Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి ఓ ఆర్థిక అగాధం

చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ని ఎండగట్టిన ‘కాగ్’
ఎంపీ విజయసాయిరెడ్డి

సెప్టెంబర్ 26, అమరావతి ఓ పెద్ద ఆర్థిక అగాధమని, ఇప్పడే కాదు భవిష్యత్ లోనూ గుదిబండే అవుతుందని ‘కాగ్’ నివేదిక ద్వారా వెల్లడైనట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

అమరావతిపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ను కాగ్ తన నివేదికలో ఎండగట్టిందని అన్నారు. రాజధానిపై నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వ భూములు వదిలేసి ప్రైవేటు భూములు సేకరించారని, రూ. 46400 కోట్ల డీపీఆర్ లు లోపభూయిష్టంగా ఉన్నాయని, కేంద్రం వివరణ కోరినా స్పందించలేదని గత చంద్రబాబు ప్రభుత్వ చర్యలను కాగ్ ఎండగట్టిందని అన్నారు.

పోలవరంలో మరో కీలక ఘట్టం
పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యిందని, జలాశయాన్ని ఎడమకాలువతో అనుసంధానం చేసే సొరంగం పూర్తయినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. 919 మీటర్ల పొడవు, 18 మీటర్ల వ్యాసార్థం, 20 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో తవ్వకం పూర్తయ్యిందని అన్నారు.

దేశంలో 4.43 లక్షల ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 4.43 లక్షల గ్రామాలు ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహిత) గ్రామాలుగా ప్రకటించినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్-గ్రామీణ్ 2024-25 లక్ష్యం చేరుకోవడానికి ఇదో కీలక మైలురాయి అని అన్నారు. దేశంలో అధిక శాతం గ్రామాలు స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాయని, సానిటేషన్ మిషన్ రెండవ ఫేజ్ లో దేశంలో నాలుగొంతుల్లో మూడొంతుల గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయిని చేరుకున్నాయని అన్నారు.

స్వచ్చత ప్రచారంలో పాల్గొంటున్న ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. పరిశుబ్రమైన పర్యావరణంతో దేహం, మనస్సు ఆరోగ్యకరంగా ఉంటాయని అన్నారు. పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు అలాగే నీరు, ఆహారం కలుషితం కాదని అన్నారు. స్వచ్చమైన పర్యావరణం అంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE