దోచి దాచకు..!

ఉన్ననాడు తెలివి కలిగి
పొదుపు చేయరా..
లేనినాడు ఒడలు వంచి
కూడబెట్టరా..!

నేటి పొదుపు..
రేపటి మదుపు..
ఆ తరంలో..ఈ తరంలో..
నీకైనా..నాకైనా..ఎవరికైనా
ఇదే వేదమంత్రం..
బ్రతికే సూత్రం..!

అయితే..పొదుపంటే
సొమ్ము మాత్రమే కాదు..
వనరులు..
నేటి మొక్క..
మరునాటికి చెట్టు..
మరో నాటికి మహావృక్షం!

కొండలైన కరగిపోవు
కూర్చుని తింటే..
కూలిపోవు కాపురాలు
ఇది తెలియకుంటే..
ఈ మాటలు
బాగుంటాయి వింటే..
ఆచరణే కష్టం..
క్రమశిక్షణ కలిగి మెలగరా..
ఆపై నీ ఇష్టం!

సరే..నువ్వు చేస్తే పొదుపు
నీ ఇంటికి మేలు..
కాని..అదుపు లేని..
పొదుపు ఎరుగని
సర్కార్ల దుబారా..
ఈ పంపిణీల హంగామా..
అప్పుల పాలు..
అదెంత భారం ఈ దుబారా..
అందుకోడానికి
ఎందుకంత గాభరా..?
ఈ స్కీములు..
పెద్ద స్కాములు..
సంక్షేమం కాదది..సంక్షామం!

అన్నట్టు..అతి పొదుపు..
అదీ ముప్పే..
నువ్వు తినడం మాని..
తగిన బట్ట కట్టక..
జీవితాన్ని అనుభవించక..
బ్రతికే బ్రతుకు ఎడారి..
అప్పుడు నీ పేరు పిసినారి..!
అవసరాన్ని
మించిన పొదుపు..
దెబ్బతినే గరిమనాభి…
నీ మరోపేరు లోభి..!

ఇతరుల పొట్ట కొట్టి..
నీ పొట్ట కట్టి
కూడబెడితే ఆస్తి..
సమాజానికి నీ వల్ల
ప్రయోజనం నాస్తి..
చెప్పేయి ఆ పద్ధతికి స్వస్తి..
సంపాదించు..ఆస్వాదించు..
ఆస్తి పెంచు..
అవసరానికి మించి ఉంటే
కాస్త పంచు..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply