– తెలంగాణ భూములన్నీ ఇంకా ఆంధ్రావాళ్లకేనా అని నిలదీస్తున్న తెలంగాణ సమాజం
– బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై బీజేపీ భూందాం
– ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపణలతో అసలు రహస్యం బట్టబయలు
– మియాపూర్‌లో 4 వేల కోట్ల భూములు తోటకు అప్పగించిన వైనంపై వివాదం
– ‘తోట’ కేసులో సుప్రీంకు ఎందుకు వెళ్లలేదన్న చర్చ
– 8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు మరో న్యాయమా అన్న ప్రశ్న
– కేసీఆర్ ఆ 40 ఎకరాలను తోట ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించడంపై రచ్చ
– సర్వే నెంబర్ 78 అక్రమాలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న బీజేపీ
– ‘తోట’ నియామకం వెనుక మతలబును బయటపెట్టిన బీజేపీ
– ఖమ్మం బీఆర్‌ఎస్ తొలి సభ ముందురోజు బీజేపీ రాజకీయ బాంబు
– కాపు కోణం కాదు.. కాసుల బేరమేనన్న భావన
– ‘కమలం’ ఆరోపణలతో గులాబీలో గుబులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుకున్నదే అయింది. ఊహించిందే జరిగింది. బయట ప్రపంచంలో అంతా గుసగుసలాడుకున్నవే బీజేపీ బయటపెట్టింది. మియాపూర్‌లోని ఆ భూముల కోసమే.. ఏపీ కాపు నేత తోట చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరారన్న అనుమానాలను, బీజేపీ ఆరోపణలు నిజం చేశాయి. ఒకటి కాదు.. రెండు కాదు. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా నాలుగువేల కోట్ల రూపాయల ‘భూ’కైలాస్ కోసమే.. తెలంగాణ ‘తోట’లో ఆంధ్రా బిల్డరు పాగా వేశారన్న ఆరోపణలకు, కమలం పదునుపెట్టింది.
ఫలితంగా.. సొంత రాష్ట్రం సిద్ధించినా, ఇంకా ఆంధ్రా వ్యాపారులదే పెత్తనమా అన్న ప్రశ్న , తెలంగాణ సమాజం గుండెను పిండేసింది. బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే, లాయర్‌సాబ్ రఘునందన్ బట్టబయలు చేసిన ‘తోట’ భూందాం వ్యవహారం.. తెలంగాణలో ‘భూ’కంపం సృష్టిస్తోంది. అది కూడా.. సరిగ్గా.. ఖమ్మం బీఆర్‌ఎస్ తొలి బహిరంగసభకు ఒక్కరోజు ముందు రోజు! మరోవైపు.. కాపులపై ప్రేమతోనే ‘తోట’కు అధ్యక్ష పదవి ఇచ్చారన్న ప్రచారంలో పసలేదని, బీజేపీ ఆరోపణలతో స్పష్టమయింది. ఆ నియామకంలో ‘కాసుల’ మతలబే తప్ప, ‘కులం కోణం’లేదని తేలిపోయింది.
బీఆర్‌ఎస్ తొలి బహిరంగసభ ముందు రోజు, బీజేపీ పెద్ద బాంబు పేల్చింది. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన, తోట చంద్రశేఖర్ భూ కుంభకోణాన్ని.. బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది రఘునందన్‌రావు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూములు ‘తోట’కు అప్పగిస్తున్నారంటూ.. రఘునందన్ చేసిన సంచలన ఆరోపణలు గులాబీ ‘తోట’లో గుబులు రేపుతున్నాయి. దానితో దీనిపై బీఆర్‌ఎస్ ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
నిజానికి.. తోటకు ఆంధ్రా బీఆర్‌ఎస్ అధ్యక్ష బాధ్యత అప్పగించే ముందే, ‘మియాపూర్ భూముల లింకు’ బయటపడింది. ఆ భూముల క్లియరెన్స్ వ్యవహారంలో, కేసీఆర్ నుంచి హామీ పొందిన తర్వాతనే.. తోట చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరారన్న చర్చ, రాజకీయ వర్గాల్లో జరిగింది.
రైల్వేస్టేషన్ సమీపంలోని ఆ భూములకు సంబంధించి.. కాకినాడకు చెందిన వైసీపీ కాపు నేతతో తోట కంపెనీకి, వివాదం ఉందన్న చర్చ జరిగింది. ‘తోట’తోపాటు బీఆర్‌ఎస్‌లో చేరిన మరికొందరికీ.. హైదరాబాద్‌లో భూముల సమస్య ఉన్నందునే, వారంతా బీఆర్‌ఎస్‌లో చేరారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరిగిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు కాపు ‘తోట’లో ఓట్లు రాలతయా?
