చంద్రబాబు ఇక శాశ్వతంగా సభకు రాడు

– శాసనసభను కించపరిచే విధంగా టీడీపీ ప్రవర్తన
-సభలో టీడీపీ సభ్యులు అసాధారణంగా ప్రవర్తించారు
-స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన గర్హనీయం
-మద్యంపై ప్రభుత్వ విధానమేంటో ప్రజలకు తెలుసు
– వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
శాసన సభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు ప్రజలంతా చూస్తున్నారు. అదేదో సామెత చెప్పినట్లు కాపురం చేసే కళ.. కాలి గోళ్ల దగ్గరే తెలిసిపోతుంది అని అంటారు. అదేవిధంగా శాసనసభలో టీడీపీ సభ్యుల తీరు ఏవిధంగా ఉందో రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగం రోజే వాళ్ల తీరు తెలిసిపోయింది.

బాబు సభకు రాడు.. టీడీపీ సభ్యులతో సభను అడ్డుకుంటాడు
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చున్నాడు. వీళ్లను కూడా ఇంటి దగ్గరే కూర్చోమంటే సరిపోయేది. కానీ టీడీపీ సభ్యులు సభకు వస్తారు, అయితే సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. అదేమంటే స్పీకర్‌ గారు సహకరించడం లేదని, అన్యాయంగా సస్పెండ్‌ చేశారని బయటకు వచ్చి మాట్లాడతారు. అదే సభలో మాత్రం మైక్‌ ముందు మాట్లాడరు.

వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నా వినని పరిస్థితి
ఇవాళ ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పదలచుకున్నాను. ప్రతిపక్ష సభ్యులు వేసిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పే సమయంలో కూడా వీళ్లే అడ్డం పడి గొడవ చేస్తూ ఉంటారు. పోడియం, వెల్‌లోకి వెళతారు. దరిదాపుగా స్పీకర్‌ గారి సమీపానికి వెళ్లి వేళ్లు చూపిస్తారు. సస్పెండ్‌ చేస్తే మాత్రం మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్‌ చేశారని అంటారు. సభ నుంచి సస్పెండ్‌ చేస్తే గౌరవంగా వెళ్లిపోకుండా, మార్షల్స్‌ వచ్చి తీసుకువెళ్లేవరకూ అక్కడే కూర్చుని గొడవ చేస్తారు. ఇది సరైన సంప్రదాయమేనా?

పవిత్రమైన దేవాలయంలాంటి శానస సభలో ప్రతిపక్షం ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? ప్రజా సమస్యలను చర్చించుకోవాల్సిన సమయంలో వాటిని చర్చించనివ్వకుండా అడ్డగోలుగా ప్రవర్తించేవారిని సస్పెండ్‌ చేయకుండా ఏం చేస్తారనే విషయాన్ని ప్రజలు కూడా గమనించాలి.
అదేమంటే… జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయారనే అంశాన్ని లేవనెత్తుతూ సభను జరగనివ్వడం లేదు.

అక్రమ మద్యంపై ఎస్ఈబీతో ఉక్కుపాదం
రాష్ట్ర ప్రభుత్వం సారా మీద, మద్యం మీద ఏవిధమైన విధానం అవలంభిస్తుందో.. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ సారా ఉండకూడదనే అభిప్రాయంతో ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టించి అమ్మిస్తోంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పెట్టి ఎక్కడైతే కల్తీ సారా తయారీదారులపై చర్యలు తీసుకుంటున్నారు.

బాబు హయాంలో కల్తీ సారా లేదా?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2015-18 కాలంలో కల్తీ సారా తయారీదారులపై చేసిన దాడులు ఎన్ని? ఎన్నికేసులు పెట్టారు? ఎంతమందిని పట్టుకున్నారు? ఆ లెక్కలు చూస్తే మీకే అర్థం అవుతుంది. 2016లో 47వేల కేసులు, 2017లో 13వేల కేసులు, 2018లో 11వేల కేసులో పెట్టారు. 2018-19లో 11,190 కేసులు నమోదు చేశారు.
టీడీపీ హయాంలో ఎక్సైజ్‌ శాఖ పనితనం, వైఖరి ఎలా ఉంది? జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక కల్తీ సారాను అరికట్టాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా ఒక డిపార్ట్‌మెంట్‌నే ఏర్పాటు చేయడం జరిగింది.

ఈనాడు రాతలు.. అవే టీడీపీ కూతలు
2020-22 కాలంలో 92వేల కేసులు పెట్టి పెద్ద ఎత్తున కల్తీసారాను ధ్వంసం చేశాం. ఒక విషయాన్ని పట్టుకువచ్చి ఈనాడులో రాస్తారు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ఇస్తారు. అసెంబ్లీ జరుగుతుంది కదా… అని దానిపైనే ఇక్కడకు వచ్చి సభా సమయాన్ని దుర్వినియోగం చేసి గందరగోళం చేస్తారు.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదుసార్లు చెబితే ప్రజలు నమ్మేస్తారనే భావనతో కల్తీసారా… అంటూ టీడీపీ వాళ్లే నానా యాగీ చేస్తారు. ఆఖరికి వీళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే… జగన్‌ మోహన్‌ రెడ్డి కల్తీ సారా తయారు చేయిస్తున్నారనే పరిస్థితి కి దిగజారారు.

జంగారెడ్డిగూడెంలో ఎలా చనిపోయారనేదానిపై చాలా స్పష్టంగా మా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. అది చాలదనుకుంటే మా ముఖ్యమంత్రిగారు కూడా మాట్లాడారు. ఇది చాలదన్నట్టు.. సహజ మరణాలను కూడా కల్తీ సారా మరణాలుగా ఆ ఖాతాలో వేసి, దాన్ని పెద్ద భూతంలా చూపిస్తూ కల్తీసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రచారం చేస్తూ ఒక అపవాదును ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు.
దురుద్దేశంతో, దుర్భిద్దితో శాసనసభను ఉపయోగించుకునేలా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దిగజారిపోయింది.

చంద్రబాబు ఇక శాశ్వతంగా సభకు రాడు, రాలేడు. చంద్రబాబు పని, ఆ పార్టీ పని అయిపోయింది. టీడీపీ అన్నది ఈ రాష్ట్రంలో గతం మాత్రమే.

Leave a Reply