– పోనాని కృష్ణమురళీకి భలే డిమాండ్ బాసూ
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకునపడి నీవు నలిగితివా?’’ అంటూ నారీ నారీ నడుమ మురారి సినిమాలో బాలకృష్ణ చుట్టూ తిరుగుతూ శోభన, నిరోషాలు పాడిన పాట గుర్తుందా?.. అచ్చం మన పోసాని కృష్ణ మురళీ చుట్టూ చేరిన పోలీసులు కూడా, అలాంటి సాంగేసుకుంటున్నారట. పోసాని మా వాడంటే మా వాడంటూ పోటీలు పడుతున్న వైచిత్రి ఇది.
సర్కారు నుంచి నెలకు మూడులక్షల జీతం తీసుకుని.. జనసేన దళపతి పవన్‌కల్యాణ్, చంద్రబాబు కుటుంబాలపై స్వేచ్ఛగా నోరుపారేసుకుని, ఇప్పుడు శ్రీకృష్ణజన్మస్ధానంలో ఐలవ్‌యూ రాజా అంటూ జైలర్లు, ఖైదీలతో మజాక్ చేస్తున్న పోసాని కృష్ణమురళీపై పోలీసులు మనసు పారేసుకుంటున్నారు. ఆయన మాకు కావాలంటే మాకు కావాలంటూ జైలర్లను డిమాండ్ చేస్తున్నారు. ఆయన మా వాడ ంటే మా వాడని, కాదు మా వాడేనంటూ వాదులాడుకుంటున్నారట.
అదేంటి? జైల్లో ఉన్న చేయి తిరిగిన రచయితకు అంత ్రే జ్? అందునా పోలీసులు మనసుపారేసుకోవడమేమిటనే కదా పురప్రజల డౌటనుమానం? ఎందుకంటే పోసానికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి?! ఇక జైల్లోకి వెళదామా?..
పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ వెళ్లి అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేస్తే, కోర్టు ఆయనకు కోర్టు 14 రోజల రిమాండ్ విధించింది. నిజానికి పోసాని నోటిదూలకు సంబంధించి, ఏపీలోని 17 పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. పోసాని అన్నమయ్య జిల్లా రాజంపేట జైలులో ఉన్న విషయం తెలుసుకున్న నర్సరావుపేట పోలీసులు, వాయువేగంతో అక్కడి జైలు వద్ద వాలిపోయారు. ఆయనపై తమ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఉంది కాబట్టి, పోసానిని అరెస్టు చేసి తీసుకువెళ్లాలని జైలర్‌తో వాదించారు.
కానీ ఈలోగా అల్లూరి జిల్లా, అన ంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలుకు వెళ్లి.. అలాగెలా కుదురుతుంది? మేమూ పిటి వారెంట్ తెచ్చాం. పోసానిపై మా దగ్గర కూడా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ఆయనను మాకే అప్పగించండి అని వాదులాటకు దిగారట. దానితో ధర్మసందేహం వచ్చిన జైలరు, పెద్దాఫీసర్లకు ఫోను చేసి.. మాకు ఈ పితలాటకమేమిటి ప్రభూ? ఏం చేయాలో సెలవివ్వమని అభ్యర్ధించారట. దానితో ‘‘ముందు నర్సరావుపేట పోలీసులే వచ్చారు కాబట్టి, పోసానిని వారికే అప్పగించడం ధర్మం. తల్లీబిడ్డా న్యాయం కూడా’’ అని పెదరాయుడు తీర్పిచ్చారు. దానితో పోసానిని కారెక్కించుకుని పోలీసులు నరసరావుపేటకు తీసుకువెళితే, కోర్టువారు ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
కానీ మరో 16 పోలీసుస్టేషన్లు పోసాని కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. పిటి వారెంట్లతో పోసానిని తమతో తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అంటే వారు పిటి వారెంట్లతో జైలు వద్దకు వెళ్లడ ం, జైలర్లు ఆయనకు పోలీసులకు అప్పగించడం, పోలీసులు ఆయనను రిమాండుకు పంపించడం జరగుతుందన్నమాట. ఇటీవలి కాలంలో ఇంత డిమాండ్ ఉన్న ఖైదీని ఎప్పుడూ చూడలేదన్నది ఖాకీల కామెంట్. అందుకే ‘‘నవ్వుతూ అనటం, ఏడుస్తూ అనుభవించడం ఎందుక’’ని పెద్దలు చెబుతుంటారు.
అన్నట్లు రాయడంలోనే కాదు. నటించడంలోనూ నిష్ణాతుడైన పోసాని.. జైల్లో కూడా తనకు కడుపు నొప్పి, కాలు నొప్పి, గుండెనొప్పి అంటూ గుండెపోటు గుమ్మడి లెవల్లో జీవించేశారట. దానితో ఆ ‘సహజ నటుడి’ ఆరోగ్యం పరీక్షించిన రాజంపేట డాక్టర్లు.. ‘రాజాకి ఎలాంటి మాయరోగం లేదు. నిక్షే పంగా తీసుకువెళ్లవచ్చ’ని చెప్పారట. చేసేదేమిలేక పోసాని కూడా లవ్‌యు రాజా అని నర్సరావుపేట పోలీసుల కారులో ఎక్కి కూర్చున్నారట.