ఇప్పుడు వాటిని నిజం చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బయటపెట్టిన అంశాలు, రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు సంకటంలా పరిణమించాయి. దాదాపు 4 వేల కోట్ల విలువైన మియాపూర్‌లోని సర్వే నెంబర్ 78లో.. 40 ఎకరాల భూములను తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించారని, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు. వాటి విలువ 4 వేల కోట్ల రూపాయలని వెల్లడించిన వైనం సంచలనం సృష్టించింది. ఆ సర్వే నెంబర్‌లో జరుగుతున్న అవకతవకలపై, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయంలో కేసీఆర్ సర్కారు పక్షపాతాన్ని… రఘునందన్ వివరించిన వైనం, తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమయింది. గతంలో సుఖేష్‌గుప్తా అనే వ్యాపారి కొన్న 8 ఎకరాలపై, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరి 8 ఎకరాల భూములు కొన్న అంశంలోనే స్పందించిన అదే కలెక్టర్.. 40 ఎకరాల కొనుగోలు విషయంలో మాత్రం, ఎందుకు మౌనంగా ఉన్న రఘునందన్ ప్రశ్నలో, నిజం లేకపోలేదన్న భావన తెలంగాణ సమాజంలో నెలకొంది. అంటే కేసీఆర్ ప్రభుత్వమే, కావాలని తోట చంద్రశేఖర్ కంపెనీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయలేదన్న అభిప్రాయం, రఘునందన్ ఆరోపణలతో స్పష్టమయింది.
రఘునందన్ తాజా ఆరోపణల నేపథ్యంలో, తెలంగాణ వాదుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సొంత రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా.. ఇంకా ఆంధ్రా వ్యాపారులకు భూములు కట్టబెడుతున్న వైనం, వారిలో సరికొత్త ఆలోచనలకు బాటలు వేస్తున్నాయి. ఆ మేరకు తెలంగాణ ఉద్యమంలో పిడికిలి బిగించిన వారిలో చర్చ మొదలయింది.
ఇప్పటికే సీఎస్‌గా ఏపీకి చెందిన శాంతికుమారిని నియమించిన కేసీఆర్ సర్కారు.. ఏపీకి చెందిన మరికొందరు ఐఏఎస్, ఐపిఎస్‌లను తెలంగాణకు తెచ్చుకోవడం, ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం, తెలంగాణ వాదుల్లో అసంతృప్తి రగిలిస్తోంది. ‘ఆంధ్రా పాలన వద్దని, ఆత్మార్పణలు చేసి తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా’? అని.. అటు తెలంగాణ సమాజం సైతం, రఘనందన్‌రావు ఆరోపణలతో మేల్కొన్నట్లు కనిపిస్తోంది. ఆయన ఆరోపణలు.. ఆ స్థాయిలో తెలంగాణ సమాజంపై ప్రభావితం చూపుతున్నాయి.
కాగా… ఇప్పటివరకూ తోట చంద్రశేఖర్‌ను కేవలం కాపు కోణంలోనే, ఆంధ్రా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా నియమించారన్న భావన ఉండేది. పవన్‌ను దెబ్బతీసి.. ఆ మేరకు జనసేన ఓట్లు చీల్చడం ద్వారా, వైసీపీకి ఉపయోగపడేందుకే తోటను నియమించారన్న ప్రచారం జరిగింది. కానీ మియాపూర్ భూముల కోణంలోనే.. ఆయన నియామకం జరిగిందన్న నిజం, రఘునందన్ ఆరోపణలతో స్పష్టమయిందని ఏపీ కాపు నేతలు చెబుతున్నారు. ఫలితంగా ఈ మొత్తం పరిణామాల్లో.. కాసులే తప్ప, కులం కోణం లేదని కాపులు గ్రహించాలంటున్నారు.
తాజా పరిణామాలు.. తోట నియామకంతో, కాపుల ఓట్లు కొల్లగొట్టాలన్న బీఆర్‌ఎస్ వ్యూహం బెడిసికొట్టినట్టయిందని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘తోట’ కేవలం వ్యాపార కోణంలోనే.. బీఆర్‌ఎస్‌లో చేరారన్న రఘునందన్ ఆరోపణలు, ఇప్పుడు కాపుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఫలితంగా.. కాపు ‘తోట’లోకి వెళ్లాలన్న బీఆర్‌ఎస్ ఆలోచనలకు, శాశ్వతంగా దారులు మూసుకున్నట్లయింది.