Suryaa.co.in

Editorial

కాంగ్రెస్ హామీలు ఇక ‘ఆరేసి’నట్టేనా?

– కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు హామీలు అమలుచేస్తారా?
– 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఆ హామీలు అమలుచేస్తారా?
– కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే అమలుచేయరా?
– 17 ఎంపీ సీట్లలో గెలిపించకపోతే హామీలు అటకెక్కించేస్తారా?
– సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఆరు హామీల అమలుపై అనుమానపు మేఘాలు
– విపక్షాలకు అస్త్రంగా మారిన రేవంత్ హామీల అమలు వ్యాఖ్యలు
– సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన రేవంత్ కామెంట్లు
– అదంతా విపక్షాల శునకానందమేనన్న పీసీసీ నేత రఘువీర్‌రెడ్డి
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిధుల సమస్య ఉండదన్నది సీఎం భావన
– బీజేపీ కొనసాగితే తెలంగాణకు నిధులు వారన్నది సీఎం వ్యాఖ్యల అర్ధం
– ఓటు వేయకపోతే హామీలు అమలు చేయమని సీఎం ఎప్పుడైనా చెప్పారా?
– విపక్షాలపై కుందూరు రఘువీర్‌రెడ్డి ఎదురుదాడి
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీఆర్‌ఎస్ సర్కారుపై ఆరు హామీల అస్త్రం ప్రయోగించి.. కేసీఆర్ వంటి బాహుబలిని గద్దెదించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ హామీలను ‘ఆరేసి’నట్లేనా? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆ హామీలు అమలు చేస్తుందా? తెలంగాణలోని 17 ఎంపీ సీట్లు గెలిచి బహుమానంగా ఇస్తేనే ఆరు హామీలు అమలుచేస్తుందా? అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా… తెలంగాణలో 17కి 17 సీట్లు రాకపోతే, ఆరు హామీలు అమలుచేయనట్లేనా?… తాజాగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అనుమానపు మేఘాల వైపే చూపిస్తున్నాయి.

తెలంగాణ ఏర్పడిన త ర్వాత వరసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి.. చివరకు జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్, దేశ రాజకీయాల్లో మహాబలుడిగా అవతరించారు. అమేయ శక్తిసంపదను కూడగట్టి, దానితో ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేంత శక్తి సమకూర్చుకున్న కేసీఆర్ పార్టీని… కాంగ్రెస్ కూకటివేళ్లతో పెకిలించేసి, అందరినీ అబ్బురపరిచింది. దానికి ఒక ప్రధాన కారణం ఆరు హామీలయితే, మరో ప్రధాన కారణం రేవంత్‌రెడ్డి కష్టం. ఈ రెండే కాంగ్రెస్‌కు కలగా మారిన అధికారాన్ని.. మూడో ఎన్నికల్లో సాకారం చేసింది.

కేసీఆర్ సర్కారు వివిధ పథకాలకు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఫలితంగా ఉద్యోగులకు నెల జీతం సక్రమంగా ఇవ్వలేని దుస్థితి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టినా, మెగా వంటి బడా కంపెనీలకు మాత్రం, పువ్వుల్లో పెట్టి బిల్లులిచ్చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ముడుపుల కథ, దానిపై తాజా రేవంత్‌రెడ్డి సర్కారు న్యాయవిచారణ అది వేరే ముచ్చట.

మొత్తంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో ఖజానా ఖాళీ అయి, కొత్త పాలకులను వెక్కిరించే పరిస్థితి. దీనితో ఆర్ధిక శాఖను జాగ్రత్తగా నడిపించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అత్యవసరాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారంటే…కేసీఆర్ సర్కారు ఖజానాను, ఎంత గుల్ల చేసిందన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

ఫాంహౌస్-ప్రగతిభవన్ నుంచి బయటకు రాని కేసీఆర్ భద్రత కోసం కోట్లాది రూపాయలతో వాహనాలు కొనుగోలు చేయడం పాత సర్కారు దుబారాకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సంపద, ఆస్తులు సృష్టించామంటున్న బీఆర్‌ఎస్ నేతలు.. అదే నిజమైతే, ఖజానా అప్పుల కుప్పగా ఎలా మారిందన్నది ప్రశ్న.

ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి… ఎన్నికల ముందు, తెలంగాణ ప్రజలపై సంధించిన ఆరు హామీల అస్త్రం, సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ప్రజలు వాటికి అకర్షితులయ్యారు. ఆరునూరైనా ఆరు హామీలు అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు ఆ హామీలు అమలుచేయటం అసాధ్యమని, బీఆర్‌ఎస్-బీజేపీ నేతలు వాదించారు. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు.

అటు మేధావి వర్గం సైతం.. కేంద్రంలోని బీజేపీ సహకరించకుండా, ఆరు హామీలను ఎలా అమలుచేస్తుందని చర్చ పెట్టింది. అయినా జనం కాంగ్రెస్ మాటలనే విశ్వసించింది. అప్పట్లో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత ప్రభావమది. దానితో పదేళ్ల కేసీఆర్ సర్కారును గద్దెదించి, కాంగ్రెస్‌ను గద్దెనెక్కించింది.

దానితో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు వెంటనే అమలవుతాయని తెలంగాణ సమాజం ఆశించింది. రేవంత్‌రెడ్డి తొలి సంతకం నిజమైనప్పటికీ… అవి ఎప్పటినుంచి అమలవుతాయన్న దానిపై స్పష్టత లేకపోవడం.. బీజేపీ-బీఆర్‌ఎస్ వాటిపై జమిలిగా ముప్పేట దాడి చేసి, నిలదీస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగానే మారింది. అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాకముందే ఈ ఏడుపులు, పెడబొబ్బలేందన్న కాంగ్రెస్ నేతల ఎదురుదాడిలో అర్ధం లేకపోలేదు.

అయితే ఎప్పటినుంచి హామీలు నెరవేరతాయన్న సంకేతాలు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లేకపోవడంతో.. ప్రజల్లో సహజంగానే అనుమానం ఆరంభమయింది. దానికితోడు, బీఆర్‌ఎస్ ఖజానాను ఖాళీ చేసిందంటూ.. మీడియా-సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కూడా, ప్రజల్లో హామీల అమలపై అనుమానాలు ఏర్పడేందుకు మరో కారణంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆరు హామీల అమలుకు సంబంధించి చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో నెట్టగా.. విపక్షాస్త్రాలకు అస్త్రంగా మారింది. ఇప్పుడు రేవంత్ చేసిన

వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, విపక్షాలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నాయి.

‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు జరుగుతాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే, ఈ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు 17 కాంగ్రెస్ గెలవాలి’’ అని రేవంత్ కుండబద్దలు కొట్టారు.

అంటే సీఎం రేవంత్ వ్యాఖ్యల ప్రకారం.. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా, తెలంగాణలో 17 సీట్లకు 17 గెలవకపోయినా ఆరు హామీలు నెరవేర్చడం కష్టమని ఆయన కవి హృదయం స్పష్టం చేస్తోంది. ఒకరకంగా ఇది రేవంత్‌రెడ్డి మనసులో మాటగానే రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదెప్పుడు? మీరు ఆరు హమీలు అమలు చేసేదెన్నడు? అక్కడ అధికారం రాదు. ఇక్కడ 17 సీట్లు రావు.. ఇవన్నీ హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ జనంతో ఆడే మైండ్‌గేమ్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి.

ఆరు హామీలు నెరవేర్చే పరిస్థితి లేనందున, దాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించి.. చివరాఖరకు ప్రజలపైనే నెపం వేసే రాజకీయ వ్యూహంతోనే, రేవంత్‌రెడ్డి ఈ కొత్త వ్యూహానికి తెరలేపారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బిల్లులు చెల్లించే పరిస్థితి లేనప్పుడు, ఆరు హామీలకు కావలసిన వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు?

అప్పుడు కేసీఆర్‌పై వ్యతిరేకతతో ఓట్లేసిన ప్రజలు, వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు, రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా… తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు రాకపోయినా.. ‘మేం ముందే చెప్పాము కాబట్టి, ఇందులో తమ తప్పేమీలేద’ని చెప్పి తప్పించుకునేందు, ఇదో ముందస్తు వ్యూహమన్నది రాజకీయ పండితుల వ్యాఖ్య.

అయితే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు నిధులివ్వదని అందరికీ తెలుసు. దేశంలో కాంగ్రెస్ సహా విపక్షాలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ నిధులివ్వడం లేదు. అదే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సులభంగా అమలుచేస్తుందని చెప్పడమే సీఎం భావన. దానిని ఆ కోణంలోనే చూడాలి. అంతేగాని ఒక వ్యాఖ్య తీసుకుని తలా తోక లేకుండా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయడం శునకానందమేనని వ్యాఖ్యానించారు.

‘‘అయినా కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే హామీలు అమలు చేయబోమని సీఎం ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పారా? రేవంత్‌రెడ్డి గతంలో మాదిరిగా కాంట్రాక్టర్లకు, తన బంధువులకు, తనకు కావలసిన వారికి నిధులు దోచిపెట్టడం లేదు కదా? ముందు ప్రజావసరాలకు సంబంధించిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని రఘువీర్ గుర్తు చేశారు.

‘‘ ప్రజలు వారి ప్రచారాన్ని నమ్మాల్సిన పనిలేదు. రాహుల్ నుంచి రేవంత్‌రెడ్డి వరకూ ఆరు నూరైనా ఆరు హామీలు కచ్చితంగా అమలుచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ మాట ఇస్తే వెనక్కి పోదు. తెలంగాణ కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే వచ్చిందని గుర్తుంచుకోవాలి.

LEAVE A RESPONSE