Suryaa.co.in

Features

అమరజీవికి క్షమాపణలతో…

తెలుగు రాష్ట్రం
నీ బహుమానం…
మిగిలింది అవమానం…!
ఒకటా…రెండా…
యాభై ఆరు రోజుల దీక్ష…
ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఉండి పొద్దుపోయాక
తినేసే ఉపవాసం కాదది…
పుణ్యం కోసం…
లక్ష్మీకటాక్షం కోసం
చేసిన వ్రతం అసలే కాదు…
ఒక గొప్ప లక్ష్యం…
ఒక మహాసంగ్రామం…
సిద్ధాంతం కోసం
అలుపెరుగని రాద్ధాంతం…
ఆయన ప్రాణత్యాగం…
కొందరికి వైభోగం…
ఆపై కొందరి బుద్ధి…
ఓ కొత్త ఆలోచన…
హస్తినలో సమాలోచన…
దూరాలోచనో…దురాలోచనో…
తిరుమలగిరి…యాదగిరి…
సింహాచలం…భద్రాచలం….
అటూ ఇటుగా
తెలుగు రాష్ట్రం
రెండు ముక్కలు…
అప్పటివరకు అన్నదమ్ములు
తెలుగు ప్రజలు…
ఇప్పుడు దాయాదులు…
గుచ్చే సూదులు…
మీమాంసం పుట్టించి
పచ్చి మాంసం తిన్న రాబందులు…
గద్దె కోసం కాచుకు
కూర్చున్న గద్దలు…
పిడిగుద్దేసారు…
విడగొట్టేసారు…!
ఓయి శ్రీరాములూ…
పొట్టివాడివైనా
గట్టివాడివయ్యా…
పంతం నీ సొంతం…
దీక్ష నీ రక్ష…
నిజాయితీ నీ ఆనవాయితీ…
ఉపవాసం నీ సహవాసం…
నిరాహారం…నిరవధికం కాదది…
ఆమరణం…
అలా అయింది వీరమరణం…
అపుడు పుట్టిన ఆంధ్రరాష్ట్రం
నీ శాశ్వత ఆభరణం…!
రాజకీయమో…నాటకీయమో…
దొంగ నాయకీయమో…
వైయస్ ఉన్నంత కాలం
కొందరికి గడ్డుకాలం…
ఆయన పోయాడు…
ఒకాయన చొక్కా విప్పాడు…
బక్క పలచని దేహం చూసి
సోనియాకి వచ్చింది సందేహం
ఆయన మరణిస్తే ఆంధ్ర అగ్నిగుండంగా
మారుతుందేమోనని…
అది దీక్ష సెటప్పు కాదని
ఆదే ఆ బక్క పలచని మనిషి నిత్య గెటప్పని కాంగ్రెస్ అధిష్ఠాన దేవతకు ఏం ఎరుక
అదే అయింది
తెరాసకు ఏరువాక…
ఇటలీ రాణి పుట్టినరోజున
తెలంగాణకు పడింది బోణీ…
నీ దీక్ష ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తే
ఇంకొకరి దీక్ష బాధించింది…
నువ్వు కూడగట్టావు…
ఆయన విడగొట్టాడు…
సువిశాల ఆంధ్రావని
ఆసాంతం కూలి
వగచింది కుమిలి కుమిలి…!
ఓ మహాత్మా మన్నించు…
సమైక్యం కోసం పోరాడాం…
చివరకు ఓడాం…
పోరు సాగిన తీరు అరుదే…
చివరాఖరికి మిగిలింది
ఆరంభశూరులమనే బిరుదే…
నీ పోరు..నీ ఉసురు…
మా ఉసూరు…
కన్నీటి సెలయేరు…
కలివిడి…మము వీడి…
అతి పెద్ద ఆందోళన
ఎక్కింది రాజకీయ పాడి…!
పొట్టి శ్రీరాములు వర్ధంతి
అమరజీవికి క్షమాపణలతో….

LEAVE A RESPONSE