానే ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణాలకు, ఎడ్ల బండ్ల మీద ఇసుక తీసుకువెళ్ళే వారికి ఉచితంగా తీసుకువెళ్ళేందుకు వెసులుబాటు కల్పించాం. టెండర్ల విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చాం.

ఇసుకా లేక ఈనాడుకు మసకా..!
చెన్నై సంస్థ గుప్పిట్లో ఇసుక.. అంటూ ఈరోజు నాడు అసత్యాలతో కూడిన కథనాన్ని వండివార్చింది. ఇసుకా లేక ఈనాడుకు మసకా అన్నది ప్రజలకు అర్థమయ్యేందుకు నాలుగైదు అంశాలు ప్రజల ముందుకు తీసుకురావాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వేలం నిర్వహించినది ఏపీ ప్రభుత్వం కాదు. దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ ఎండీసీ(నేషనల్ మినరల్ డెవలప్ మెంటు కార్పొరేషన్) ద్వారా వేలం వేయించాం.

ఇందులో పాల్గొనదలచుకున్న వారు ఎవరైనా టెండర్లలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని వారికి అప్పగించి, దానికి రూ. 120 కోట్లు డిపాజిట్ చేసిన ఎవరైనా టెండర్ వేయవచ్చని చెప్పాం.

అందులో ఈనాడు రామోజీరావు పాల్గొనవచ్చు. చంద్రబాబు కూడా పాల్గొనవచ్చు. లేదా వారి బినామీలతో టెండర్లు వేయించి ఉండవచ్చు. ఆ రోజు వారెందుకు టెండర్లు వేయలేదన్నదానికి కూడా వారే సమాధానం చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఆఫీసులు ఉండి, ఢిల్లీ కేంద్రంగా ప్రధాన ఆపీసు ఉన్న జేపీ సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది.

అలాకాకుండా చెన్నై సంస్థకు ఇసుక.. పేరుకే జేపీ.. వాస్తవానికి టర్న్ కీ అంటూ ఈనాడు అబద్ధాలతో కూడిన వార్తలు రాసింది.

సబ్ కాంట్రాక్టు ఇవ్వడం అసాధారణమేమీ కాదని రామోజీ, బాబులకు తెలియదా..?
ఇందుకు సంబంధించిన నిజాలు తెలిసి కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటానికి, ఏదో అవినీతి జరిగిందనే ఇంప్రెషన్ ఇవ్వటానికి ప్రయత్నించారు.
కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ.. సబ్ కాంట్రాక్టులు ఇవ్వటం అన్నది అసాధారణం కాదని ఈనాడు రామోజీకి, చంద్రబాబుకు బాగా తెలుసు. వారి బంధువులు కూడా ఈ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు కదా.. ?

అది ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశం కాదని వీరికి తెలియదా.. దాన్ని ప్రభుత్వం నియంత్రించలేదు అన్న విషయం వీరికి తెలియదా..? అయినా పత్రికల్లో కథలు రాయటం ఎందుకు..?

సబ్ కాంట్రాక్ట్ అన్నది ఎవరికి ఇచ్చుకున్నా, కాంట్రాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా జరుగుతోందా లేదా అన్నది మాత్రమే ఏ ప్రభుత్వం అయినా చూస్తుంది.
అయితే, ఇసుక రవాణాలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా, పారదర్శకంగా లేకపోయినా, ఆ డిపాజిట్ సొమ్మును ప్రభుత్వం వశపరుచుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో.. తమిళం మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పనిలో ప్రావీణ్యత ఉన్నవారు ఉండొచ్చు, అందులో ఎటువంటి తప్పులేదు. సెంట్రింగ్ అంటే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు.. రాడ్ బెండర్స్ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువగా వస్తారు. అలానే ఇసుకకు సంబంధించి పనులు చేసేవారు తమిళనాడు నుంచిగానీ, మరి ఎక్కడ నుంచైనా రావొచ్చు. ఆరోపణలు చేసినా అర్థంపర్థం ఉండాలి.

ఇసుక తవ్వకాల్లోగానీ, రవాణాలోగానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు బ్యూరోను మా ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్రమాలు జరిగితే.. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరు 14500 ఏర్పాటు చేశాం. దీనికి ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటికే వేల కేసులు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు, 1400 వాహనాలను సీజ్ చేశాం.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 485 చెక్ పోస్టులు, రీచ్ లు దగ్గర వే బ్రిడ్జిలు పెట్టడం జరిగింది. ఏపీఎండీసీ ద్వారా వీటన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తేనే టోకెన్, వే బిల్లు జనరేట్ అవుతాయి. ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. అవాస్తవాలతో కూడిన రాతలు రాయడం మంచి పద్ధతి కాదు.

టీడీపీ హయాంలో బాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడి జరిగినా కనిపించలేదా..?
ఇసుక గురించి నిజాలు రాయాలన్న మనసు ఉంటే.. 2014-19 మధ్య చంద్రబాబు ఉన్న కృష్ణా కరకట్ట ఇంటికి పక్కనే జేసీబీలతో తవ్వుకు పోతున్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదో వారే చెప్పాలి. ప్రొక్లెయిన్లతో బాబు తవ్వుతుంటే చోద్యం చూశారు ఎందుకు..? మీకు కూడా అందులో వాటా ఉంటే అది ధర్మం అవుతుందా..? మీ పత్రికలకు, మీ టీవీలకు చంద్రబాబు వాటాలు పంపుతుంటే.. నిజంగా ఇసుక దోపిడీ జరిగినా మీకు కనిపించదా..? వేల కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. దాంతో, అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించి.. వంద కోట్లు జరిమానా వేయడం జరిగింది. అది కూడా ఈనాడుకు కనిపించలేదా..?

సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీడీపీ నాయకులు నదుల్ని దోచేస్తుంటే.. ఆరోజున మీరు నోరెత్తలేదు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతటినీ మింగేశారు.
వాటాలు బాగా దక్కితే ఈనాడు, ఏబీఎన్, టీవీ 5లకు చెడు కూడా మంచిగా.. వాటాలు దక్కకపోతే మంచి కూడా చెడుగా కనిపిస్తుందా..? మీ వాడికి అధికారం లేకపోతే అన్నీ అబద్ధాలు రాస్తారా..?

ఈరోజు టీడీపీ, వారి ఎల్లో మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు, వక్రీకరణలు చేసి తప్పుడు రాతలు రాయడం దురదృష్టకరం.

బాబు హయాంలో ఇసుక ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 750 కోట్లు ఇసుక మీద ఆదాయం వస్తోంది. అంటే అయిదేళ్ళలో దాదాపు రూ. 3,750 కోట్లు. జేపీనా.. టర్న్ కీనా అని అడిగే బదులు.. ఇంతటి ఆదాయాన్ని చంద్రబాబు, ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికినవారు గతంలో ఎలా తినేశారో ఎందుకు రాయటం లేదు. అది ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో ఎందుకు చెప్పటం లేదు. కళ్ళ ఎదుట నిజాలు కనిపిస్తున్నా ఈ మసక రాతలు ఎందుకు…?*

వనజాక్షిని చింతమనేని జుట్టుపట్టుకుని కొట్టినప్పుడు ఈనాడుకు కనిపించలేదా?
టీడీపీ హయాంలో ఇసుక దోపిడి ఎలా జరిగిందో, ఎమ్మార్వో వనజాక్షి గారిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకుని అదే ఇసుక రీచ్ లో లాగేసినప్పుడు ఈనాడుకు ఎందుకు కనిపించలేదు.

అంతటి నేరాన్ని దాచేసేందుకు చంద్రబాబు సెటిల్ మెంట్ ను తన ఇంటి దగ్గరే చేసినప్పుడు కూడా అది కూడా నేరం అనిపించలేదు. అసలు చింతమనేని మీద కేసే లేదు.

అప్పటికంటే ఇప్పుడు ఇసుక ధరలు తక్కువగానే ఉన్నా.. ప్రభుత్వం మీద ఏదో ఒకలా రాళ్ళు వేయాలన్నది ఈనాడు రామోజీ తాపత్రయం.ఇలాంటి రాతల్ని, ఇలాంటి పత్రికల్ని, ఇలాంటి రాజకీయాన్ని ప్రజలు 40 ఏళ్ళుగా భరించారు. ఇక భరించం అని వారు చెపుతున్నా.. ఈ దుష్ట చతుష్టయం వారి పద్ధతిలో వారి రాతలు, రాజకీయాలు నడుపుతున్నారు.

ఇసుకకు సంబంధించి తమిళనాడులో ఎటువంటి ఆంక్షలు లేవు. మన రాష్ట్రంలో ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ అక్రమంగా తరలిస్తే.. పోలీసు యంత్రాంగం, ఎస్ఈబీ చర్యలు తీసుకుంటుంది. చెత్త రాతలు రాసి.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సరికాదు. అలాగే, ఆరాని నదిలో అక్రమాలు జరిగిపోతున్నాయంటూ వర్ల రామయ్య లేఖ రాశాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. మన రాష్ట్రంలో ఇసుకగానీ, మద్యంగానీ అక్రమంగా తరలించినా, అక్రమాలకు పాల్పడినా, ఎస్ఈబీ పూర్తి స్థాయిలో నియంత్రణ చేస్తుంది. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే.. తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. అవాస్తవాలతో కూడిన రాతలు రాస్తూ, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని దుష్ప్రచారం చేయడం, టీవీల్లో చూపించడం మంచి పద్ధతి కాదు.

కుప్పం రైతుల మెడకు ఏం తాళ్ళు బిగించావు బాబూ..?

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ మోటార్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు ప్రయోగాత్మకంగా శ్రీకాకుళంలో 28వేలు మోటార్లకు మీటర్లు బిగించాం. దీనిద్వారా వ్యవసాయానికి ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాం.. రైతులకు ఎంత సబ్సిడీ అందుతుంది అన్నది తెలుస్తుంది. రైతులకు కూడా దీనిమీద అవగాహన, అకౌంటబులిటీ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లానే తీసుకుంటే… 33.15 శాతం సబ్సిడీ అదనంగా చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు రూ. 10 వేల కోట్లు ఏడాదిలో సబ్సిడీ కింద రైతులకు ఇస్తున్నాం.

విద్యుత్ చోరీలు, పవర్ లాస్ లు.. ఇవన్నీ తగ్గించేందుకే.. మీటర్లు బిగిస్తున్నాం. ఈ నెలాఖరు లోపల ప్రతి రైతు పేరు మీద బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తాం.
విద్యుత్ మీటర్లు ఉరితాళ్ళు అని మాట్లాడుతున్న చంద్రబాబు… కుప్పం రైతులకు ఏం తాళ్ళు బిగించాడు.? కేవలం రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి ఉంటే హంద్రీ-నీవా నీళ్ళు కుప్పంకు వచ్చి ఉండేవి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, కుప్పం నుంచి ఏడుసార్లు గెలిచి కుప్పంకు ఏం చేశావు?. చంద్రబాబు అసమర్థుడు కాబట్టే… కుప్పం నియోజకవర్గానికి కూడా ఏ ఒక్క మేలూ చేయలేకపోయాడు.

వ్యవసాయం దండగ అని మాట్లాడిన వ్యక్తి, రైతుల మీద కనీసం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు. రైతుల మీద ఎటువంటి భారం పడకుండా, మీటర్లు పెడుతుంటే చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?

నా వల్లే అయినా.. కుప్పంలో 35 ఏళ్ళ తర్వాత, ఇప్పటికైనా చంద్రబాబు ఇల్లు కడతానంటున్నాడు. అంతకు ముందు చంద్రబాబుకు కుప్పంలో అడ్రస్ కూడా లేదు. ఆర్ అండ్ బీ బిల్డింగే అతని అడ్రస్ గా ఉండేది. కుప్పంలో చంద్రబాబు బంగారు నాణేలు పంచి పెట్టినా.. అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీనే.

 

LEAVE A RESPONSE