విజయవాడ: మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్ల సంక్షేమం, పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాదాల కల్పనలో పూర్తిగా విఫలమైందని పైగా వీరిని అసలు మహిళలుగా కూడా చూడటం లేదని విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు హెహరున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ రవాణా బాధిత మహిళలు మరియు సెక్స్ వర్కర్ల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’ మరియు హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక రాజీవ్ నగర్, జి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మెహరున్నీసా మాట్లాడుతూ రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు 1669 మంది మహిళలు ఇండియన్ పీనల్‌కోడ్ సెక్షన్ల క్రింద, 550 మంది అక్రమ రవాణా నిరోధక చట్టం (ఐ.టి.పి.ఎ) క్రింద కాపాడటం జరిగిందని కాని వీరిలో కనీసం 10 శాతం బాధిత మహిళలకు వివిధ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ జీవోలు ప్రకారం కూడా అందించవల్సిన నష్ట పరిహారం, పునరావాస కార్యక్రమాలు, ప్రత్నామ్నాయ జీవనోపాదులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
విముక్తి ఉపాధ్యక్షురాలు రజని మాట్లాడుతూ సెక్స్ వర్లర్లు, అక్రమ రవాణా బాధిత మహిళలపై సమాజంలో ఉన్న కళంకం, వివక్షత వల్ల ఎన్నో ఇబ్బందులుకు గురి అవుతున్నారని వీరిని బాధితులుగా చూడనంత కాలం వీరిని నేరస్థులుగానే సమాజం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విముక్తి కార్యదర్శి పుష్ప మాట్లాడుతూ నేనే కాదు నాలాంటి చాలామంది మా వార్డులో మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల నుంచి మినహాయించబడ్డారు. అలాగే స్థానిక సామాజిక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించడం లేదు…. పైగా నా పిల్లలు మిగిలిన వారి పిల్లలుతో
ఆడుకోనియ్యకుండా అడ్డుకొంటున్నారు. మాకు పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాదులు కల్పించినట్లయితే మేము ఈ వివక్ష నుంచి బయటపడగలమన్నారు.ఈ సమావేశంలో ఈ క్రింది డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ విముక్తి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
డిమాండ్స్:
1. సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా బాధితులకు తక్షణమే ప్రత్యామ్నాయ జీవనోపాదులు కల్పనకై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి.
2. సెక్స్ వర్కర్ల, అక్రమ రవాణా బాధితులుకు నష్టపరిహారం, సంక్షేమం, అభివృద్ధి, రక్షణకై రూపొందించబడిన వివిధ పథకాలు, ప్రభుత్వ విధానాలు, వివిధ చట్టాలు అమలు కోసం సింగిల్ విండో విధానంలో వార్డు/ గ్రామ సచివాలయాలు ద్వారా వారికి అందేలా చర్యలు చేపట్టాలి.
3. అక్రమ రవాణా బాధితులను షెల్టర్ హోమ్‌లలో ఎళ్ళ పాటు ఖైదీలుగా నిర్బందించకుండా వారికి ‘‘కమ్యూనిటి ఆదారిత పునరావాస కార్యక్రమాలు’’ విధానం ద్వారా వారికి సమాజంలో పునరేకీకరణ చేయాలి.
4. కోవిడ్ నేపధ్యంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ సెక్స్ వర్కర్లను ‘‘అనధికార కార్మికులు’’గా గుర్తించి వారికి అందరి మహిళల వలే మద్దతు, ఉపశమన సేవలు, వివిధ ప్రభుత్వ పథకాలు ద్వారా వీరికి లబ్ది చేకూర్చాలని ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని…..వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలుకు చర్యలు తీసుకోవాలి.
5. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, పర్యవేక్షణ అమలుకు నిర్దేశించిన కమిటీలలో సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా బాధిత మహిళలకు బాగస్వామ్యం కల్పించాలి.
ఈ కార్యక్రమంలో విముక్తి కోశాధికారి అపూర్వ, నాగలక్ష్మి, మౌనిక , హెల్ప్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ వి.భాస్కర్, నితిన్ లతోపాటు 40 మంది విముక్తి సభ్యులు పాల్గొన్నారు.