– అమరావతికి బీజేపీ అనుకూలమే
– ఉద్యమం నుంచి ఎందుకు పక్కకు జరిగారు?
– వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే
– పొత్తులపై మాట్లాడిన సునీల్‌పై ఫైర్
– పార్టీలో చేరిన వారికి గౌరవం ఇవ్వరా?
– సోము, సునీల్ దియోధర్ తీరుపై ఎంపీ సుజన, సీఎం రమేష్ ఫిర్యాదు
– సునీల్‌ను తొలగించాలన్న సుజన-సీఎం రమేష్?
– నేతలకంటే ముందు అమిత్‌షాతో విడిగా వారిద్దరి భేటీ
– సోముకు సునీల్ బాస్ కాదని అమిత్‌షా స్పష్టీకరణ
– వాడి వేడిగా అమిత్‌షా సమావేశం
( మార్తి సుబ్రహ్మణ్యం- తిరుపతి)
ఏపీ బీజేపీ నాయకత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అగ్గిరాముడయ్యారు. రాష్ట్రంలో పార్టీ విస్తరించకపోవడానికి కారణాలను గ్రహించిన అమిత్‌షా, దానిపై అనుసరిస్తున్న ఏపీ నాయకత్వ విధానాలను తప్పుపట్టారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని తీసుకోవడంతో పాటు, వచ్చిన వారిని గౌరవిండం నేర్చుకోవాలని క్లాసు పీకారు. అమరావతి ఉద్యమంలో ఎందుకు పాల్గొనడ ం లేదని, అమరావతిపై పార్టీ నిర్ణయం ప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేశారు. మీలో సమన్వయం లేదని చురకలంటించారు. ఇక మిత్రపక్షమైన జనసేనతో రాష్ట్ర నాయకత్వానికి ఎందుకు సత్సంబంధాలు లేవని ప్రశ్నించారు. జనసేనతో కలసి వెళ్లాలని ఆదేశించారు.
‘మీలో సమన్వయం ఉంటే ఈ రోజు రెండు మీటింగులు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంద’ని అమిత్‌షా వ్యాఖ్యానించారు. అంతకుముందు.. పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరూ అమిత్‌షాతో భేటీ అయి, అధ్యక్షుడు సోము వీర్రాజు- కో ఇన్చార్జి సునీల్ దియోథర్ ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా.. కో ఇన్చార్జి సునీల్ దియూథర్ వ్యవహారశైలి తలనొప్పిగా ఉన్నందున, ఆయనను తొలగించాలని సీనియర్లు అమిత్‌షాను కోరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సోమవారం ఏపీ బీజేపీ నేతల భేటీ వాడి వేడిగా జరిగింది. రెండు దఫాలుగా జరిగిన భేటీలో రాష్ట్ర నాయకత్వం పనితీరు- సమన్వయం- నిర్ణయాలపై అమిత్‌షా ఒక సందర్భంలో ఆగ్రహం, ఇంకొక సందర్భంలో అసంతృప్తి, ఆశర్చ్యం వ్యక్తం చేశారు. నాయకులతోనే కలసి భోజనం చేశారు.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమిత్‌షా రాష్ట్ర బీజేపీ నాయకత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, శివప్రకాష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి కొత్తవారిని తీసుకుని, విస్తరించాలని అమిత్‌షా ఆదేశించారు. పార్టీలోకి తీసుకున్న వారిని గౌరవించడం ప్రధానమని స్పష్టం చేశారు. ‘మనం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడం ఎంత ముఖ్యమో, వారిని గౌరవించడం అంతే ముఖ్యం. నేను ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేసినా, మీ పద్ధతి మారడం లేద’ని అమిత్‌షా అక్షింతలు వేశారు.
ఈ దశలో ఇటీవల సునీల్ దియోథర్.. పార్టీలో చేరిన ఎంపీలనుద్దేశించి ‘బీజేపీ ఏపీలో టీడీపీకి పార్కింగ్ ప్లేసు కాదంటూ’చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. వారు మళ్లీ పార్టీ నుంచి వెళ్లిపోతారని సునీల్ దియోధర్, ఒక ఎంపీ వివరణ ఇవ్వడంపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఏకంగా ముఖ్యమంత్రులనే చేస్తున్నాం. ఒకప్పుడు ఆ సీఎం బీజేపీ బయట ఉన్నప్పుడు కరుడుగట్టిన హిందుత్వ వ్యతిరేకి. ఇప్పుడు మన పార్టీలో చేరి సీఎం అయిన తర్వాత హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. నాగపూర్ కూడా వెళ్లారు. చేరిన వాళ్లతో పనిచేయించుకుని, బాధ్యతలు అప్పగించడం నీ బాధ్యత. అది చేయకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని దూరంగా ఉంచమని ఎవరు చెప్పార’ని అమిత్‌షా సునీల్ దియోధర్‌పై విరుచుకుపడ్డారు.
