సింగరేణి, కోల్ ఇండియా సరసన ఎపిఎండిసి

– బొగ్గు ఉత్పత్తిలో ఎపిఎండిసి కీలక ముందడుగు
– సుల్యారీ బొగ్గు గని నుంచి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
– జాతీయ స్థాయిలో వాణిజ్య బొగ్గు ఉత్పత్తి సాధించిన ఘనత
– ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాల్లో తొలి విజయం
-2007 లోనే సుల్యారీ బొగ్గుగని కేటాయింపు
– 2019 వరకు బొగ్గు ఉత్పత్తిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం
– సుల్యారీ కోల్ మైన్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైయస్ జగన్
– అటు కేంద్రంతోనూ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వంతోనూ నిరంతరం సంప్రదింపులు
– బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ప్రత్యేక దృష్టి
– సీఎం చొరవ వల్లే సుల్యారీ బొగ్గుగనిలో ఉత్పత్తి సాధ్యమైంది: మంత్రి పెద్దిరెడ్డి
– ఎపిఎండిసికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు
– సీఎం శ్రీ వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి
– 2021లో ప్రైవేటు సంస్థలతో పోటీపడి బ్రహ్మదియా కోల్ బ్లాక్ దక్కించుకున్న ఎపిఎండిసి
– సీఎం వైయస్ జగన్ ప్రోత్సాహంతో విస్తరిస్తున్న ఎపిఎండిసి
– ఎపిఎండిసిని అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి:ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎండిసి) మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్ ఇండియాల సరసన ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న మూడో ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపును సాధించింది.
మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్న ఎపిఎండిసి మార్చి 10వ తేదీ నుంచి ఈ గనిలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. 2007లోనే కేంద్రప్రభుత్వం ఈ బొగ్గుగని ఎపిఎండిసికి కేటాయించినా, వివిధ కారణాల వల్ల మైనింగ్ కార్యక్రమాలు మాత్రం ప్రారంభం కాలేదు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సుల్యారీ కోల్ మైన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వపరంగా ఎపిఎండిసికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంతో గత ఏడాది ఆగస్టు నెలలో సుల్యారీలో బొగ్గు వెలికితీత పనులకు శ్రీకారం చుట్టారు. ఓవర్ బర్డెన్ పనులు పూర్తి చేసుకుని తాజాగా వాణిజ్య సరళి బొగ్గు ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఎపిఎండిసి తన విస్తరణలో కీలక ముందుడుగా వేసింది.

సీఎం వైయస్ జగన్ చొరవతోనే ఈ విజయం:మంత్రి పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజన్ వల్లే ఎపిఎండిసి ఇతర రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా తన మైనింగ్ కార్యక్రమాలను నిర్వహించే సామర్థ్యంను సాధించిందని రాష్ట్ర భూగర్భగనులు, పిఆర్&ఆర్డీ, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2007లోనే ఎపిఎండిసి మధ్యప్రదేశ్ లో సుల్యారీ బొగ్గుగనిని దక్కించుకున్నప్పటికీ 2019 వరకు ఒక్క అడుగు కూడా బొగ్గు ఉత్పత్తి విషయంలో ముందుకు పడలేదని అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ ప్రాజెక్ట్ ను ఒక సవాల్ గా తీసుకుని అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నేడు సుల్యారీలో వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడానికి సీఎం చేసిన కృషి కారణమని, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలోనే మైనింగ్ కార్యక్రమాలకు పరిమితమైన ఎపిఎండిసి జాతీయ స్థాయిలో పెద్దపెద్ద సంస్థలతో పోటీగా బొగ్గు ఉత్పత్తి రంగంలో నిలబడటం, నిర్ధేశిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, ఇతర అధికారులు, కార్మికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు.

ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల నైపూణ్యాలను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో తమ కార్యక్రమాలను విస్తరింప చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహాన్ని పూర్తిస్థాయిలో అందిస్తోందని అన్నారు.

జార్ఘండ్ లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్ ను సైతం 2021లో ఎపిఎండిసి పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి బిడ్డింగ్‌ లో దక్కించుకుందని అన్నారు. అత్యంత నాణ్యమైన కోకింగ్ కోల్ ను ఈ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేసేందుకు ఎపిఎండిసి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలిపారు.

ఉక్కు కర్మాగారాల్లో వినియోగించే ఈ కోకింగ్ కోల్ ను ఎపిఎండిసి ద్వారా ఉత్పత్తి చేయడం వల్ల మన రాష్ట్ర అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి కోకింగ్ కోల్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. రాష్ట్రంలో బొగ్గుగనులతో పాటు ఇరత మేజర్ మినరల్స్ విషయంలోనూ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వరంగ సంస్థ ఎపిఎండిసి ద్వారా మైనింగ్ కార్యక్రమాలను నిర్వహింపచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.

బొగ్గు ఉత్పత్తి ద్వారా ఏటా రూ.1200 కోట్లు ఆదాయం:విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి విసి&ఎండి
మధ్యప్రదేశ్ లోని సుల్యారీ బొగ్గు గని నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఎపిఎండిసి ఉత్పత్తి చేస్తుందని సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి తెలిపారు. రూ.2వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఎపిఎండిసి ఈ బొగ్గుగనిలో ఉత్పత్తి ప్రారంభించిందని, సాలీనా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం ఈ బొగ్గు గని ద్వారా లభిస్తుందని అన్నారు.

మొత్తం 110 మిలియన్ టన్నులు బొగ్గు నిల్వలు ఈ గని పరిధిలో ఉన్నాయని, కనీసం 22 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పతి జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం నిర్ణయించిన 5 మిలియన్ టన్నులను మించి అదనంగా మరో రెండు మిలియన టన్నుల బొగ్గును కూడా ప్రతిఏటా వెలికితీసే అవకాశం ఉందని, ఈ మేరకు సంస్థ సామర్థ్యంను కూడా పెంచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ నెల 10 తేదీ నుంచి వాణిజ్యసరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించామని, ఈ బొగ్గులో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లకు కేటాయిస్తామని, మిగిలినది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విక్రయిస్తామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ లకు బొగ్గు విక్రయాలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన ఎం-జంక్షన్ ద్వారా ఈ-ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి సాధనలో పనిచేసిన సంస్థ ఉద్యోగులు, కార్మికులను అభినందించారు.

Leave a Reply