Suryaa.co.in

Family

అమ్మ ..ఇచ్చిన పునర్జన్మ

వరల్డ్ మదర్స్ డే

మహర్జాతకుడమ్మా..వీడు.! విజయ. ఈ..మాట ను నేను, అమ్మ ఒడిలో ఉన్నపుడు ,మా తాత మాచన పుండరీకం ఆన్నాడు.ఆ గొప్ప మాట విన్న మా అమ్మ..ఆ..ఏదో పెద్దాయన కదా అలా అని ఉంటాడులే, మనవడి పై ప్రేమ తో అని తనకు తాను గొప్ప అత్న సంతృప్తి కి లోనయ్యింది. సంబర పడింది. నాకు నాలుగు పదులు దాటాక కానీ అమ్మ కు “మహర్జాతకుడు” ఆన్న మాట తాతయ్య ఎందుకు అన్నాడో బోధపడలేదు.

పోయిన సంవత్సరం మే 31 న హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారు.. మేడం మీ అబ్బాయి ని ఇంటర్వూ చేయమని ఢిల్లీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.మాచన రఘునందన్, లాంటి వాళ్ళు నూటికి ఒక్కరున్నా చాలు సమాజం బావుంటుంది అని వ్యాఖ్యానించడం అమ్మ కు ఎంత ఆత్మ సంతృప్తి కలిగిందో.తన ఎదురుగుండా..నన్ను గంట పాటు ఓ ప్రభుత్వ ఛానల్ వారు ఏకధాటిగా ప్రత్యక్ష ప్రసారం లో ఇంటర్వ్యు చేయడం. ఓ కొడుకుగా అమ్మ కు నేను అంతకంటే ఏమ్.. చేయగలను.
రెండు దశాబ్దాలకు పైగా.. ఎవ్వన్ని పడితే వాణ్ణి,ఎక్కడ పడితే అక్కడ..ధూమపానం అలవాటు మానండి మహా ప్రభో..పొగాకు ఆరోగ్యం పై పగ బడుతుంది. అని రెండు దశాబ్దాలకు పైగా జన బాహుళ్యానికి ప్రార్ధన చేస్తున్న ఈ..మీ హితైషి “మాచన”.. బతికే ఉన్నాడు అంటే జన్మ నిచ్చిన అమ్మే పునర్ జన్మ నూ ఇచ్చింది.

నేను ఎస్సేస్సీ చదువుతున్న రోజుల్లో.. ఓ సాయంకాలం ట్యూషన్ అయ్యాక ఇంటికి బయల్దేరా..అప్పటికే ఉరుములు , మెరుపులతో వర్షం దంచి కొట్టింది. చెల్లి, తమ్ముడు వర్షం ఆరంభం కంటే ముందే ఇల్లు చేరారు. ముషీరాబాద్, న్యూ బాకారం లో బాంక్ ఆఫ్ బరోడా కాలనీ దారిలో దయాళ్ మోహన్ స్టీల్ ఇండస్ట్రీస్ వెనుక మా ఇల్లు ఉండేది.ఇంటికి చేరేందుకు ఓ వీధి గుండా వెళ్లే వాళ్ళం.ఆ వీధి మలుపు లో, ఓ విద్యుత్ స్తంభం ఉంది. గాలి దుమారం దెబ్బకు పోల్ పై నుంచి హై టెన్షన్ కరెంటు వైరు తెగి కింద పడింది.దారికి అడ్డంగా..సరిగా సాయంత్రం ఐదు గంటలకు, నేను ట్యూషన్ అయిపోయాక అరగంట లో ఆ వీధి మలుపు కు వచ్చేశా.

