భరతజాతి
ఉన్నంత వరకు
నిలిచి ఉండే పేరు..
అదే భరత జాతి
నడవడిని..ఒరవడిని
శాసించిన రుషి..
దళితుడై స్వానుభవమైన
అంటరానితనం
మళ్లీ మళ్లీ
తన జాతికి
చేదు అనుభవమై
వేధించరాదనే
గొప్ప సంకల్పంతో అసంభవాన్ని
సంభవం చేసిన
సంభవామి కలియుగే..
ఆధునిక యోగే..
బి ఆర్ అంబేద్కర్..!
భారత రాజ్యాంగం
ఆయన కలం నుంచి జాలువారిన
బృహత్ కావ్యం..
అది ఎప్పటికీ నవ్యాతినవ్యం..
అపశ్రుతులను సరి చేస్తూ..
అపసవ్యాలను సవరిస్తూ
దేశగమనాన్ని
చేసింది సవ్యం..
ఇదంతా అంబేత్కరుడి
ఆలోచనల సర్వం..
ఆధునిక భారత
పురోగమన పర్వం..!
బాల్యం చేదు అనుభవాల కలబోత..
కష్టనష్టాల వడబోత..
అనుభవించి..ప్రతిఘటించి..
అధిగమించి..
విద్యతో విజయాలు సాధించి..
ఒకనాటికి తానే
అయ్యాడు విరించి..
దురాచారాలపై విపంచి!
అంబేద్కర్..
ఒక ఆవేశం..
ఒక అలజడి..
ఒక స్ఫూర్తి..
ఒక ధీమూర్తి..
ఆయన విరచిత రాజ్యాంగం
ఆయన అంతఃకరణ..
ఆత్మసంఘర్షణ..
అత్యద్భుత ఆవిష్కరణ..
భరత జాతి పురోగతికి
ఆ మహనీయుని వితరణ..!
నమ్మిన సిద్ధాంతం..
అప్పుడప్పుడు
బాపూతోనే రాద్ధాంతం..
రాజీ పడని తత్వం..
చెక్కు చెదరని మూర్తిమత్వం..
రాజ్యాంగం ఆయన
ఆలోచనల మహత్యం..
ఆధునిక ప్రపంచ చరిత్రలో
ఒక తిరుగులేని
అక్షరసత్యం..!
అంబేద్కర్ చొరవ..తెగువ
వీటి ఫలితమే
ఒకనాటి అంటరానివారు..
హరిజనులై..గిరిజనులై
పురజనులై..
దళితులై..పునీతులై…
తరించి విజయశంఖం
మ్రోగించి సాధించి గౌరవం..
జనజీవన స్రవంతిలో
తాము సైతం..పరిణితం..!
ఆ రుణమే
ఊరూరా..వాడవాడలా
ఆ మహనీయుడి విగ్రహాలు
రాజ్యాంగం సాక్షిగా
త్రోవ చూపుతూ..
అలా స్ఫూర్తిదాయక గమనంతో ఈ జాతిరత్నం
అయ్యాడు భారతరత్నం..
(దీనజన బాంధవుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రణామాలు అర్పిస్తూ..
ఎలిశెట్టి సురేష్ కుమార్