ఏపీ జనం బాబు వైపే

– ‘సూర్య’ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోల్ సర్వే ఫలితం
– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సర్వే ఫలితాలకు సారూప్యం
– సీఎంగా చంద్రబాబు నాయుడుకే జైకొట్టిన నెటిజన్లు
– చంద్రబాబుకు 5417, జగన్‌కు 1266, పవన్‌కు 247 ఓట్లు
– ఆన్‌లైన్ సర్వేలో ఆటోమేటిక్ ఫలితం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారన్న’ ప్రశ్నతో.. ‘సూర్య వెబ్‌సైట్’ ఆన్‌లైన్ పోల్ సర్వే నిర్వహించింది. మిగిలిన అంశాలను పక్కనపెట్టి.. కేవలం ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్న ఒకే ప్రశ్నకు పరిమితమయింది. ఈ పోల్‌లో మొత్తం 6930 మంది పాల్గొనగా, అందులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటూ 5417 మంది ఓటు చేయగా, వైసీపీ అధినేత-సీఎం జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 1266 మంది, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలని 247 మంది ఓటు చేశారు.poll1

ఆ ప్రకారంగా సోమవారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ చంద్రబాబు నాయుడుకు 78.17 శాతం, జగన్మోహన్‌రెడ్డికి 18.27 శాతం, పవన్‌కల్యాణ్‌కు 3.56 శాతం ఓట్లు పోలయినట్లు స్పష్టమయింది. ఇక సూర్య ఆన్‌లైన్ పోల్ సర్వే ఫలితాన్ని, అప్పటికప్పుడే చూపించే విధానంలోనే పోల్ నిర్వహించింది. ఎవరికి ఓటు వేస్తే వారి సంఖ్య పెరుగుతూ కనిపించే విధానంలోనే.. ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది కాబట్టి, ఇందులో పక్షపాతానికి తావు లేదు.

అయితే ఒకదశలో అంటే వెయ్యి ఓట్ల సంఖ్య వచ్చే వరకూ చంద్రబాబు కంటే జగన్‌కే వంద- నూట యాభై ఓట్ల తేడా కనిపించింది. తొలిరోజు రాత్రి వరకూ జగన్ అధిక్యంలో ఉండగా, తర్వాత పరిస్థితి చంద్రబాబుకు అనుకూలంగా మారి.. అనూహ్యంగా.. ఏకపక్షంగా చంద్రబాబు విజయయాత్ర సాగింది.

కాగా.. ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యూస్ ఏజెన్సీతో నిర్వహించిన సర్వేలో కూడా, దాదాపు ఇలాంటి ఏకపక్ష ఫలితమే ప్రతిబింబించడం విశేషం. రఘురామరాజు చేయించిన సర్వేలో, టీడీపీకి 93 సీట్లు ఖాయంగా వస్తాయన్న ఫలితం వెలువడగా.. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో 50 శాతం టీడీపీకి పోలయినా టీడీపీకి 125 సీట్లు వస్తాయని తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సూర్య వెబ్‌సైట్’లో కూడా దాదాపు అలాంటి ఏకపక్ష ఫలితమే వెలువడటం ఆశ్చర్యం.

ఆన్‌లైన్‌లో ఓటు వేసిన వారంతా.. రేపటి ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వరకూ వచ్చి ఓటు వేయవచ్చు. వేయకపోనూవచ్చు. కానీ ప్రస్తుత ఆన్‌లైన్ సర్వేలో వెలువడిన ఫలితాలు చూస్తే మాత్రం.. ఆంధ్రా ప్రజలు చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారన్న విషయం స్పష్టమవుతోంది. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనించి.. తీర్పు ఇచ్చే తటస్థ, మధ్యతరగతి, విద్యావంతుల వర్గమే.. ఆన్‌లైన్ పోల్ సర్వేలో చురుకుగా పాల్గొన్నట్లు కనిపించింది. ఏదేమైనా ప్రజల నాడి తెలుసుకునేందుకు ‘సూర్య’ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోల్ సర్వేలో పాల్గొన్న నెటిజన్లకు అభినందనలు.

Leave a Reply