‘కమలం’లో ‘తారక’ తడబాటు

0
65

– కిషన్‌రెడ్డి,బండి కాదంటే.. మురళీధర్‌రావు అవుననిలే
– అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీ పై బీజేపీలో తలోమాట
– రాజకీయ ప్రాధాన్యం లేదన్న కిషన్‌రెడ్డి, సంజయ్
– రాజకీయ అంశాలపై చర్చ జరిగి ఉండవచ్చన్న మురళీధర్‌రావు
– త్రిబుల్ ఆర్ సినిమాను అభినంచడానికే అమిత్‌షా పిలిచారంటున్న బీజేపీ వర్గాలు
– భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చన్న మురళీధర్‌రావు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కేంద్రహోంమంత్రి అమిత్‌షా-యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ తడబడుతోంది. ఆ భేటీపై పార్టీకి చెందిన ముగ్గురు అగ్రనేతల అభిప్రాయాలు, భిన్నంగా ఉండటంపై గందరగోళం- అనుమానాలు మొదలయ్యాయి. దానితో వారిద్దరి భేటీలో ఏదో జరిగింది. ఏదో నిర్ణయం జరిగిందన్న అనుమానాలకు తెరలేచింది.
అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ రేగింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఇరువురి మధ్య గంటన్నరపాటు చర్చలు జరిగాయి. అయితే.. త్రిబుల్ ఆర్ సినిమాలో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్‌ను అభినందించడానికే, అమిత్‌షా ఆయనను పిలిపించారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అటు వారిద్దరి భేటీకి సంబంధించి విడుదలయిన వీడియోలు కూడా పరిశీలిస్తే, అమిత్‌షా-ఎన్టీఆర్ మధ్య ఉల్లాసభరితమైన చర్చలు జరిగాయన్న భావ న వ్యక్తమవుతుంది.

అయితే సోషల్‌మీడియాలో మాత్రం, వారిద్దరి భేటీపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో తెలంగాణ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో నివసిస్తున్న కమ్మవర్గం-సెటిలర్ల ఓట్లను ఆక ర్షించే వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్‌ను పిలిపించారన్న చర్చ జరిగింది. సొంత పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర పార్టీలకు చెందిన సీఎంలకు సైతం అపాయింటుమెంట్లు ఇవ్వనంత బిజీగా ఉండే అమిత్‌షా.. కేవలం ఒక సినిమా నటుడిని అభినందించేందుకు, దాదాపు 2 గంటల సమయం వెచ్చించారంటే ఎవరూ నమ్మరన్న వ్యాఖ్యలు వినిపించాయి. బీజేపీ వైపు సెటిలర్లను మళ్లించే వ్యూహంలో భాగంగానే, జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

kishan-sanja-yవారిద్దరి భేటీపై వస్తున్న ఊహాగానాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. వారి భేటీలో రాజకీయ అంశాలేమీ చర్చకు రాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ‘వారిద్దరి మధ్య కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గురించి అమిత్‌షా జూనియర్‌ను అడిగి తెలుసుకున్నారు. అంతకుమించి వారి భేటీలో ఏమీ జరగలేద’ని వ్యాఖ్యానించారు.అటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా, వారిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన చర్చలు మాత్రమే జరిగాయన్నారు.

muralidhrarraoఅయితే… బీజేపీ జాతీయ నాయకుడయిన మురళీధర్‌రావు మాత్రం వారిద్దరి వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించి, అనేక అనుమానాలకు తెరలేపడం చర్చనీయాంశమయింది. ‘వారిద్దరి మధ్య రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చి ఉండవచ్చు. భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు’ అని వ్యాఖ్యానించి, చర్చను కొత్త మలుపు తిప్పారు. అంటే.. ఎన్టీఆర్‌ను బీజేపీ ప్రచారానికి ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోందంటూ, ఇప్పటివరకూ సోషల్‌మీడియాలో వస్తున్న కథనాలే నిజమని నమ్మాల్సిన పరిస్థితిని మురళీధర్‌రావు వ్యాఖ్యలు కల్పించాయి.

అయితే విచిత్రమేమిటంటే.. అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఈ ముగ్గురు నాయకులు లేరు. కిషన్‌రెడ్డి తదితరులు నోవాటెల్ హోటల్‌లో, ఎన్టీఆర్‌కు స్వాగతం పలికేందుకే పరిమితయ్యారు. తర్వాత లోపల వారిద్దరు మాత్రమే ఏకాంతంగా చర్చించుకున్నారు. భే టీ ముగిసిన తర్వాత అటు అమిత్‌షా గానీ, ఇటు ఎన్టీఆర్ గానీ మీడియాకు తమ భేటీ వివరాలు వెల్లడించకపోవడం ప్రస్తావనార్హం.