Suryaa.co.in

Andhra Pradesh

ఏ సంబంధంలేని సీఐడీ గోరంట్ల వీడియోపై మాట్లాడటం ఏంటి?

-తప్పుడు ఎంపీని ఇంకా ఎందుకు కొనసాగనిస్తున్నారు?
-తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

అమరావతి: తప్పుడు పనిచేసిన వాడిని (ఎంపీ గోరంట్ల మాధవ్) రక్షించాలనే తపనతో పోలీసు డిపార్టమెంటు వారిని ప్రభుత్వం వాడుకున్న తీరును చూస్తుంటే ‘పాపం పోలీసులు’ అనిపిస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గోరంట్ల మాధవ్ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నివేదికను కొమ్మారెడ్డి పట్టాభి బయట పెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పచెప్పమని కోరితే, పోలీసులు దానిపై డీజీపీకి రిపోర్టు ఇచ్చిన తరువాత సీఐడీకి రిఫర్ చేస్తేనే ఆ ఫైల్ సీఐడీకి వెళుతుందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. డీజీపీ, సీఐ పకీరప్ప పక్కకు వెళిపోయి, అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ బయటికొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె అడిగారు. సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని ప్రశ్నించారు. సీఐడీ సుమోటోగా ఈ కేసును తీసుకున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోనవసరం లేదని సునీల్ కుమార్ చెప్పి, ఆ ల్యాబ్ కు మెయిల్ ఎందుకు పంపిచారని అడిగారు. గతంలో పక్కీరప్ప మాట్లాడుతూ మాధవ్ ఫిర్యాదు చేయలేదని, అతని అనుచరులు ఎవరో ఇచ్చారని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఆ ల్యాబ్ నివేదికను పరిగణించకపోతే, దేశంలో అధికారిక ల్యాబ్ ల నుంచి నివేదిక తెచ్చుకోవచ్చని తెలిపారు. వీడియోలో ఉన్నది మాధవ్ కాదని ఎవరైనా క్లీన్ చిట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. తనకు సంబంధించి అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే గోరంట్ల మాధవ్ ఫిర్యాదు ఎందు చేయలేదని అడిగారు.

సీఎం, పోలీసులు, వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడతారు అనుకుంటే, ఏ సంబంధంలేని సీఐడీ మీడియా ముందుకొచ్చి టీడీపీ వారు ఎక్లిప్స్ ద్వారా తెప్పించిన నివేదిక ఫేక్ అని సునీల్ కుమార్ విలేకరుల సమావేశం పెట్టి మరీ వివరణ ఇవ్వడమేమిటని అడిగారు. జిమ్ స్టాఫోర్ట్ కి పెట్టిన మెయిల్ లో ‘‘regarding a fake certificate in circulation on your name’’ ఉందని వివరించారు. అతనెవరు ఫేక్ వీడియో అని చెప్పడానికి అని ప్రశ్నించారు? ఇద్దరి మధ్య వీడియో కాల్ సంభాషణ జరుగుతున్న దాన్ని ఎవరో వీడియో తీశారని, ఆ వీడియో ఒరిజినల్ కాదని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నేషనల్ ఫోరెన్సీక్ ల్యాబ్ కు ఆ వీడియోను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మహిళల పరిస్థితి ఏంటని అడిగారు. తప్పు చేసిన ఎంపీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మాధవ్ ని ఎందుకు వెనకేసుకొస్తున్నారని అనిత ప్రశ్నించారు.

LEAVE A RESPONSE