అమ్మ పాపం..నాలుగున్నర నుంచి తెగి పడిన విద్యుత్ తీగ సమీపం లోనే ఉంది. ఆ దారిన వెళ్లే వాళ్ళను బతిమాలుతూ..ఉంది.”బాబూ కాస్త మా అబ్బాయి రఘు కనపడితే?!”జాగత్త గా రమ్మని” చెప్పండీ. అంటూ..అలా చెప్పి, చెప్పి ఆమె గొంతు తడారిపోయింది.నేను వచ్చే వరకు తల ఎత్తి చూస్తూ..నే ఉంది. నేను కొద్ది దూరం లో కనపడ గానే..ఒక్క సారిగా, “ఆగు.!అక్కడే ఉండు, నేనొస్తున్న” అంటూ.. జాగ్రత్తగా..గోడవారగా ఉన్న ఓ చిన్న అరుగు పై నుంచి నా వద్దకు చేరుకుంది. ఏమైందమ్మ అంటే.. కరెంటు తీగ కింద పడింది.షాక్ తగులుతుందని నీ కు చెప్పడానికి గంట నుంచిక్కడే ఉన్నా అందీ. తమ్ముడికో, చెల్లికో చెప్పొచ్చు కదా ..అన్నా.! వాళ్ల ఏమరుపాటుకు కరెంటు షాక్ కొడితే ఎలా? అని ప్రశ్నించింది.

అలా.. నాకు జన్మ నిచ్చిన అమ్మ మరలా.. నన్ను మృత్యు గండం నుంచి గట్టెక్కించింది. క్షణ కాలం కూడా..కనురెప్ప వాల్చకుండా..కాపలా కాసి,కన్న బిడ్డ ను విద్యుదాఘాతం నుంచి తప్పించి, మరు జన్మ నూ..ప్రసాదించింది. డిగ్రీ అయ్యాక “నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అమ్మా” అంటే.. ఏమో రా నాన్నా ఒప్పుకుoటారో లేదో ఎంత కావాలేంటీ అని అడిగింది. ఓ లక్ష ఆవ్వచ్చు అన్నా..సరే చూద్దాం అంది. నేను తేలిగ్గా తీసుకుందేమో అనుకున్నా.. తన ఆభరణాలు, సూత్రాలు తనఖా పెట్టి కొంత డబ్బు సర్దింది.నాకు స్వతహాగా డబ్బు దాచుకునే అలవాటు మా నాన్న గారు అభిమన్యు( టీచర్) నేర్పడం వల్ల పోగైన పైకం తో సివిల్స్ సాధన కోసం ప్రయత్నం చేశా.

ఇంత చేసిన అమ్మ కు నేను ఇంతవరకు ఏ నాడూ..ఒక్క చీర కొని ఇవ్వక పోయినా..తను మాత్రం అడపా దడపా..నా ఆర్థిక ఇబ్బంది ని అడిగి తెలుసుకుని యధాశక్తి సాయం ఇప్పటికీ చేస్తుంది.నాన్న మమ్మల్ని తన డ్యూటీ హడావిడి లో పెద్దగా పట్టించుకోక పోయినా..అమ్మ మాత్రం అండ, దండ గా ఇప్పటికీ తన కను పాపల్లా నే చూసుకుంటుంది. విజయమ్మ భలే బిడ్డని కన్నావమ్మా.. నీ కొడుకు అందరిచేత, బీ డీ, సిగరెట్లు, పొగాకు మాన్పించి ఇళ్లలో వెలుగు నింపుతున్నాడని వాళ్లు వీళ్లు అంటుంటే ఆమ్మ కళ్లలో ఆ ఆనందమే వేరు.

అధికారిని ఐనప్పటికీ సాదా సీదాగా ఉండటం,భందు మిత్రులతో కలుపు గొలుగా వుండటం అలవాటు.ఒక్కో సారి నా అత్యుత్సాహాన్ని గమనించి “ఎందుకు అంత” అవసరమా?! ఆఫీసర్ లా హుందాగా ఉండు అంటూ ఇప్పటికీ ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస నిపణురాలిగా సూచిస్తుంది.

అమ్మ ..నన్ను చెడు నుంచి కాపాడే,కాపాడుకునే,
ఓ “అమ్ము” లా..నే నిర్భయాన్నిస్తుంది.ఆపద లో అభయం గా ఉంటుంది.

మాచన రఘునందన్.
ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్
పౌర సరఫరాల శాఖ
9441252121

LEAVE A RESPONSE