Suryaa.co.in

Features

గనిలో,వనిలో,కార్ఖానాలో!

నేడు బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
చిదిమితే పాల్గారు
లేత ప్రాయం…
మారాజు మందిరంలోనైతే
యువరాజు..
గొప్పోడి ఇంట్లోనేమో చిన్నసారు..
మధ్యతరగతి
కుటుంబంలో బాబు..
మొత్తంగా ఇంటికి వారసుడు
సంపదకు కాబోయే యజమాని..
కాలు కింద పెట్టని సుకుమారుడు..
నీ కుమారుడు..!

అదే వయసు పిల్లాడు..
పేదింట తానూ కష్టజీవే..
అమ్మా నాన్న వెంట
గనిలో..వనిలో..కార్ఖానాలో
తానూ ఆరు గాలం
కష్టపడే కూలోడు..
చెమటతో స్నానం..
కష్టాలతో సావాసం..
దినామంతా ఆయాసం..!

బడిలో అక్షరాలు దిద్దాల్సిన
లేత వేళ్లు..
కాయకష్టానికి ఆనవాళ్లు..
ఆటపాటలు మరచి..
అన్నపానీయాలు విడిచి
చేత గొడ్డలి..నెత్తిన తట్ట..
ఆ ఎనకే తాతనే ముగ్గుబుట్ట
నాలాగే నువ్వు..
జీవమే లేని నవ్వు..
మొగ్గలోనే
కమిలిపోయే పువ్వు…
కుమిలిపోయే బాల్యం..
ఇది కాదా విధి క్రౌర్యం!!

దేశంలో ఎన్నో చట్టాలు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకూ ఉన్నా
అమలు అంతంతే..
రోజూ హోటళ్లలో..
దుకాణాల్లో..ఫ్యాక్టరీల్లో
పనిచేస్తూ నీకూ..నాకూ
కనిపిస్తే అయ్యో
అనే నిస్పృహ..
అంతే.. అంతే…
మన సామాజిక స్పృహ…
చట్టాలు ఉద్దరిస్తాయనే అపోహ..
ఆ చట్టాలు
అమలు చేయాల్సిన పెద్దలు
పప్పు సుద్దలు…
చూసీ చూడనట్టు
నటించే అధికారులు
కళ్లున్న కబోధులు..
అవకాశం దొరికితే
పీక్కు తినే రాబందులు..!

ఆ కన్నీరు..
కళ్ళ వెనక
నీకు కనిపించని
మున్నీరు..
ఆగని సెలయేరు..
బానే ఉన్నాడని
నీకు అనిపిస్తే
అది నీ తప్పు కాదేమో..
అది ఆ చిన్నోడి మనోధైర్యం
అంతకు మించిన అవసరం..
చిన్న వయసులోనే
వేన్నీటికి చల్ల నీరు సాయం..
వ్యవసాయం లేని ఫలసాయం..
చాలీచాలని ఆదాయం..
ఇదే ఇదే దశాబ్దాలు గడచినా
మారని భారతీయ సంప్రదాయం..
చట్టాల పదఘట్టనల
కింద నలిగిపోయే
చిన్నతనం..
కుమిలిపోయే అమ్మతనం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE