– అవినీతిని గుర్తించిన ఏసీబీ
– జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
విజయవాడ: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ భూములను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసిందన్న అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఫోర్జరీ కోణం ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఫలితంగా జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని విక్రయించినట్టుగా చెబుతున్న వ్యక్తి తాను అమ్మలేదని అది నకిలీ డాక్యుమెంటుగా అనిశాకు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఫోర్జరీ కేసు కూడా నమోదు కానుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో రూ.10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన ఉదంతంపై అనిశా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, తనయుడు రాజీవ్‌ల పేర్లపై కొనుగోలు చేసినట్టు చెబుతున్న 2 వేల 160 గజాల స్థలాన్ని తిరిగి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నంబరు 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబరు 87లో ఉన్నట్టుగా లేఖ పొంది, స్వీయ సవరణ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకొని, తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నంబరు 88లో నాలుగు ఎకరాలు బొమ్మా వెంకటచలమారెడ్డి పేరుపై ఉండేది.
దీనిలో ఎకరం పోలవరపు మురళీమోహన్‌కు, ఎకరం అద్దెపల్లి కిరణ్ కుమార్‌కు, రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు. పోలవరపు మురళీమోహన్ 2 వేల 301 చదరపు గజాల స్థలాన్ని 2003, 2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఈ ప్లాట్లన్నీ సర్వే నంబరు 88లో ఉన్నాయి. అదే పోలవరపు మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్‌లకు విక్రయించినట్టు 2022లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహనన్ను కూడా నిందితుడిగా చేర్చింది. ఆయన తన వాంగ్మూలంలో తాను జోగి కుటుంబానికి విక్రయించలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లలో మురళీమోహన్ ఆధార్ నంబరు చివరి అంకెలు 6251గా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆధార్ నంబరు 5420గా ఉంది. 6251 నంబరు కర్రి రత్నం పేరుతో ఉంది. గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా, అసలు తాను సర్వే చేయలేదని అధికారులకు ఆమె వివరణ ఇచ్చారు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్టు ఫోర్జరీ చేశారు. వీటన్నింటిపై అనిశా దర్యాప్తు చేస్తోంది.