కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయండి

– తెలంగాణకు న్యాయం చేయండి
– గజేంద్ర షెకావత్ ను కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
-సానుకూలంగా స్పందించిన షెకావత్
– ఇన్నాళ్లూ తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే ట్రిబ్యునల్ ఏర్పాటుపై జాప్యం
– న్యాయశాఖ సలహా తీసుకుంటున్నామని వెల్లడి

కృష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డిలతో కలిసి పార్లమెంట్ హౌజ్ లోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసి క్రిష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించారు.

ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పేర్కొన్నారు. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారమవుతుందని, తెలంగాణకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ నేతల విజ్ఝప్తిపట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈ అంశం తన ద్రుష్టిలో ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రితో చర్చిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉఫసంహరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేసిందని, దీనివల్లే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందని తెలిపారు.

సమావేశానంతరం బండి సంజయ్ మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలన్న తమ విజ్ఝప్తి పట్ల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

Leave a Reply