Suryaa.co.in

Family

ఇలాంటి కొడుకులూ ఉంటారా?

అమ్మ.. అయితే మాకేంటి? మా నాన్న మాకేం చేశాడు? ఆమెను నేనెందుకు చూడాలి. నాకు సెలవులు దొరకవు. నా భార్యకు ఆరోగ్యం బాగుండదు. తను చాలా కష్టపడుతుంది. నా కొడుకుకు ఉద్యోగం లేదు. కూతురు బాగోగులు చూసుకోవాలి. మా మామగారు నాకు చాలా సాయం చేశారు.

కాబట్టి ఆ కుటుంబాన్ని చూడాలి. వాళ్ల వల్లే మేం ఈ స్థాయికి వచ్చాం. వాళ్ల దయ వల్లే మేం ఈ ఇల్లు కట్టుకున్నాం. వాళ్లే దగ్గరుండి ఇల్లు కట్టించారు. ఇప్పుడు మా మామగారు ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్లను చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది.

అమ్మా.. నువ్వు తమ్ముడి దగ్గరో, అక్క దగ్గరో, చెల్లి దగ్గరో ఉండు. వాళ్లు చూడకపోతే ఓల్డేజ్ హోంలో ఉండు. డబ్బులిస్తే వాళ్లు బాగా చూస్తారు. అన్నట్లు నాన్న పెన్షన్, నీ పెన్షన్ ఏం చేస్తున్నావ్? వాటితో బతికెయ్. నాన్న పెన్షన్ ఏం చే స్తున్నావ్? నాకు నా కుటుంబాన్ని చూడటానికే సమయం ఉండటం లేదు. నా భార్య కుటుంబం నాకు తోడు లేకపోతే నేను లేనమ్మా. ఏమీ అనుకోకు. దయచేసి మా ఇంటికి రావద్దు. మాకు పెద్దగా స్థలం కూడా లేదు.

అన్నట్లు మన ఊళ్లో స్థలం-ఇల్లు అమ్మెయ్. నాకు చాలా అప్పులున్నయ్. నాది ప్రైవేటు ఉద్యోగం. పెన్షన్లు గట్రా రావు. మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది కాబట్టి, నీకు చేయడానికి ఇంట్లో ఎవరూ ఉండరు. కావాలంటే ఒక సర్వెంటును పెడతా. ఆమెకు జీతం ఇచ్చెయ్. అయినా నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా. అర్ధం చేసుకో. ఇదీ.. ఇప్పటి సగటు కొడుకులు, తల్లులకు చేసే హితబోధ.

అయితే.. తలిదండ్రులు వద్దనుకునే కొడుకులకు.. వారు ఆజన్మాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు మాత్రం కావాలి. అందులో వాటాలు కావాలి. తాము కష్టాల్లో ఉంటే, తలిదండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్మేయాలి. సిగ్గులేని కొడుకులు.. ఇలా మనకు గజానికి డజన్ల మంది తారస పడుతుంటారు.

కానీ ఆ అన్నదమ్ములు మాత్రం, ఆ కుటుంబ బంధనాలకు విరుద్ధం. మా అమ్మను నేను చూస్తానంటే నేను చూస్తానని ఏకంగా కోర్టుకెక్కారు. ఇలాంటి కొడుకులు ఇప్పుడు మనకు భూతద్దం వేసినా కనిపిస్తారా? కుటుంబ చట్రంలో ఇరుక్కుని, తలిదండ్రులను గాలికొదిలేసిన కొడుకులే తప్ప, ఇలాంటి బాధ్యత గల కొడుకుల కథలు విన్నారా?.. అవును ఉన్నారు. మీరే వినండి.

కనిపెంచిన తలిదండ్రులను గాలికొదిలేసి, కుటుంబచట్రంలో బందీ అయి.. కన్నవారి ఆస్తులను దిగమింగి… సిగ్గు, శరం, మానాభిమానాలు వదిలేసిన అచ్చోసిన ఆంబోతు కొడుకులున్న ఈ యుగంలో.. ఇలా కన్నవారిని కంటికి రెప్పలా చూసుకునేందుకు, కోర్టుకెక్కిన కొడుకులకు ప్రణామాలు. కన్నవారి కోసం పరితపించే వారు కడు ధన్యులు. ఇదంతా తామే అని కొడుకులు ఫీలవుతే, దానికి నాకేమాత్రం సంబంధం లేదు

– లక్ష్మీనారాయణ

LEAVE A RESPONSE