-మహిళల ప్రాణాలకు రక్షణ ఎక్కడ? మహిళలపై దాడులు చేస్తోన్నవారిపై శిక్షలెక్కడ? బాధిత మహిళకు -కేవలం ధరలు కడుతున్న ప్రభుత్వం
-జగన్ రెడ్డి ప్యాలస్ నుంచి బయటకు వచ్చి చూడాలి
-డమ్మీ హోం మంత్రితో మహిళలకు ఏం ప్రయోజనం
-సొంత మీడియాతో, సలహదారులనే జీతగాళ్లతో కాకమ్మ కబుర్లు
-చెప్పేది కొండంత..చేసేది గోరంత
-ఇక ప్రాంతీయ, కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి
-2024లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తాం – అరాచకాలకు అడ్డువేస్తాం
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : అధికారమనే అహంకారం తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి సర్కారుకు పోయేకాలం దాపురించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా ఆంద్రప్రదేశ్ లో మహిళలపై వందలకొద్ది జరుగుతున్న అకృత్యాలు..అఘాయిత్యాలపై నోరు విప్పి మాట్లాడలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఇక రాష్ట్రంలో అక్క, చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. లా& ఆర్డర్ లేని డమ్మీ హోమ్ మంత్రిని పదవి లో ఉంచి శాంతి భద్రతలను ఎలా అదుపు చేస్తారని శైలజనాథ్ ప్రశ్నించారు?. రాజ్యాంగం ప్రకారం మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, సంఘటనలు జరిగిన తరువాత సాయంతో సరి పెట్టడం సరికాదన్నారు. బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా చెయ్యాలని డిమాండ్ చేశారు. అసలు ఇంత అభివృద్ధి జరుగుతున్నా మహిళలపై దాడులు జరుగుతేన్నాయంటే కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమేనని శైలజనాధ్ ఆరోపించారు. హోమ్ మంత్రికి పూర్తి స్వేచ్ఛ లా&ఆర్డర్ ఇచ్చి శాంతి భద్రతలు కాపాడేలా చూడాలని హితవు పలికారు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని హితవు పలికారు. ఇంట్లో కూర్చుని రోజూ అధికారులతో సమీక్షలు నిర్వహించి జీతగాళ్లతో సొంత డబ్బాను మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోదని, వాస్తవాలను ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. ఈమేరకు సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించలేని చెత్త ప్రభుత్వాన్ని చూడాల్సి రావడం ఆంద్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న ఖర్మ అని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఎన్నాళ్ళు ఉంటారో తెలియని జగన్ రెడ్డి ఎమ్యెల్యేలు, మంత్రులను సంతలో గేదెలుగా భావిస్తున్నారని… వారు కూడా గంగిరెద్దుల్లా తలలూపుతూ బానిస బతుకులు బతుకుతున్నారని ఆరోపించారు. పరిపాలన చేత కాక రాష్ట్రంపై రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల పేరుతో పీక్కు తింటున్న జగన్ రెడ్డి సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలవలన ప్రజలు అగాధంలోకి పోతున్నారని, కానీ వారి కుటుంబం, వారి అనునూయులు మాత్రం కోట్లు కోట్లు ప్రజా ధనాన్ని దండుకుంటున్నారని ఈ ప్రజా వ్యతిరేక పార్టీ లను త్వరలోనే బంగాళాఖాతంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని శైలజనాథ్ స్పష్టం చేశారు.
ప్రతిదీ రాజకీయ కోణం లో చూస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని విమర్శించారు. కెన్యా, శ్రీలంక, జింబాబ్వే లాగా ఆంధ్రప్రదేశ్ మారిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నా సంఘటనల్లో నేరస్థులను కాపాడే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటున్న కొందరు పోలీసులు పద్దతి మార్చుకోవాలని సూచించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది కొండంత…చేసేది గోరంత అని..ప్రజాధనంతో సొంత మీడియాలో సొంత జీతగాళ్లతో డబ్బా కొట్టుకుని ఇదే అభివృద్ధి అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న విషయం తెలుసుకోవాలని శైలజనాథ్ కోరారు.ఇక ప్రాంతీయ, కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
పరామర్శకు వెళితే అరెస్ట్ చేస్తారా?
రేపల్లె అత్యాచార బాధితురాలిని ఒంగోలు రిమ్స్ లో పరమర్శించటానికి ఒంగోలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు దాసరి నాగ లక్ష్మి మరియు మహిళా నాయకులు వెళితే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని శైలజనాథ్ ఖండించారు. ప్రతి పక్ష పార్టీల నేతలకు ఆమాత్రం స్వేచ్ఛ లేకుండా పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని విమర్శించారు.