– ఎంపీ జీవీఎల్ నరసింహారావు
అమరావతి : రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. అనంతరం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80, 90 శాతం పనులు అయిపోయినా ఇప్పుడు 10శాతం పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పారు. జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర అభివృద్ధిని ఆపడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లేఖ రాసినట్లు చెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా, రైతులకు అండగా ఉంటామని జీవీఎల్ స్పష్టం చేశారు.