రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ
అమరావతి : నాడు టీడీపీ అధికారంలో ఉండగా రాజధాని అమరావతిపై గ్రాఫిక్స్ సృష్టించిన చంద్రబాబు నేడు వైయస్సార్‌సీపీ నాయకులపై గ్రాఫిక్స్ సృష్టిస్తూ ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆయన జీవితమంతా గ్రాఫిక్సేనని ధ్వజమెత్తారు.
ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియో రూపొందించింది టీడీపీనేనని ఇప్పుడు తేటతెల్లమైందని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు దేశంలోనే ఒక చిరునామా అని తెలిపారు. నాడు ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దింపడం కోసం లక్ష్మీపార్వతిని సాకుగా చూపి కుట్ర చేశారన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసి, ఎదగాలనుకోవడం చంద్రబాబు నైజం అని ధ్వజమెత్తారు. ‘ఎంపీ మాధవ్‌పై టీడీపీ వారే ఒక ఫేక్ వీడియో రూపొందించారు. వారే విదేశాలకు పంపి అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసి, వారే ట్రోల్ చేశారు’ అని మండిపడ్డారు. ఇందుకు కారకులైన టీడీపీ నేతలందరిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాపు ఉద్యమంలో ముద్రగడ కుటుంబాన్ని హింసిస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు.