ఎన్ని చెప్పినా ఆమె సీతే..
రుక్మిణిగా కిట్టయ్యను
తులసీదళంతో తూచినా..
శిఖండిగా అటుఇటు కాని
రూపంలో స్వచ్చందమరణ
వరప్రసాది భీష్ముడి
చావుకే కారణమైనా..
చెట్టులెక్కగలవా…
ఓ నరహరి పుట్టలెక్కగలవా..
అంటూ శ్రీహరినే
అటపట్టించినా..
అనార్కలిగా అలరించినా..
సువర్ణసుందరిగా
మెప్పించినా..
అంజలీ దేవి అంటే సీతమ్మే!
నిండు గర్భిణి…
రుష్యాశ్రమం
చూడాలన్న కోరిక…
అలాగే అన్న రామయ్య
అడవికి పంపుతుంటే
వ్యాహ్యాళి అనుకుందే గాని
మరోసారి వనవాసమని
తెలియని భూజాత..
ఏ నిమిషానికి
ఏమి జరుగునో ఎవరూహించెదరు..
అమాయకంగా
మరది వెంట పయనం..
తీరా విషయం తెలుసుకున్న
జానకీ దేవి శోకం..
కన్నులారగ తుదిసారిగ
కరువు దీర వీరశృంగార
రామావతారమ్ము దర్శనమొనర్చి
నిన్ను చేరెద
మన్నింపుమమ్మా..
ఎంత చెప్పినా తరగని సీతమ్మ వెత..
ఆ పాత్రలో అంజలమ్మ కత!
సీత ఇలాగే ఉండేదేమో..
అంత అనునయం..
అంత లాలిత్యం..
అంత సౌకుమార్యం..
అంత నయనమనోహరం..
తెలుగు తెర వేలుపు..
రంగుల తొలి వైదేహి..
పాహి..పాహి..!
రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా..
అనార్కలి అంజలి..
అక్బర్ కొలువులో
చక్కెరకేళి..!
సలీం గుండెల్లో కథకళి!!
పిలువకురా..పిలువకురా
నలుగురిలో నను ఓ రాజా
పలచన చేయకు..
అందంగా మెరిసిన
సువర్ణసుందరి..
నిన్న కనిపించింది..
నన్ను మురిపించింది..
అందచందాల రాణి
ఆ చిన్నది…
ఇంకా సుందరంగా
మురిపించిన రాణిరత్నప్రభ..
అంతకుముందే కీలుగుఱ్ఱంలో
భయపెట్టిన పిశాచి..
మన అంజలి కళల కాణాచి!
అమ్మ..వదిన..
ఇంటి పెద్దకోడలు…
హుందా పాత్రలకు
పెట్టింది పేరు..
ఆ పాత్రల పోషణలో
అంజలి కన్నీటి సెలయేరు..!
మీ నగుమోము
నా కనులారా కడదాకా
కననిండు..
ఈ సూత్రముతో..
ఈ కుంకుమతో
నన్ను కడతేరి పోనిండు..
బడిపంతులులో
నిండు ముత్తైదువ…
అద్భుతమైన అభినయానికి
ఆమె చూపింది త్రోవ..
అన్నపూర్ణ ఆమె కోవ..!
ఈ ఎడ త్రోవ చూపి
నేను గొంపోవమ్మ నీలోనికిన్..
కళామతల్లికి అలుపెరుగని
సేవ చేసి
ఆమెలోనే ఐక్యమైన
మహానటి..
కొన్ని పాత్రల పోషణలో
అంజలికి లేరవరూ సాటి!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286