-వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా
ఎన్నికలకు ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురయింది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు.
కిల్లి కృపారాణి మాట్లాడుతూ… తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విమర్శించారు. తనకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని చెప్పారు. పదవుల కంటే తనకు వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని అన్నారు. తనకు గౌరవం ఎక్కడుంటే అక్కడకు వెళ్తానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.