– డీజీపీ, సీఎస్‌లకు హైకోర్టు తలంటు
– మూడున్నరేళ్ల నుంచి ఇది మూమూలే
– అయినా మేల్కొనని బాసులు
– బాసులకు అధికారాలు లేకనే ఈ అవమానపర్వమా?
– అధికారులు డీజీపీ, సీఎస్ మాట వినడం మానేశారా?
– పోస్టింగుల్లో వారి ప్రమేయం లేకనే ఈ నగుబాటా?
– అధికారపార్టీకే అధికారులు గులాములయ్యారా?
– అరెస్టుకు ఆదేశించిన ఉన్నతాధికారులపై శిక్షలు ఉండవా?
– ఏఎస్‌ఐ, ఎస్‌ఐలే బలిపశువులా?
– నంద్యాల కేసులో ఏఎస్‌ఐ, ఎస్‌లపై డీజీపీ వేటు
– మరి సీఐడీ పోలీసులకు ఆదేశిస్తున్న వారిని శిక్షించరా?
– తాజాగా హైకోర్టుకు హాజరైన రెండో డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి
– గతంలో హైకోర్టు మెట్లెక్కిన సవాంగ్, ఆదిత్యనాధ్‌దాస్, సమీర్‌శర్మ, నీలం సహానీ
– పలువురు ఐఏఎస్‌లకు సామాజికసేవా శిక్షలు వేసిన ఏపీ హైకోర్టు
( మార్తి సుబ్రహ్మణ్యం)
భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానాల కన్నెర్రకు గురవుతున్న రాష్ర్టాల్లో ఏపీ ముందువరసలో ఉంది. కోర్టు ధిక్కరణ, నిబంధనలు లెక్కచేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవ డం వంటి చర్యలతో, ఐఏఎస్-ఐపిఎస్‌లు అవమానం పాలవుతున్నారు. న్యాయమూర్తుల ముందు తలవంచుకుని నిలబడుతున్న దయనీయ పరిస్థితి, ఏపీ బాసులకే సొంతంగా మారింది.గత మూడున్నరేళ్ల నుంచి అదొక అలవాటుగా మారిన దుస్థితిని చూసి, సొంత శాఖల్లోనే సానుభూతి వ్యక్తమవుతోంది. కోర్టుకు హాజరకావడాన్ని అవమానంగా భావించవద్దని జడ్జిలు వ్యాఖ్యానిస్తున్నా.. అది తమ శాఖకు అవమానేనన్నది పోలీసువర్గాల ఆవేదన. తాజాగా హైకోర్టుకు హాజరయిన డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి తన కోర్టు హాజరుకు కారణమయిన, ఇద్దరు కింది స్థాయి పోలీసులపై వేటు వేయడం చర్చనీయాంశమయింది. మరి ఇదే పద్ధతి.. అర్థరాత్రి కూడా ఇళ్ల తలుపు తట్టి, నిబంధనలు ఉల్లంఘించి పౌరులను అరెస్టు చేస్తున్న, సీఐడీ పోలీసులపై ఎందుకు అమలుచేయడం లేదన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
కోర్టు మెట్లెక్కుతున్న ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల తీరుతో, ఆ వ్యవస్థలపై గౌరవం తగ్గుతుందన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. నిబంధనలు అనుసరించకుండా.. పాలకుల మెప్పు కోసం బాసులు తీసుకుంటున్న నిర్ణయాలు, చివరారఖకు కోర్టు ముంగిటకు చేరుతున్నాయి. బాసులు తీసుకున్న నిర్ణయాలు చట్టబద్ధంగా కాకుండా, పాలకపార్టీల పక్షంగా ఉండటంతో న్యాయమూర్తులు, బాసులపై అక్షింతలు వేస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా బేఖాతరు చేసిన శ్రీలక్ష్మి సహా మరికొందరు ఐఏఎస్ అధికారులు.. చివరకు తమ సొంత డబ్బుతో గురుకుల హాస్టళ్లకు వెళ్లి సేవ చేయాల్సిన దుస్థితిని బాసులు తమంతట తాము కోరి తెచ్చుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గతంలో డీజీపీగా పనిచేసిన గౌతం సవాంగ్, సీఎస్‌గా పనిచేసిన ఆదిత్యనాధ్‌దాస్, నీలం సహానీ, సమీర్‌శర్మ కూడా హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది.
ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండే పాలకుల మెప్పు, పోస్టింగుల కోసం వారి ముందు సాగిలబడుతున్న ఫలితమే ఈ నగుబాటు పర్వానికి కారణమన్నది సీనియర్ల అభిప్రాయం. గత కొద్దినెలల క్రితం సీఎంఓలో ఒక వెలుగు వెలిగి, తర్వాత ఢిల్లీకి చేరిన ఓ ఐఏఎస్ ఏది చెబితే అది వేదంగా ఉండేది. ఆయన అతి చేష్టలు సహచర అధికారులను విసిగించేవి. అయితే ఆయన ఆదేశాలు పాటించిన ఐఏఎస్‌లకు మంచి పోస్టింగులే దక్కాయి. అలా మంచిపోస్టింగులు దక్కించుకున్న వారిలో కొందరు, కోర్టు కన్నెర్రకు గురయి, సామాజికసేవా శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు.. దంపతుల కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు చూపిన అత్యుత్సాహానికి, డీజీపీ హోదాలో తొలిసారి కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన మరో కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి కూడా హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. నంద్యాలలో బియ్యం సరఫరా వ్యవహారంలో.. పోలీసుల అత్యుత్సాహం కారణంగా, ఆయన బోనెక్కాల్సి వచ్చింది. అయితే తన కోర్టు హాజరుకు కారణమైన ఆ ఎస్‌ఐ,ఏఎస్‌ఐలపై డీజీపీ వేటు వేశారు.
నిజానికి సవాంగ్, ఇప్పుడు రాజేంద్రనాధ్‌రెడ్డికి ఈ కేసులతో నేరుగా ఏమాత్రం సంబంధం లేదు. జిల్లాల్లో పోలీసులు ఎస్పీల నియంత్రణలో పనిచేస్తారు. వారు చేసే పనులకు ఎస్పీలే బాధ్యులు. కింద స్థాయి అధికారులను ఎస్పీ-డీఐజీలే నియంత్రించాలి. కానీ, ఇలాంటి కేసులు కోర్టుకు వచ్చినప్పుడు డీజీపీనే బాధ్యులను చేస్తుంటారు. అంటే జిల్లాల్లో కింది స్థాయి అధికారులపై, ఎస్పీ లకు నియంత్రణ లేనట్లు తాజా కేసుతో స్పష్టమవుతోంది.
ఆ ప్రకారంగా.. జిల్లా స్థాయిలో ఎస్పీ- డీఐజీలు డీజీపీ నియంత్రణలో ఉండి తీరాలి. కానీ ఉండటం లేదన్నది డీజీపీ హైకోర్టు హాజరీతో అర్ధమవుతోంది. ఒకప్పుడు జిల్లా ఎస్పీ, డీఐజీ, డీఎస్పీ పోస్టింగులలో డీజీపీల పాత్ర ఎక్కువగా ఉండేది. ఇప్పుడు డీజీపీలకు తెలియకుండానే పోస్టింగులిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సీఐ, డీఎస్పీల పోస్టింగులు డీజీపీ-రేంజి ఐజీలు కాకుండా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే ఇస్తున్న సంప్రదాయం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చిన వారికే, కోరుకున్న చోట పోస్టింగులు దక్కుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఎమ్మారో, ఆర్డీఒ పోస్టింగులలోనూ ఇదే సంస్కృతి కొనసాగుతోంది.
ఫలితంగా ఎస్‌ఐ నుంచి ఆర్డీఓ వరకూ.. అధికార పార్టీ నేతల మాట తప్ప, తమ పై అధికారుల మాట వినడం మానేశారు. దానితో అటు డీజీపీ-ఇటు సీఎస్‌లు కోర్టు ముందు దోషులుగా నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే ధిక్కార పరిణామాలకు దోహదం చేస్తోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సవాంగ్ డీజీపీగా ఉన్నపుడు, ఇప్పుడు రాజేంద్రనాధ్ హయాంలో జరిగిన ఘటనలు కూడా, అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల ప్రకారం స్థానిక అధికారులు తీసుకున్న నిర్ణయాలే కావడం విశేషం.
ఇటీవలి కాలంలో సీఐడీలో పనిచేసే పోలీసుల వ్యవహారశైలిని, జడ్జిలు కూడా తప్పుపడుతున్నారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండానే, ఇళ్లలోకి జొరబడి అరెస్టులు చేస్తున్న తీరు విమర్శలపాలవుతోంది. ఇటీవల సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు విషయంలో కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గతంలో గుంటూరులో ఒక వృద్ధురాలి విషయంలోనూ సీఐడీ ఇలాంటి అత్యుత్సాహమే ప్రదర్శించింది. చివరకు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టులోనూ ఓవరాక్షన్ చేసిన పోలీసుల తీరును కోర్టు ఆక్షేపించింది. ఇలాంటి చర్యలతో సంబంధం లేని డీజీపీలు, అకారణంగా కోర్టు బోనె క్కుతున్న సంప్రదాయం ఏపీలో కొనసాగుతోంది.
ఇక తాజాగా డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి వేటు వేసిన ఇద్దరు అధికారులు బలిపశువులుగా మారారన్న అభిప్రాయం కిందిస్థాయి పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. అసలు వారికి ఆ మేరకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారులను వదిలేసి, ఆ ఆదేశాలు పాటించిన అధికారులకు శిక్ష వేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తన కోర్టు హాజరుకు కారణమైన వారిని.. నిబంధనలు పాటించలేదని సస్పెండ్ చేసిన డీజీపీ.. మరి అలాంటి నిబంధనలు ప్రతిరోజూ ఉల్లంఘిస్తూ, కోర్టుల ఆగ్రహానికి గురవుతున్న సీఐడీ పోలీసులు- వారికి ఆదేశాలిస్తున్న ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి.