– పీసీబీ పీఆర్వో జీతం 90 వేల రూపాయలట
– పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎంపిక
– వెబ్సైట్లో నోటిఫికేషన్ ఇచ్చిన తెలివి
– సీఎంఓలో పనిచేసే పీఆర్వోలకే 70 వేల జీతం
– సీఎంఓ పీఆర్వోలకు రోజంతా పని
– మంత్రుల పీఆర్వోలకు 39 వేల జీతం
– వారి వెంట పీఆర్వోలూ వెళ్లాల్సిందే
– అందులో ఇంకా ఇద్దరు మంత్రుల పీఆర్వోలకు జీతాలే రాని దయనీయం
– డిపార్టుమెంట్ పీఆర్వోల జీతం 50 వేలే
– రోజంతా కష్టపడే సీఎంఓ, సమాచార శాఖ పీఆర్వోలు
– సొంత ఖర్చులతోనే తిండీ తిప్పలు.. దయతలిస్తే ఏషీలో భోజనాలు
– మంత్రుల పర్యటనలు, ప్రెస్కాన్ఫరెన్సులకు హాజరు
– అంత కష్టపడేవారికే 39 నుంచి 70 వేల జీతాలు
– ఏ పనిలేని పీసీబీ పీఆర్వోకు 90 వేల రూపాయల జీతమట
– దానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించే దిక్కులేదు
– పీసీబీ దృష్టిలో ప్రజల సొమ్మంటే పప్పు బెల్లామా?
– గత పీఆర్వోకు 35 వేల జీతమేనట
– చచ్చీచెడీ పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం 24 వేలు మాత్రమే
– అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో
– పీసీబీలో ఇదో ఇష్టారాజ్యం
– అసెంబ్లీకెక్కినా కనిపించని దిద్దుబాటు
– పవన్ కల్యాణ్‌కూ తెలియని పచ్చి నిజాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
వాళ్లు సీఎంఓలో పనిచేసే పీఆర్వోలు. రోజులో సీఎం ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా.. ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించినా దానిని కవర్ చేయాల్సిందే. అంటే వాటి వివరాలను మీడియాకు వార్తలు, కథనాల రూపంలో ఇవ్వాల్సిందే. వారి ఉద్యోగం ఉదయం నుంచే మొదలవుతుంది. అంత చాకిరీ చేసే వారి జీతం 70 వేలు. వారంతా సీనియర్ జర్నలిస్టులే. పూర్వాశ్రమంలో వివిధ పత్రికలు-చానెళ్లలో పనిచేసిన లబ్ధప్రతిష్ఠులే.
– వాళ్లు మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలు. వీరు కూడా గతంలో పత్రికలు-చానెళ్లలో పనిచేసిన అనుభవం ఉన్నవారే. మంత్రులు ఎన్ని ప్రెస్మీట్లు పెట్టినా, ఎన్ని పర్యటనలు చేసినా వారి వెంట ఉండి, ఆ వివరాలను తర్వాత ప్రకటనల రూపంలో మీడియాకు ఇవ్వటం వారి విధి.
ఒకవేళ మంత్రులు సచివాలయంలోని పేషీకి రాకపోయినా వీళ్లు మాత్రం అమరావతికి చచ్చీ చెడి బస్సుల్లోనో, బండ్ల మీదనో వెళ్లాల్సిందే. మరి వీరి జీతం ఎంతనుకుంటున్నారు? కేవలం 39 వేల రూపాయలు. వీళ్లు బస్సులోనో, బండ్ల మీద అమరావతి సచివాలయానికి వెళ్లి, అక్కడి క్యాంటీన్లో భోజన చేస్తే నెలకు కనీసం 20 వేలు ఖర్చవుతుంది. అంటే వారికి మిగిలేది 9 వేలు మాత్రమే. సమాశారశాఖ వారికి జీతాలిస్తుంది.
ఇప్పుడు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గర పనిచేసే పీఆర్వోలకయితే.. పాపం 16 నెలల నుంచీ జీతాలే లేని దయనీయం! ఆ మంత్రులే దయతలచి డబ్బులిస్తున్న వైచిత్రి. తమకూ నెలకు 70 వేల రూపాయల జీతం ఇవ్వాలని గతంలో సమాచార శాఖ కమిషనరుకు పెట్టుకున్న అర్జీ.. ప్రస్తుతం బెజవాడ బస్టాండులోని సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో సుఖనిద్ర పోతోంది. అది వేరే వ్యవహారం.
