– పేదవాడి అన్నం గిన్నె… ‘అన్న’ క్యాంటీన్!
ప్రజలే దేవుళ్లు- సమాజమే దేవాలయం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ విధానం. ఈ ప్రసంగాలే.. నాడు తెలుగుదేశం పార్టీని పేదవాడు తన గుండెల్లో పెట్టుకునేందుకు కారణమయింది. ఈ ప్రసంగాలే దశాబ్దాల కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో కూల్చివేసింది. కిలో రెండురూపాయల బియ్యంతో పేదవాడి ఆకలితీర్చిన విప్లవవాది నందమూరి తారకరామారావు.
దేశంలో అప్పుడు అదే తొలి సంక్షేమ విప్లవం. ఇప్పుడు ఆయన బాటలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నడుస్తున్నట్లు.. మళ్లీ ప్రాణం పోసుకోనున్న అన్న క్యాంటీనే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.
పేదవారికి కడుపునిండా భోజనం పెట్టేందుకు చంద్రబాబు గతంలో పెట్టిన అన్నక్యాంటీన్లను కూల్చివేసిన జగన్ సర్కారుపై, పేదవాడు కన్నెర్ర చేసి ఫలితంగా ఆయన గద్దెకూలింది. ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా గెలిచి, పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు ఊపిరిపోయనున్నారు. ఇది అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు.. స్వాతంత్య్రదినోత్సవ వేళ పేదవాడికి ఇస్తున్న మానవీయకానుక.
పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన రాజకీయ విధానమని చాటిచెప్పిన అఖిల భారత అన్న గారి కలను .. ఆయన అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజం చేయనున్న సమయం మరికొద్ది గంటల్లో సాక్షాత్కరించనుంది.
‘దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రతిరోజూ ఆకలితోనో, అర్ధాకలితోనో ముణగదీసుకొని పడుకోవడం కంటే మించిన విషాదం, అనాగరికత మరొకటి లేదు. ప్రజల క్షుద్బాధను తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి’…
పేదవాడి అన్నం గిన్నె… ‘అన్న’ క్యాంటీన్!
‘దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రతిరోజూ ఆకలితోనో, అర్ధాకలితోనో ముణగదీసుకొని పడుకోవడం కంటే మించిన విషాదం, అనాగరికత మరొకటి లేదు. ప్రజల క్షుద్బాధను తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి’ అన్నారు మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంలో. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందిన 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో పేదరికం 80 శాతంగా ఉంది. అప్పటికి 4 ఏళ్ల ముందు.. బెంగాల్‌లో తీవ్ర క్షామం ఏర్పడి 40 లక్షల మంది ఆకలితో చనిపోవడం భారతదేశం ఎదుర్కొన్న పెనువిషాద సంఘటనల్లో ఒకటి.
1956లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ మిన్హాస్ ఆనాటికి దేశంలో పేదరికం స్థాయి 65 శాతంగా ఉన్నట్లు అంచనా వేశారు. ప్రతిరోజూ 2,200 కేలరీల శక్తి అందించే ఆహారం తీసుకోలేని ప్రతి ఒక్కరూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టుగా ప్లానింగ్ కమిషన్ లెక్కగట్టింది. ఆ తర్వాత పేదరికం స్థాయి కొలవడానికి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం మొదలుపెట్టారు.
స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేదరిక నిర్మూలన అతిపెద్ద సవాలుగా మారింది. అయితే అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు విడివిడిగా, ఉమ్మడిగా పలు రకాల పేదరిక నిర్మూలనా పథకాలు అమలు చేయడం మొదలుపెట్టాయి. అయినప్పటికీ, దేశంలో ఆకలితో అలమటించేవారి సంఖ్య పెరుగుతూ పోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు 1983లో కిలో బియ్యం రూ.2ల చొప్పున 25 కిలోల బియ్యం ప్రతి పేద కుటుంబానికి అందించే పథకం ప్రవేశపెట్టి సంక్షేమ రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ పథకం పేదల క్షుద్బాధను తీర్చడమేకాక వారికి ఆహారభద్రత సమకూర్చింది. దీనివల్ల రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలిరోజుల్లోనే ఎన్‌టిఆర్ ‘‘పేద ప్రజలే నాకు దేవుళ్లు. వారికి ఇంత నైవేద్యం పెట్టడమే నా విధివిధానం’’ అని తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 43 శాతం మంది పేదలు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంత పేదరికం దాదాపు 50 శాతం దాటి ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలిపాయి. ఆ నేపథ్యంలోనే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పేద కుటుంబానికి నెలకు 25 కిలోల బియ్యాన్ని కిలో రూ.2 లకు అందించే పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్‌టిఆర్ ప్రకటించారు.
ఈ పథకం అమలునకు విధివిధానాలు రూపొందిస్తున్న క్రమంలో ఓ ఉన్నతాధికారి ఆయనతో ‘‘సార్.. మరోసారి ఆలోచించండి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు మోయలేని భారం పడుతుంది’’ అని చెప్పబోతుంటే ‘‘పేదవాడికి పట్టెడన్నం పెట్టలేనప్పుడు ప్రభుత్వం దేనికండి? రాజకీయాలు దేనికి? ఎంత భారమైనా ఫరవాలేదు నేను చూసుకొంటాను’’ అని ఎన్‌టిఆర్ తీవ్ర స్వరంతో బదులిచ్చారు.
విశేషం ఏమంటే పేదవాడి ఆకలి తీర్చడానికి అందించే బియ్యం పథకంలో ఎన్‌టిఆర్ అంకెలగారడీ చేయలేదు. చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనుకొన్నారు. అందులో భాగంగా ఆనాడు తెల్లరేషన్ కార్డు పొందడానికి ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.3,600 నుంచి రూ.6,000లకు పెంచారు. దాంతో 1 కోటి 43 లక్షల కుటుంబాలకు కిలో రెండు రూపాయల బియ్యం పథకం అందింది. అంతేకాకుండా వారసత్వంగా సంక్రమించిన బలహీన ప్రజాపంపిణీ వ్యవస్థ (డిడిఎఫ్)ను పటిష్టం చేయడానికి సమర్థుడు, నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్‌ను సివిల్ సప్లయిస్ కమిషన్‌గా నియమించారు.
అంతకుముందు, కాంగ్రెస్ పాలనలో పీడీఎస్ వ్యవస్థ బలహీనంగా, అవినీతిమయమై ఉండేది. చౌకధరల డిపోల ద్వారా కిరోసిన్, పంచదార, అప్పుడప్పుడు అరకొరగా బియ్యం ఇచ్చేవారు. తూనికల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకొన్నవారే కరువయ్యారు. అయితే, కె.ఆర్.వేణుగోపాల్, ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన సి.డి.అర్హల సారథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టం అయింది.
ఢిల్లీ వెళ్లి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ఒప్పించి కేంద్రం ద్వారా లభించే బియ్యం కోటాను పెంచడంలో కూడా ఎన్‌టిఆర్ విజయం సాధించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి పేదవాడి ఇంట్లో నెలలో మొదటివారంలో 25 కిలోల బియ్యం మూట.
అది కూడా 100 గ్రాముల తరుగులేకుండా ఉండాలని ఎన్టీఆర్ ఇచ్చిన ఆదేశం తు.చ. తప్పకుండా అమలైంది. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ అయ్యేవి. పేదలు ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకొనే దుస్థితి నుంచి, నెలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చుకొని ఆహారభద్రతతో స్థిమితంగా, సుఖంగా నిద్రపోయిన మెరుగైన స్థితికి రాష్ట్రం చేరుకుంది.
ఇక, హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఎన్టీఆర్ పాలనలో అన్నపూర్ణ క్యాంటీన్ల ఏర్పాటునకు కూడా ఘనమైన నేపథ్యం ఉంది. 80వ దశకంలో ఇప్పటి మాదిరిగా నగరాలలో, పట్టణాలలో రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్లు, ఇడ్లీ బండ్లు లేని సమయంలో కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల రోజువారీ ఆకలి అవసరాలు తీర్చడానికి హోటళ్లు మాత్రమే ఉండేవి.
అయితే, అందులో తినుబండారాల ధరలు పేదలకు అందుబాటులో లేవని గుర్తించిన ఎన్‌టిఆర్ 1984 ఫిబ్రవరిలో హోటళ్లను వాటి వ్యాపార పరిణామాన్ని బట్టి వర్గీకరణ చేసి.. ఆయా హోటళ్లల్లో తినుబండారాల ధరలను ఫిక్స్ చేస్తూ ఓ ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే, ఆ ధరలు తమకు సమ్మతం కావంటూ హోటళ్ల యజమానుల సంఘం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది.
ఆ సందర్భంగా ఫిబ్రవరి 21, 1984న ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అసెంబ్లీలో నిబంధన 329 కింద జరిగిన చర్చలో మాట్లాడుతూ హోటళ్ల యజమానులకు ఓ అప్పీల్ చేశారు. ‘‘ధరలు తగ్గించమని నేను పై అంతస్తులో ఉన్నవారి కోసం అభ్యర్ధించడం లేదు. పేదవారి కోసం అడుగుతున్నాను. ఈ రోజు స్వల్పంగా ఫలహారం తీసుకోవడం, కాఫీ లేదా టీ త్రాగడం సమాజంలో ఒక నిత్యావసరంగా మారిపోయింది.
నేతిపలహారాలు, మసాలాదోశ, మసాల వడ, మైసూర్‌పాక్‌ల ధరలను మేం నిర్ణయించడం లేదు. కేవలం పేదలు తినే ఇడ్లీ, వడ, ఉప్మా, సాదాదోశ, కాఫీ, టీ, ఒక ప్లేటు భోజనానికి మాత్రమే ధరలు నిర్ణయించాం. విస్తరి నిండా కూడా భోజనం పెట్టడానికి నిర్ణయించలేదు. ఎవరు ఆకలితో, అన్నార్తితో వస్తారో వారికి కొంత ఆకలి తీర్చడానికి మీరు ఈ కాస్త సహకారం ఇవ్వండి.. పేదవారి ఆకలిని గమనించి సహకరించి పుణ్యం కట్టుకోండి’’ అంటూ ఎన్‌టిఆర్ చేసిన అభ్యర్ధన పేదవాడి ఆకలి తీర్చడానికి పడిన ఆరాటానికి అద్దం పడుతుంది.
ఆనాడు అసెంబ్లీలో ఈ చర్చ జరిగినపుడు.. హోటళ్ల వాళ్లు న్యాయస్థానానికి వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని కొందరు సభ్యులు హెచ్చరించిన నేపథ్యంలో.. ప్రభుత్వమే పేదల ఆకలిని తీర్చడానికి క్యాంటీన్లు తెరవాలని నిర్ణయించి రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ ప్రారంభిం చారు. జంటనగరాలతోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాలలో సబ్సిడీ ధరలపై పేదలకు ఉదయం వేళ ఉపాహారం, మధ్యాహ్నం ప్లేట్ భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్లు ఆనాడు పేద ప్రజల పాలిట అక్షయపాత్రగా ఉపయోగపడ్డాయి.
దేశంలో పేదల కోసం ప్రభుత్వమే క్యాంటీన్లు ప్రారంభించి సబ్సిడీ ధరలపై ఆహారాన్ని అందించడం అదే ప్రథమం. పేదల ఆకలిని గుర్తించి తీర్చడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకున్న ఏకైక నాయకుడు దేశంలో ఎన్‌టిఆర్ ఒక్కరే.
పేదల పెన్నిధి అయిన ఎన్‌టిఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల ఆకలిని తీర్చడానికి ఐదు రూపాయల స్వల్పధరతో భోజనం అందించే ‘అన్న క్యాంటీన్ల’ను ఐదేళ్ల తర్వాత పునఃప్రారంభించడం ఆహ్వానించదగినది. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన రాజకీయ విధానమని చాటిచెప్పిన ఎన్టీఆర్‌కు అందించే ఘనమైన నివాళి అన్న క్యాంటీన్ల ప్రారంభం.
(ఆగస్టు 15న ‘అన్న క్యాంటీన్లు’ పునఃప్రారంభం సందర్భంగా)