-
అదను చూసి అరెస్టులు
-
కార్యకర్తల మనోభావాలు గుర్తిస్తున్న నాయకత్వం
-
వంశీ, పోసాని అరె స్టు-జైలుపై తమ్ముళ్ల సంతృప్తి
-
తాజాగా సునీల్‌పై సస్పెన్షన్‌తో తమ్ముళ్ల ఖుషీ
-
క్యాడర్, సోషల్‌మీడియా సైన్యం మనోభావాలే ముఖ్యమంటున్న సీనియర్లు
-
సంయమనం పాటిస్తే మరిన్ని అరెస్టులుంటాయని భరోసా
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్ కల్యాణ్‌తోపాటు అగ్రనేతల కుటుంబాలను వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన ‘వైకామ’ నేతలను ఎనిమిదినెలలయినా అరెస్టు చేయడం లే దెందుకంటూ.. నిప్పులు కురిపిస్తున్న టీడీపీ సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహజ్వాల ఇప్పుడు క్రమంగా చల్లబడుతోంది.
వారితో అంటకాగడం వల్లనో.. తెరచాటు బంధాల కారణంగానో ఎవరిపైనా యాక్షన్ తీసుకోవడం లేదంటూ, నానా యాగీ చేస్తున్న పసుపుదళాల ప్రశ్నాస్త్రాలకు సమాధానాలు.. లేటయినా, లేటెస్టుగా తెలుస్తున్నాయి. తొలి వికెట్ నందిగం సురేష్దయితే వల్లభనేని వంశీది రెండో వికెట్. ముచ్చటగా మూడవ వికెట్ పోసాని కృష్ణ మురళీదయితే, ఇప్పుడు నాలుగో వికెట్ ఐపిఎస్ సునీల్‌కుమార్. అందుకే పసుపు దళాలు ఆనందతాండవం చేస్తున్నాయి. ఫలితం.. వారి ఆవేశంతో ఎగెరిగిరి పడుతున్న వారి ఆగ్రహం ఇప్పుడు శాంతిస్తోంది.
ఇక అయిదో వికెట్ అయిన పెద్దిరెడ్డిని పడగొడితే.. ఏ మూలనో ఉన్న అనుమానం కాస్తా కుప్పకూలుతుంది. తాజా పరిణామాలు, వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆందోళన పరిశీలిస్తే.. బాబు-పవన్-లోకేష్-అనితను బూతులు తిట్టిన మహిళా పేటీఎం దళ కమాండర్ శ్రీరెడ్డి కూడా.. పోలీసుస్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక చాలామంది కోరుకుంటున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, మేఘా ఇంజనీరింగ్ వికెట్లు ఎప్పటికీ పడకపోవచ్చు. వారిద్దరూ నాటౌట్ బ్యాట్స్‌మెన్‌గా మరో నాలుగేళ్లూ క్రీజులోనే పాతుకుపోవచ్చు. ఎందుకంటే వారికి క్రీజులో ఎలా నిలదొక్కుకోవాలో తెలిసిన మ్యాచ్ ఫిక్సింగు ప్లేయర్లు కాబట్టి!
ఈలోగా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ వికెట్లు నేలరాలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా ఫర్వాలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్లు.. పసుపు దళాలకు అదే ఊరట. మిగిలిన ఆ బ్యాట్స్మెన్ల వికెట్ల కోసమే పసుపు దళాలు కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ కెప్టెన్లు మాత్రం సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వేసిన గుగ్లీని మరోసారి విసిరే పనిలో ఉంది. దానితో ఎవరి వికెట్ పడుతుందో తెలియదు. అదే తెలివైన కెప్టెన్ వ్యూహమన్నది గ్యాలరీలోని ఆడియన్స్ కామెంట్.
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా తమ పార్టీ అధినేత కుటుంబం, అగ్రనేతలపై నోరుపారేసుకుని, కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతలపై చర్యల కొరడా ఝళిపించటం లేదంటూ.. అసంతృప్తితో ర గిలిపోతున్న పసుపు సైనికుల ఆగ్రహజ్వాల, క్రమంగా చల్లబడుతుండటం నాయకత్వానికి ఊరటనిస్తోంది.
నిజానికి జగన్ చేసిన పనే తాను చేస్తే, ఇద్దరికీ తేడా లేదని జనం భావించే ప్రమాదం ఉందన్నది చంద్రబాబు భయం. ప్రజలు ప్రతిదీ నిశితంగా గమనిస్తుంటారన్నది ఆయన అనుభవం. అసలు పార్టీ కార్య ర్తలు, సాధారణ ప్రజలను వేధించారన్న కసితోనే జగన్‌ను ఇంటికి పంపించిన జనం.. తాము కూడా అదే పని చేస్తే, తర్వాత ఎన్నికల్లో తమకూ అంతకు భిన్నమైన తీర్పు ఎందుకు ఇస్తారన్న ముందుచూపుతో, చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఆ మధ్య సమయంలో.. ఆధారాలున్న వైసీపీ నేతలను సరైన సమయంలో అరెస్టు చేస్తూ, జైళ్లకు పంపిస్తున్న వైనం పసుపు దళాలకు ఇప్పుడు సంతృప్తినిస్తోంది.
తొలుత అమరావతి రైతులను వేధించి, రాజధాని పరిసర ప్రాంతాలను కేంద్ర ంగా చేసుకుని టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయిన.. మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్టు చేసి, జైలకు పంపించారు. దానితో పసుపు సైనికులు కొంత శాంతించినప్పటికీ, అసలైన వారిని విడిచిపెట్టడంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ సమయంలో గన్నవరంలో పార్టీ కేసుకు సంబంధించి ఎస్సీలపై దాడి, కిడ్నాప్ కేసులో ముద్దాయి అయిన వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి ఎత్తుకువచ్చి అరెస్టు చేసి, జైలుకు పంపించడంతో టీడీపీ కార్యకర్తలు ఆనందతాండవం చేశారు. అసలు టీడీపీ కార్యకర్తలు తొలుత అరెస్టు చేయాలని కోరుకున్నది వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, సజ్జల, భార్గవరెడ్డిలను! ఆ తర్వాతనే పోసాని, శ్రీరెడ్డి, గుడివాడ అమర్నాధ్, పేర్ని నాని, ద్వారంపూడి ఎవరైనా!! ఆ జాబితాలో తొలి వ్యక్తి అయిన వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో, టీడీపీ కార్యకర్తల ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు.
ఇక టీడీపీ, జనసేనపై విమర్శలు కురిపించిన మాజీ మంత్రి పేర్ని నానిపై గోడౌన్ కేసు పెట్టినప్పటికీ, ఆ కేసులో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో ఆయన కుటుంబం బెయిల్‌పై బయటపడింది. నిజానికి ఆయనకు పోలీసులే సహకరిస్తున్నారన్నది బందరు తమ్ముళ్ల అరోపణ.
వంశీ తర్వాత టీడీపీని, బాబు-పవన్ కుటుంబాన్ని సంస్కారహీనంగా తిట్టిపోసిన పోసాని కృష్ణ మురళీని కూడా అచ్చు వల్లభనేని వంశీ మాదిరిగానే.. అదే అపార్ట్మెంట్ నుంచి చెరబట్టి, జైల్లో వేయించడంతో, టీడీపీ-జనసేన శ్రే ణుల ఖుషీ అంతా ఇంతా కాదు. అసలు ఎవరూ ఊహించని పరిణామం అది. దీనితో పవన్ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, చిరంజీవి కుటుంబాలను దారుణంగా, అసభ్యంగా తిట్టిన పోసాని ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తూ, కేసుల విచారణకు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. అరెస్టయిన పోసానిపై ఉన్న కేసులు, పిటి వారెంట్లు పరిశీలిస్తే.. ఆయన ఎన్నేళ్లు కోరు-్ట జైళ్ల చుట్టూ తిరుగుతారో తెలియని గందరగోళ పరిస్థితి. తాను కూటమి నేతలను తిట్టి తప్పుచేశానని, ఇకపై ఎవరినీ తిట్టనని, అసలు రాజకీయాల్లోనే ఉండనంటూ చెప్పిన పోసానిని విధి విడిచిపెట్టలేదు. పవన్-లోకేష్-అనితను బూతులు తిట్టిన శ్రీరెడ్డి కూడా తనను క్షమించమని వేడుకుంది. అయినా ఆమెనూ విధి విస్మరించే అవకాశాలు కనిపించడంలేదు.
ఇక జగన్ జమానాలో సీఐడీని అడ్డగోలుగా వాడుకుని.. సీఐడీ పోలీసులు ఇలా కూడా చేస్తారా అని జనాలకు తెలియచేసిన నాటి సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై బాబు సర్కారు.. హటాత్తుగా వేసిన సస్పెన్షన్ వేటు వేయడం, కూటమి కార్యకర్తలకు కొండంత సంబరాన్ని మిగిల్చింది. ఆయన అప్పట్లో సర్వీసు నిబంధ నలు పక్కనపెట్టి, ఇష్టారీతిన చేసిన విదేశీ పర్యటనలు ఇప్పుడు సునీల్‌కు శాపంగా పరిణమించాయి.