– వాళ్లు డిపార్టుమెంట్లలో పనిచేసే పీఆర్వోలు. కాకపోతే జీతం సమాచార శాఖ బదులు ఆయా డిపార్టుమెంట్లు ఇస్తాయన్నమాట. వీళ్లు కూడా పూర్వాశ్రమంలో వివిధ పత్రికలు-చానెళ్లలో పనిచేసిన అనుభవం ఉన్నవారే. వీరి జీతం 50 వేల రూపాయలు. మరికొందరి జీతం లక్షా 20 వేల దాకా ఉందట. అది ఆయా మంత్రుల విశాల హృదయం బట్టి ఉంటుంది. వీరు తమ శాఖ మంత్రుల ప్రెస్‌మీట్లతోపాటు, ప్రత్యేక కథనాలు విడుదల చేస్తుంటారు. వీరు కూడా రోజూ సచివాలయానికి రావలసిందే. అంటే లలితా జువెలర్స్ గుండాయన చెప్పినట్లు.. డబ్బులెవరికీ ఊరక రావు!
సీన్ కట్ చేస్తే..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)లో పనిచేసే పీఆర్వో జీతం ఎంతో తెలుసా?.. అక్షరాలా కేవలం 90 వేల రూపాయలు మాత్రమేనట! ఆశ్చర్యపోయినా ఇది నిజంగా నిఝం!! రోజూ సీఎం, మంత్రుల చుట్టూ తిరిగి వారి కార్యక్రమాలు కవర్ చేసే మిగిలిన పీఆర్వోల కంటే.. పీసీబీలో పీఆర్వోకు విరగబడినంత పని ఉంటుందా అంటే అదీ లేదు. పీసీబీ నుంచి మీడియాకు వచ్చే ప్రెస్నోట్లు, నెలకు మహా అయితే ఏడెనిమిదికి మించవు. అవి కూడా చైర్మన్ గారి తాలూకు కార్యక్రమాలే. మరి గత పీఆర్వో జీతం ఎంతో తెలుసా? 35 వేల రూపాయలేనట! మరి జీతాల్లో ఎందుకింత వ్యత్యాసం? ప్రజల సొమ్మును ఈవిధంగా పప్పు బెల్లాలా ఎందుకు పంచుతున్నారని అడిగే దిక్కులేని స్వతంత్ర సామ్రాజ్యమది!
పోనీ అంతేసి జీతం ఇస్తున్నారు కాబట్టి.. ఆ వింగ్‌లో ఆ పీఆర్వో ఒక్కరే రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమదానం చేస్తున్నారా అంటే అంటే అదీ లేదు. ఇంకా మిగిలినవారూ పనిచేస్తారు. మరి పీఆర్వోకు మాత్రమే అంతేసి జీతం ఎందుకంటే.. అది పీసీబీ ఇష్టారాజ్యం.. అడిగేదెవరు? అసలు ఆ శాఖ కార్యకలాపాల గురించి బయట ప్రపంచానికి తెలిసేదెవరికి? అందుకే ఈ స్వేచ్ఛ!
మరి అంతేసి జీతం ఇస్తున్నారు కాబట్టి.. ఆ పోస్టుకు ఏమైనా పేపర్ నోటిఫికేషన్ , టెస్టులూ వగైరా శాస్త్రప్రకారమైన పరీక్షలున్నాయా అంటే అదీ లేదు. కేవలం పీసీబీ వెబ్సైట్లో ఒక ప్రకటన ఇస్తారంతే. అసలు పీసీబీ వెబ్సైట్ అంటూ ఒకటుందని, అందులో పనిచేసే ఉద్యోగులకే తెలియదు. ఇక బయట వారికి ఎలా తెలుస్తుంది? ఇదంతా తమ వారిని తెచ్చుకునే తెలివి!
ఒక్క పీఆర్వో మాత్రమే కాదు. పీసీబీలో పైస్థాయిలో ఉన్నవారు అనుకుంటే ఎవరినయినా తెచ్చుకోవచ్చు. ఎంత జీతమయినా ఇవ్వవచ్చు. ఎలాంటి హోదాలయినా ఇవ్వవచ్చు. వాటిని అడిగే దిక్కులేదు. ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. బోర్డు పేరుతో తీసుకునే నిర్ణయాలు ఎవరికీ తెలియవు. అంతా గండికోట రహస్యమే! ఆ శాఖ మంత్రి- సెక్రటరీలకు అసలు ఇవేమీ పట్టవు. అదే వారి ధైర్యం!!
కానీ.. దశాబ్దాల నుంచి గొడ్డుచాకిరీ చేస్తూ.. ఎప్పటికయినా పర్మినెంట్ చేయకపోతారా అన్న పిచ్చి భ్రమల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాత్రం గొర్రెతోక బెత్తెడే. అంటే నెలకు 24 వేల రూపాయల జీతమన్నమాట! ఆ జీతంతోనే సంసారం నెట్టుకోవాలంతే!! వీరి గురించి పట్టించుకునే మంత్రి లేరు. కార్మిక సంఘాలూ లేవు. మెంబర్ సెక్రటరీలకు పట్టవు. చైర్మన్లకూ పట్టవు. వారి గురించి ఏదైనా మీడియాలో వార్తలొస్తే.. మీరే చెప్పారంటూ గంటల తరబడి నిలబెట్టేంత నియంతృత్వం!