రాజధాని..రాజకీయధాని!
ప్రభుత్వం మీది…
ఏలుబడి మీది..
మెజారిటీ మీది..
బలం మీది..
బలగం మీది..
సంకల్పం మీది..
మడమ తిప్పని
నాయకత్వం మీది..!
ఇక అంతిమ నిర్ణయమూ మీదే..!!
మరి దేనికి ఈ తాత్సారం..?
ఎందుకు
ప్రభుత్వ ప్రాయోజిత
ఈ ఆందోళనలు..?
ఈ అలజడి..!
ఈ అశాంతి..!
ఈ ప్రాంతీయ విబేధాలు..!
ఈ ఆందోళనలు..
ఈ ప్రకంపనలు..
ఈ లొల్లి..
ఇలా తుళ్ళి తుళ్ళి..!
మొన్న 2019 ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మూడు రాజధానుల రగడ మొదలైంది. అప్రతిహత సంఖ్యాబలం ఉన్న జగన్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎందుకు అంత తాత్సారం చేసినట్టు..మొదట్లో మండలి చిక్కు ఉండేది..ఇప్పుడు అది కూడా లేనట్టే..! తొలినాళ్లలోనే గట్టి నిర్ణయం తీసుకుని ఉంటే ఇప్పుడు సమస్య ఇంతగా ముదిరి ఈ రోజున ఇలా మూడు సంవత్సరాలుగా రాజధాని ఏదో..ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడి ఉండేవి కాదు కదా.. జగన్ నిజంగా పంతం పడితే ఆగే వ్యవహారమా..!?
కోర్టు ప్రతిబంధకాలు ఉన్నా గాని అనుకుంటే ఆగేనా..
మొత్తానికి ఈ జాప్యం వల్ల అటు అమరావతి..
ఇటు విశాఖ అభివృద్ధి కాకుండా ఉండిపోయి వ్యవహారం త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయింది..!
ఇంతకీ అభివృద్ధి అంటే
రాజధానితో ముడిపడి
ఉండే అంశమా..
ఇన్నాళ్లు ఇతర పార్టీలు చేసిన గోల వేరు…
ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది..విశాఖకు రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందనే ప్రచారాన్ని
సాక్షాత్తు మంత్రులే ముమ్మరం చేశారు.
ఆమాత్యులు ఇలా చెబుతున్నారంటే..రాజధాని ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందుతుందని
అర్థమా..అదే సందేశమా…
మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం
సందేహమా..!?
సచివులే ఇలా చెప్పడం తగునా..ఇది తగువా..
తగ్గిన తెగువా..!?
ఇన్నాళ్లు ఊరుకుని ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఉత్తరాంధ్ర మంత్రులకు ఇంతటి ఆవేశం ఎందుకు వచ్చినట్టో.. మంత్రుల నేతృత్వంలో ఇలాంటి ఆందోళనలు అవసరమా..అనుకున్నది చప్పున చేసేయవచ్చు కదా..
ఇంత హంగామా దేనికి..!?
ఇలా రాజధానిపై ఎటూ తేల్చకుండా వస్తుంది..వచ్చేస్తుంది..
అని ఆశలు పెడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు పెద్ద ఎత్తున కొల్లగొట్టే ప్రణాళిక ఇది..అదే సమయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు..
ఆయన పార్టీ అతి భయంకరమైన ప్రతిబంధకం
అని ప్రజల్లో ఒక బలమైన యాంటీ సెంటిమెంటును
మరింత బలంగా నాటి ప్రయోజనం పొందాలన్నది వైసిపి వ్యూహం..ఇదంతా ఎన్నికల వరకు ఇలాగే కొనసాగుతుంది..ఈ పరిస్థితి అనుకూలంగా మారుతున్న సమయానికి జగన్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతుంది..!
ఇలా అభిప్రాయపడు తున్న వారెవరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి
వ్యతిరేకం అనుకోడానికి
లేదు…రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి..
ఉత్తరాంధ్ర ఎన్నో ఏళ్లుగా వెనకబడి ఉంది గనక మరింతగా అభివృద్ధి చెంది తీరాలి..రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుందనేది
వాస్తవమే అయినా రాజధాని వస్తేనే అభివృద్ధి అనుకోవడం..అది కూడా మంత్రులతో చెప్పించడం సబబేనా..ప్రభుత్వం అంటే అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలి..
అన్ని ప్రాంతాలను ఒకేలా అభివృద్ధి చెయ్యాలి..!
అయినా..నిజంగా రాజధాని వస్తే ఏ ప్రాంతమైనా అమాంతం అభివృద్ధి చెందుతుందని అనుకుంటే
వికేంద్రీకరణతో హైదరాబాద్ అంతటి అభివృద్ధి సాధ్యపడుతుందా..
అసెంబ్లీ..పాలన..హైకోర్టు..
అన్నీ ఒక దగ్గరే ఉంటే అప్పుడు కదా హైదరాబాదు మాదిరి అభివృద్ధి జరిగేది..
ఒక్క హైదరాబాద్ అనే కాదు
మద్రాస్..బెంగళూరు..
కలకత్తా..ముంబై..త్రివేండ్రం..
ఆమాటకొస్తే ఢిల్లీ..అలాగే కదా అభివృద్ధి చెందాయి..
ఇప్పుడు మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే మూడు మహానగరాలు
పుట్టుకొస్తాయా..అయినా ఎప్పుడో ఒకసారి సమావేశాలు జరిగే అసెంబ్లీ..
తక్కువ మందికి మాత్రమే
అక్కరకు వచ్చే హైకోర్టు ఉంటే
ఆ నగరాలు రాజధాని అవుతాయా..అలాంటి పరిస్థితిలో అద్భుతమైన
అభివృద్ధి ఎలా జరుగుతుంది..ఆయా ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడానికే అలా చేస్తున్నామని అంటే అప్పుడు అభివృద్ధి అవి లేకపోయినా చెయ్యవచ్చు కదా..!
ఏమిటో ఈ అయోమయం..
ఈ గందరగోళం..!
ఏదిఏమైనా వచ్చే ఎన్నికల వరకు ఇదంతా తప్పదనే అనిపిస్తోంది..!
ఇదంతా వైసీపీ..
మిషన్ 2024 వైభోగమే..
మిస్సైల్ 175 లో భాగమే..!
ఈఎస్కే
జర్నలిస్ట్