నాటి ఎంపి, నేటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజను.. ఆయన పుట్టినరోజున హైదరాబాద్ నుంచి ఎత్తుకువచ్చిన సీఐడీ టీమ్ బాస్ సునీల్‌పై, రఘురామకృష్ణంరాజు అలుపెరుగని పోరాటం చేశారు. అప్పట్లో ఆయనపై ప్రివిలే జ్ కమిటీకి, సుప్రీంకోర్టు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరులో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సునీల్‌పై కేసు నమోదయింది.
వ ల్లభనేని వంశీ అరెస్టు నుంచి ఐపిఎస్ సునీల్ సస్పెన్షన్ వరకూ జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే.. వైసీపీ నేతలపై చర్యలకు కూటమి సర్కారు, సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో అరెస్టులు, కేసులపై హైకోర్టు చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో.. వారిని ఆచితూచి అరెస్టు చే యకపోతే, అవి కోర్టులో నిలబడవన్న వ్యూహంతోనే అడుగులు వే స్తున్నట్లు కనిపిస్తోంది.
తాజా పరిణామాలు.. నాయకత్వంపై అసంతృప్తితో విరుచుకుపడుతూ, సోషల్‌మీడియాలో బహిరంగంగానే విరుచుకుపడతున్న పార్టీ సైనికులను సంతృప్తిపరుస్తున్నట్లు వారి పోస్టింగులు స్పష్టం చేస్తున్నాయి. సునీల్‌పై సస్పెన్షన్ వేటు వేయకపోవడానికి నిన్నటి వరకూ పార్టీ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరిగాయి. ఆయనపై చర్యలు తీసుకుంటే మాల వర్గం పార్టీకి దూరమవుతుందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదన్న చర్చ జరిగింది.
అదే సమయంలో ఆయన పార్టీలోని కొందరితో మాట్లాడుకున్నారన్న చర్చ కూడా జరగపోలేదు. వాటిని ప్రభుత్వం పటాపంచలు చేస్తూ, అదును చూసి సరైన ఆధారాలతో సునీల్‌పై సస్పెన్షన్ వేటు వేయడం, పార్టీ శ్రేణులను ఆనందానికి గురిచేసింది. ఇలాంటి చర్యలనే తాము కోరుకుంటున్నామని, పార్టీ కార్యకర్తలను వేధించిన సునీల్‌పై చర్య తీసుకున్నందుకు పార్టీ సైనికులు, బాబును అభినందిస్తూ పోస్టింగులు పెడుతున్నారు.
‘‘దీన్నిబట్టి సమయం-సందర్భం-ఆధారాల కోసమే పార్టీ నాయకత్వం వేచి చూస్తుందన్న విషయాన్ని కార్యకర్తలు అర్ధం చేసుకోవాల’’ని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సమయం-సందర్భం-ఆధారాలు లేకుండా వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడం కుదరదు. ఆ ప్రక్రియలోనే ఆలస్యం అవుతోంది తప్ప పార్టీని, పార్టీ అధినేత కుటుంబాన్ని తిట్టిన వారిని నాయకత్వం వదిలేస్తుందని ఎందుకు అనుకుంటారు? కాకపోతే జగన్ ప్రభుత్వం మాదిరిగా వేధింపులకు దిగకుండా, లీగల్‌గానే వారిపై చర్యలు తీసుకుంటే ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. దాన్ని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. ఇప్పుడు కాస్త తగ్గారు సంతోషం. ఈ విషయంలో ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. కార్యకర్తలే సంయమనం పాటించాల’’ని ఓ మంత్రి విశ్లేషించారు.
‘‘వల్లభనేని వంశీ, పోసాని విషయంలో అన్ని ఆధారాలున్నందుకే అరెస్టు చేసి జైలుకు పంపించాం. సునీల్ విషయంలో కూడా అన్ని ఆధారాలు లభించాయి కాబట్టే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆధారాలున్న ఎవరినీ విడిచిపెట్టేదిలేదు. కాకపోతే మీ తొందర-ఒత్తిడితో ప్రభుత్వం సతమతమవుతున్న విషయాన్ని గ్రహించాల’’ని మరో సీనియర్ ఎమ్మెల్యే కార్యకర్తలను కోరారు.
కాగా జగన్ జమానాలో కాంట్రాక్టు పనులతో వేలకోట్లకు పడగలెత్తిన మేఘా కంపెనీ, జగన్ కంపెనీగా పార్టీనే ఆరోపించిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై చర్యలు తీసుకోవడం బదులు… ఇంకా వారికే కాంట్రాక్టులు కట్టబెడుతున్న వైనం, పార్టీలో చురుకుగా పనిచేసే వర్గాలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు.
