కల ఇదనీ నిజమిదనీ
తెలియదులే బ్రతుకింతేనులే..
అలా అనుకుని ఆగిపోలేదు
ఆ చొక్కి దవడల కుర్రాడు..
కల కానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే
బలిచేయకు..
అనుకుంటూ
సక్సెస్ దారిలో
పరుగులు తీసిన బాటసారి!
ఎన్టీఆర్..
ఈ మూడక్షరాలు
సంచలనమైతే..
ఏయెన్నార్..
అనే మరో మూడక్షరాలు నటనకు బహువచనం…
ఈ ఇద్దరూ కలిస్తే
క్రమశిక్షణకు నిర్వచనం..!
అన్న రాకమునుపే
ఈ తమ్ముడు
ఓ సూపర్ స్టార్..
అప్పటికే వేషాల కోసం
ధర్మపత్ని తో కలిసి
కీలుగుఱ్ఱం ఎక్కి మాయాలోకం
చుట్టేసిన
బాలరాజు..
పోటీ రాగానే తానేమిటో
తెలుసుకుని వక్రదృష్టి లేకుండా తనకు
తగ్గ పాత్రలే ఎన్నుకుని
హిట్లు కొట్టిన చక్రపాణి..
బ్రదర్ తో కలిసి మాయాబజార్ లో
వీరవిహారం చేసి
గుండమ్మకథ ను నడిపించిన నటసామ్రాట్టు!
నవరసాలను
నవరాత్రు లలో పోషించి
మెప్పించిన విప్రనారాయణ
విషాదానికి దేవదాసు..
అనార్కలి తో
భగ్నప్రేమకు సలీం..
రౌద్రానికి చాణక్యుడు..
మీకు మీరే మాకు మేమే
సున్నితమైన హాస్యానికి
మిస్సమ్మ రాజు..
శౌర్యానికి కిరీటి..
ఇలా ఎన్నో పాత్రలను
రసిక రాజ
తగువారము కామా..
అంటూ పోషించి
జయభేరి మోగించిన
దసరాబుల్లోడు..!
ఇక శృంగారం
ఎన్నో పాత్రల అనుభవసారం..
అరవై ముగ్గురు
హీరోయిన్లకు చేసేసాడు
ప్రేమాభిషేకం..!
అక్కినేని జీవితం
సినిమా కథ కాదు..
సినిమానే ఆయన జీవితం
చిన్నప్పుడు విద్య
నేర్వలేకపోయిన
పల్లెటూరి బావ..
హీరోగా మారినాక కాలేజీబుల్లోడు కాకపోయినా
ఇంగ్లీషు నేర్చేసిన దొరబాబు..
కళామతల్లికి దత్తపుత్రుడు!
ఎలిశెట్టి సురేష్ కుమార్