– నేడు సుప్రీంకోర్టు సీజే బెంచ్‌మీదకు రానున్న అమరావతి కేసు విచారణ
– ప్రధాన న్యాయమూర్తి లలిత్ త్రిసభ్య బెంచ్ విచారణ
– ఆయన బెంచ్ నుంచి తప్పుకోవాలంటున్న న్యాయవాదులు
– ఆయన గతంలో జగన్‌కు లాయర్‌గా పనిచేశారని వాదన
– బెంచ్‌లో ఉండటం న్యాయం కాదంటున్న లాయర్లు
– తప్పుకోవాల్సిందేనంటున్న అమరావతి రైతుల న్యాయవాదులు
– గతంలోనూ ఇలాంటి సందర్భాలు అనేకం
– చీఫ్ జస్టిస్ బెంచ్‌లో ఉంటారా? లేదా?
– చీఫ్ జస్టిస్ లలిత్ నిర్ణయంపై ఉత్కంఠ
– 7న రిటైర్ కానున్న సీజే లలిత్
( మార్తి సుబ్రహ్మణ్యం)
అమరావతి రాజధాని కేసు కొత్త మలుపు తిరిగింది. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సెప్టెంబర్‌లో దాఖలు చేసింది. అద సమయంలో, హైకోర్టు ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ స్పష్టమైన ఉత్తర్వులివ్వాలని కోరుతూ, అమరావతి రైతుల తరఫున మరో పిటిషన్ వేశారు. విచిత్రంగా ఈ రెండు కేసులూ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. అవి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ త్రిసభ్య బెంచ్ ముందు విచారణకు రానున్నాయి. ఆ మేరకు కేసు నెంబర్ 6, 9 తో లిస్ట్ అయ్యాయి. దానితో అందరి దృష్టీ ఢిల్లీ వైపు మళ్లింది.కాగా ఈనెల 7తో సీజే లలిత్ పదవీ విరమణ చేయనున్నారు.
అయితే ఈ కేసు నుంచి ప్రధాన న్యాయమూర్తి లలిత్ తప్పుకోవాలని.. రైతుల పక్షాన వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్లు కోరుతుండటం, కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. లలిత్ గతంలో జగన్ కేసులు వాదించిన లాయర్ కావడంతో, అదే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం వేసిన కేసులో తీర్పు ఇచ్చే స్థానంలో ఉండటం, నైతికంగా మంచిది కాదన్నది లాయర్ల వాదన.
అప్పట్లో జగన్ తరఫున వాదించిన యుయు లలిత్.. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ.. జగన్ ప్రభుత్వంపై వేసిన కేసు విచారించడం అనైతికమని కూడా లాయర్లు వాదిస్తున్నారు. ఫాలీ నారీమన్, వికాస్‌సింగ్, రంజిత్‌కుమార్, ఆర్యమాన్ సుందరం, శ్యాందివాన్, అరవింద్ దత్తర్, మీనాక్షీ అరోరా, దేవదత్ కామన్, ఆదినారాయణ, ఉన్నం మురళీధర్‌రావు స్పష్టం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో, కొన్ని ప్రధాన అంశాలపై స్పష్టత లేదంటూ, రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ , రాజధాని పరిరక్షణ సమితి కేవియెట్లు కూడా దాఖలు చేసింది.
ఇప్పుడు ఈ రెండు కేసులూ, మంగళవారం చీఫ్ జస్టిస్ లలిత్ త్రిసభ్త ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు మెంబర్ 6, 9 పేరుతో అవి లిస్ట్ అయ్యాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్‌సిబల్, దుష్యంత్ దవే, నిరంజన్‌రెడ్డి వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యాయసూత్రాలు, నైతికధర్మం ప్రకారం చీఫ్ జస్టిస్ యుయు లలిత్, కేసు విచారణ నుంచి తప్పుకుని వేరే బెంచ్‌కు అప్పగిస్తారా? లేక తానే కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. గతంలో కూడా అనేక మంది న్యాయమూర్తులు… తమకు సంబంధించిన రాష్ట్రాలు గానీ, గతంలో తాము వాదించిన వ్యక్తుల కేసులు గానీ, తమ బెంచ్ ముందు వచ్చిన సందర్భాల్లో తప్పుకుని, మరొక బెంచికి అప్పగించిన విషయం తెలిసిందే.ఆ సంప్రదాయాన్ని చీఫ్ జస్టిస్ యుయు లలిత్ కొనసాగిస్తారా? లేదా అన్నది వేచిచూడాలి.