తనను కలవాల్సిందిగా జూనియర్ ఎన్ టీ ఆర్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నుంచి ఆహ్వానం రావడం, కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం లో బీజేపీ సీనియర్ నేతలు అతనికి నోవాటల్ హోటల్ కారిడార్ లో నుంచే స్వాగతం చెబుతూ అమిత్ షా వద్దకు తీసుకు వెళ్లడం, అమిత్ షా అతనితో డిన్నర్ చేయడం తో పాటు ఏకాంతం గా సమావేశం కావడం చూస్తుంటే….. బీజేపీ పై గౌరవ భావం కలగడం కష్టం.
*రాజకీయాలకు ఎన్ టీ ఆర్ చాలా దూరంగా…. తన సినిమాలు తాను చేసుకుంటున్నారు.
* తెలంగాణ లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ కి అతని వల్ల రాజకీయ ప్రయోజనం సున్నా.
* హైదరాబాద్ లోనూ, తెలంగాణ జిల్లాల లోనూ గణనీయ సంఖ్య లో ఉన్న కమ్మ సామాజిక వర్గం – తమ ప్రతినిధిగా తెలుగు దేశం పార్టీ ని తప్ప,జూనియర్ ను గుర్తించదు. అతనికేమో తెలుగుదేశం పార్తీతో ఎటువంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవు.
* తన అక్క కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ కి 2018 లో పోటీ చేస్తే, హైదరాబాద్ లోనే ఉన్న ఎన్ టీ ఆర్ – కనీస ప్రచారానికి రాలేదు. కూకట్ పల్లి వైపు కన్నెత్తి చూడలేదు.
* ఆ నందమూరి తారక రాముడి ‘ఒరిజినల్’ కుటుంబ సభ్యులపై- ఆయన పేరుతో ఉన్న ఈ ఎన్ టీ ఆర్ కు తీవ్రమైన అసహనం అంతర్లీనం గా ఏమైనా ఉన్నదా…. అనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి ఇతని ప్రవర్తన గమనించినప్పుడు.
* చంద్రబాబు భార్య భువనేశ్వరి ఈయనకు స్వయంగా మేనత్త. తన తండ్రికి సోదరి. ఆవిడను టీడీపీ ప్రత్యర్థులు శాసన సభలో అనరాని, అనగూడని మాటలు అంటే – ఈయనలో కనీస స్పందన లేదు. ఉద్వేగం ఆపుకోలేని చంద్రబాబు మీడియా ముందు కళ్ళనీళ్ళ పర్యంత మైతే,ఆయనకు కనీస ఓదార్పు లేదు.
ఇలా, టీడీపీ కి ఆయనకు అసలు ఏ విధమైన సంబంధాన్నీ ఆయన కొనసాగించడం లేదు.
*అలా అని చెప్పి, ఆంధ్ర లో టీడీపీ కి వ్యతిరేకం గా మాట్లాడే సాహసం కూడా చేయలేరు. బీజేపీ కి గానీ, మరో పార్టీకి గానీ అనుకూలంగా ఒక్క మాటకూడా మాట్లాడలేరు. ఆ విధంగా ఆయన బీజేపీకి ఏమాత్రం ఉపయోగ పడలేరు. తెలంగాణలోనూ రాజకీయంగా ఆయన జీరో. కేవలం జూనియర్ కి ప్రచారం కల్పించడానికి మాత్రమే ఈ విందు ఆహ్వానం పనికి వస్తుంది.
ఇంకా, ఈనాడు అధినేత రామోజీరావు ను అమిత్ షా కలవడంలో ఓ అందం ఉంది… చందం ఉంది. రాజకీయంగా ఓ అర్ధం ఉంది. బీజేపీకి ఓ అవసరం ఉంది. అందుకే, రామోజీ రావును కలవడానికి అమిత్ షా- ఫిలిం సిటీ కి వెళ్లారు గానీ; అమిత్ షా ను కలవడానికి రామోజీ రావు – నోవాటెల్ హోటల్ కు వెళ్ళలేదు.
నిజానికి, జనసేన… జనసేన అంటూ బీజేపీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ ను అమిత్ షా కలిసి ఉండాల్సింది. కేంద్ర బీజేపీ నేతలతో తనకు చక్కని సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ – అడిగిన వారికీ, అడగని వారికీ కూడా చెబుతూ ఉంటారు. అలా చెప్పే ఆయనతో అమిత్ షా డిన్నర్ చేసి, ఏకాంత చర్చలు జరిపి ఉండాల్సింది. ఆంధ్ర బీజేపీ నేతలను పిలిపించి, ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ తగ్గించడానికి ఓ ప్రయత్నం అయినా చేసి ఉండాల్సింది. అప్పుడు ఆయన హైదరాబాద్ పర్యటనకు ఓ అర్ధం… పర్ధం ఉండేవి. చేయవలసినవి పూర్తిగా విస్మరించి , ఏమాత్రం అవసరం లేనివి చేయడం అనేది బీజేపీ కి ఎలా ఉపకరిస్తుందో తెలియడం లేదు. మేకకు గొంతు కింద వేళ్లాడే రెండు స్తనాల వంటి వాటిని ఎంత పిసికినా … పాలు రావు.