తాజాగా గ్రామీణ నీటిపారుదల శాఖ టెండర్లలో, ఉభయ గోదావరి జిల్లాకు చెందిన 2290 కోట్ల రూపాయల విలువైన పనులు, మేఘాకు దక్కించిన వైనం సోషల్‌మీడియాలో ప్రముఖంగా రావడంతో, ఆ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా చెప్పాలంటే మేఘా,షిర్డిసాయి కంపెనీలను ప్రోత్సహించడాన్ని, దానిని పరిశ్రమల తరలింపు అంశంతో ముడిపెట్టడాన్ని సగటు కార్యకర్త ఏమాత్రం అంగీకరించడం లేదు.
ఆ నిర్ణయాలపైనే అసంతృప్తి జగన్ జమానాలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్, అదానీ కంపెనీలకు వేలకోట్ల రూపాయల లబ్థి చేకూర్చిన సీనియర్ ఐఏఎస్‌కు, కులం కోణంలో అత్యంత కీలక పదవి ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ తమ సోషల్‌మీడియా పోస్టులలో విమర్శిస్తూనే ఉండటం ప్రస్తావనార్హం. ఆయన పనితీరు, వ్యవహారశైలి స్పష్టంగా తె లిసినప్పటికీ సదరు అధికారికి అత్యున్నత పదవి ఇవ్వడాన్ని పసులు దళాల జీర్ణించుకోలేక, పోస్టింగులు పెట్టడం తెలిసిందే.
అసలు కులం కోణంలో ఎంపికలు జరపడమేమిటని, ఫలానా ఐపిఎస్ అధికారిని డీజీపీగా నియమిస్తేనో, ఫలానా కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమిస్తేనో, ఆ కులం వారంతా పార్టీకి ఓట్లు వేస్తారన్న ఆలోచనతో తీసుకుంటున్న నిర్ణయాలు.. కార్యకర్తల విమర్శలకు కారణమవుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కూడా.. శాంతికుమారిని సీఎస్‌గా నియమిస్తే ఆంధ్రా వారితోపాటు, తెలంగాణలో మున్నూరు కాపులు, కాపులు బీఆర్ఎస్కు ఓటేస్తారని భావించి, ఆమెను సీఎస్‌గా నియమించినప్పటికీ, పార్టీ ఓడిన విషయాన్ని ఉదహరిస్తున్నారు.
నిజానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు మేఘా, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలపై అనేక ఆరోపణలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి, విజిలెన్స్ విచారణ జరిపిస్తామని సోమిరెడ్డి, పట్టాభి, విజయ్‌కుమార్‌తోపాటు బీజేపీ నేత లంకా దినకర్ ప్రెస్మీట్లు పెట్టి మరీ హెచ్చరించారు. సోమిరెడ్డి అయితే, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై కోర్టులో కేసు కూడా వేశారు. అది ఇంకా విచారణ జరుగుతోంది.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ రెండు కంపెనీలపై చర్యల కొరడా ఝళిపించకపోగా, మళ్లీ కాంట్రాక్టులు వాటికే ఇవ్వడం, జగన్ జమానాలో చేసిన పనుల బిల్లులు ఇవ్వడాన్ని టీడీపీ సైనికులు ఏమాత్రం జీర్ణించుకోలే పోతున్నారు. ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో పనులు చేసిన వైసీపీ కాంట్రాక్టర్లకు, పెండింగ్ బిల్లులను పువ్వులో పెట్టి అప్పగించడాన్ని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, కొన్ని రోజుల వరకూ తూర్పారపట్టిన వైనం తెలిసిందే. అదే సమయంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు.. మేఘా అధినేత నిర్వహించిన కార్యక్రమానికి హాజరవడాన్నీ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక, పోస్టింగులు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక ఆచి తూచి అడుగులేయాల్సిందే
వంశీ అరెస్టు నుంచి సునీల్ సస్పెన్షన్ వరకూ జరిగిన
పరిణామాల పరిశీలిస్తే.. పార్టీ నాయకత్వం కార్యకర్తల మనోభావాలు, సోషల్‌మీడియా సైనికుల మనోభావాలను నిశితంగా అర్ధం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే అనేక నియామకాలపై సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చిన తర్వాతనే నాయకత్వం దిద్దుబాటుకు దిగాల్సి వచ్చింది.
నిజానికి ఈ చర్యలకు ముందు.. పార్టీ నాయకత్వం, తమ మనోభావాలు పట్టించుకోకుండా.. ‘ఎవరేమనుకున్నా పర్వాలేదు. వారు అనుకున్న మేరకే నిర్ణయాలు తీసుకుంటోంద’న్న భావన, కిందిస్థాయి కార్యకర్తల వరకూ ఉండేది. కాబట్టి ఈ అనుభవాలు గమనించి.. వివిధ నియామకాలు, కాంట్రాక్టుల అంశంలో కారకర్తల నుంచి అసంతృప్తి వ్యక్తం కాక ముందే.. వారి మనోభావాల మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నది సీనియర్ల సూచన.