కాగా అమరావతి ఉద్యమం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అమరావతిపై గతంలో పార్టీ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని, అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీదేనని అమిత్‌షా స్పష్టం చేశారు. అయితే, అమరావతిపై చేసే ఉద్యమం వల్ల టీడీపీకే లాభం ఉంటుందని ఎంపీ జీవీఎల్ చెప్పబోగా.. దానిని అమిత్‌షా త్రోసిపుచ్చారు. ‘ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే పార్టీలకే ప్రజల మద్దతు ఉంటుంది. టీడీపీకి లాభం వస్తుందని మనం దూర ంగా ఉంటే, మనల్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు? సహజంగా దూరంగానే ఉంచుతారు. మన పార్టీని ఎందుకు ఆదరిస్తారు? మన పార్టీ అమరావతిపై చేసిన తీర్మానాన్ని అమలుచేయండి. మనం పాల్గొంటే ప్రజలు మనకూ మద్దతు పలుకుతారు. టీడీపీ తో పాటు, మన పార్టీ కూడా లాభపడుతుంది కదా? అయినా పాదయాత్రకు వెళ్లిన వారిని ప్రశ్నించడం ఏమిటి?’ అని చురకలు అంటించారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రకు వెళ్లిన నేతల వద్ద, సోము-సునీల్ వివరణ తీసుకున్న అంశాన్ని నేతలు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. అమరావతికి మన పార్టీ అనుకూలం కాదని వారిద్దరూ ఆ నేతలకు స్పష్టం చేసిన అంశాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. ‘ ‘అమరావతిపై గతంలో పార్టీ చేసిన తీర్మానమే ఫైనల్,. మీరూ రైతులకు మద్దతుగా ఉద్యమాల్లో పాల్గొనండి’ అని ఆదేశించారు.
రాష్ట్ర పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై.. రాష్ట్ర కో ఇన్చార్చి సునీల్ దియోథర్ పెత్తనం పెరిగిందన్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు, సునీల్ గాలి తీసినట్టయింది. ‘మీరు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు. మీరు అందరి అభిప్రాయాలతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి. మీకెవరూ బాస్ లేరు. మీరే బాస్. సంఘటనా మంత్రితో సమన్వయం చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలుంటే సంతోష్జీతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి’’ అని సోము వీర్రాజుకు స్పష్టం చేశారు.
ఇక టీడీపీతో పొత్తు ఉండదంటూ.. సునీల్ దియోధర్, జీవీఎల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొత్తులు నిర్ణయించడానికి మీరెవరు? అది రాష్ట్రీయ అధ్యక్షుడు చెప్పాల్సిన విషయం. దానితో మీకేం సంబంధం? మీకున్న అర్హతేమిటి?పార్టీకి చెప్పకుండా మీరెలా ప్రకటిస్తారు’ అని క్లాసు పీకారు. ముందు మీరు రాష్ట్రంలో బలం పెంచుకుని, త ర్వాత మిగిలిన విషయాల గురించి మాట్లాడండి అని చురకలు అంటించారు.
చివరలో రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తి అన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మీదేనని రాష్ట్ర నేతలకు స్పష్టం చేశారు. మీకు ప్రతి విషయంలో జాతీయ పార్టీ చెప్పదని, మీరే సందర్భానికి తగినట్లు నిర్ణయం తీసుకోవాలే తప్ప, ప్రతిదానికీ ఢిల్లీ వైపు చూడవద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై, పార్టీ పరంగా ఉద్యమించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అన్న భావన ప్రతి ఒక్కరిలో కల్పించాలి. రాజకీయపార్టీలు ప్రజా ఉద్యమాలు చేస్తేనే బలపడతాయి’’ అన్నారు. తొలుత తాము సాధించిన పురోగతి గురించి సోము వీర్రాజు హిందీ-ఇంగ్లీషులో వివరించే ప్రయత్నం చేయగా ‘‘ మీరు తెలియని భాష గురించి ఇబ్బంది పడవద్దు. మీరు చక్కగా తెలుగులోనే మాట్లాడండి. ఇక్కడ అనువాదం చేసేవాళ్లున్నారు’’ అని అమిత్‌షా సర్దిచెప్పారు.
సునీల్‌ను తొలగించండి: సుజనా, రమేష్ ఫిర్యాదు
కాగా, అంతకంటే ముందు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విడిగా నేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోథర్ అవగాహనా రాహిత్యంతో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలపై వారిద్దరూ అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయనను తొలగించనంత వరకూ రాష్ట్రంలో బీజేపీ విస్తరించే అవకాశాలతోపాటు, పార్టీలో చేరిన వారు కూడా, ఆయన వ్యవహారశైలి కారణంగా తమ దారి తాము చూసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతుల పాదయాత్రకు వెళ్లిన పార్టీ రాష్ట్ర నేతలకు సునీల్, సోము ఫోన్లు చేసి.. ఎందుకు వెళ్లారని వివరణ అడుగుతున్నారని ఇద్దరు ఎంపీలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ప్రధానంగా.. ఇటీవల విజయవాడలో సునీల్ టీడీపీ నుంచి చేరిన తమనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను, అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అయితే దానిని రాజకీయంగా సద్వినియోగం చేసుకునే స్థాయిలో, సునీల్ దియోథర్-సోము వీర్రాజు నిర్ణయాలు లేవని అమిత్‌షాకు వివరించారు. ఈ సందర్భంగా సునీల్ వింతపోకడలను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, తమకు కీలక సమావేశాల సమాచారం కూడా ఇవ్వవద్దని ఆదేశించారని ఫిర్యాదు చేశారు.
తమను కోర్ కమిటీ భేటీలకు ఆహ్వానించకుండా, యుపి ఎంపి జీవిఎల్‌ను మాత్రం ఆహ్వానిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోము-సునీల్ వ్యవహారశైలి వల్ల, ఇతర పార్టీల నుంచి చేరికలు ఆగిపోతున్నాయని స్పష్టం చేశారు. సునీల్ ఒక మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, ‘‘ప్రతి అంశం పైన ( ఢిల్లీకి) చెప్పి చేస్తున్నామని’ సునీల్-సోము మీటింగులో చెప్పి, అందరి నోళ్లు మూయిస్తున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు అవకాశాలున్నందున, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయకపోతే, రాజకీయ అస్పష్టత కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, ఏపీలో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ లక్ష్యమన్న అమిత్‌షా.. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయంపై కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ విస్తరణ అంశంపై జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ అందుబాటులో ఉన్నందున, ఆయనతో చర్చించాలని అమిత్‌షా వారికి సూచించారు.