Suryaa.co.in

Andhra Pradesh

టూరిజం ముసుగులో సీఎం మకాం నిర్మాణాలకు ఏర్పాట్లు

-సుప్రీంను తప్పుదారి పట్టించిన రాష్ట్ర ప్రభుత్వం
-50 శాతం నిర్మాణాలు పూర్తి అంటూ…రుషికొండ కు గుండు కొడుతున్నారు
-క్షేత్రస్థాయి వాస్తవాలను మీడియా, విశాఖ ప్రజలు సుప్రీంకు నివేదించాలి
-దస్తగిరి కి పటిష్ట భద్రత కల్పించాలి… లేకపోతే సీఎం జగన్ అప్రతిష్టపాలయ్యే ప్రమాదం
-కోనసీమ జిల్లా నామకరణంపై ప్రజల చేత రెఫరెండం కోరాలి
-తక్షణమే కోనసీమ ప్రాంతంలో లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

టూరిజం ప్రాజెక్టు ముసుగులో రిషి కొండను గుండు కొట్టించి నట్లు గా కొట్టేసి, ఇప్పుడక్కడ 50శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా తప్పుదోవ పట్టించిందని నరసాపురం లోక్ సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. టూరిజం ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా, ఇప్పటికే నిర్మించిన భవనాల పై, అదనపు అంతస్తులను నిర్మిస్తామని చెప్పి మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు పొందారని గుర్తుచేశారు, ఒక్క ఇటుక కూడా మిగలకుండా భవనాలను కూల్చివేసి, కొండను తవ్వా రని చెప్పారు.

మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… 50, 60 ఎకరాల్లో రిషికొండ ను చిదిమేసి, చెట్లను నరికి వేసి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. కానీ కోర్టుకు మాత్రం ఇప్పటికే అక్కడ 50శాతం భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీ టి)ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో తప్పుదోవ పట్టించిందని, అయితే … తాను వాస్తవాలను వివరిస్తూ రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఎన్ జీ టి ప్రత్యేక కమిటీ నివేదిక అందే లోగానే, సుప్రీంకోర్టు నుంచి స్టే పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

టూరిజం ప్రాజెక్టు ముసుగులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ రుషికొండ పై 40 వేల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో తన క్యాంపు కార్యాలయాన్ని, కావలసిన బిల్డింగులను నిర్మించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఎన్ జీ టి ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ నివేదిక నెలరోజుల్లో రానుందని, అప్పటివరకు కు వేచి చూడకుండా ఇప్పటికీ ఇప్పుడే సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించి స్టే పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను, తనకు సాధ్యమైనంతవరకు తాను అడ్డుకుంటానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

క్షేత్రస్థాయి వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తానన్న ఆయన , అలాగే విశాఖ ను ప్రేమించే ప్రజలు, విశాఖ వాసులు ప్రస్తుత క్షేత్రస్థాయి వాస్తవాలను ఫోటోలు తీసి, సుప్రీంకు నివేదించాలని సూచించారు.. అలాగే మెరుగైన సమాజం కోసమనే ట్యాగ్ లైన్ తో పనిచేస్తున్న టీవీ9, ఎన్టీవీ, టెన్ టీవీ, ఏబీఎన్, ఈటీవీలో సైతం రిషికొండ క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజల కళ్ళముందు ఉంచాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

ఒకవైపు నూతన ప్రభుత్వ కార్యాలయాలేవి నిర్మించ వద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా తమ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్న ఆయన, అమరావతి నిర్మించ మంటే మాత్రం నిధులు లేవని చెబుతూనే, రిషి కొండ పై ముఖ్యమంత్రికి కావాల్సినట్టుగా భవన నిర్మాణాలకు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రిషి కొండపై 50శాతం నిర్మాణాలు పూర్తయినట్లు గా ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్ సింఘ్వీ ద్వారా కూడా సుప్రీంకోర్టులో అబద్ధాలు చెప్పించారన్నారు. ఎన్ జీ టి, హైకోర్టు లు రాష్ట్ర ప్రభుత్వం, చట్టాన్ని ఉల్లంఘించిందని అంటే అవసరమైతే ఈ బిల్డింగులను కూడా కూల్చి వేస్తామని చెప్పి అండర్ టేకింగ్ ఇచ్చి, సుప్రీంలో స్టే పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిల్డింగుల నిర్మాణానికి అయ్యే ఖర్చు జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి వచ్చింది కాదని గుర్తు చేశారు.

అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలి
కోనసీమ జిల్లా నామకరణం పై నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అమలాపురం ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయ డా న్ని రఘురామ కృష్ణం రాజు తీవ్రంగా ఆక్షేపించారు. కోనసీమ ఏమైనా జమ్ము కాశ్మీరా? అంటూ ప్రశ్నించారు. అమలాపురంలో విద్యాధికులు ఎక్కువగా ఉన్నారని, వారంతా వర్క్ ప్రం హోమ్ లో భాగంగా విధులను నిర్వహిస్తున్నారని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వల్ల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, తక్షణమే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు ఆయన డిమాండ్ చేశారు.

కోనసీమ జిల్లాలో అల్లర్లకు ప్రేరేపించిన వారిని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు . కోనసీమ అల్లర్లలో కేవలం రెండు ఇల్లు మాత్రమే కాలి పోయాయని , కాలి పోతాయని పోలీసులకు ముందే తెలుసునన్నారు. అందుకే ఆ ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారనీ పేర్కొన్నారు. ఒకవేళ అల్లర్లు జరుగుతాయని పోలీసులకు ముందే సమాచారం ఉంటే, అల్లరి మూకలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఫైర్ ఇంజన్ లను తెప్పించి దగ్గర పెట్టుకోవాలన్నారు. కానీ పోలీసులు ఇవేమి చేయకుండా తమ తుపాకులను అక్కడే వదిలేసి ఎందుకు వచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ఉమ్మడి జిల్లా లో మూడవ వంతు జిల్లాగా ఏర్పడిన కోనసీమ జిల్లా కు అంబేద్కర్ పేరు పెట్టడాన్నీ అంబేద్కర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ, సీడబ్ల్యూసీ సభ్యుడు చింతా మోహన్ కూడా ఆక్షేపించారన్నారు . అంబేద్కర్ స్థాయికి ఇది ఏమాత్రం తగదని ఆయన పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నామకరణం పై అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటూనే, ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే విషయమై తక్షణమే రెఫరెండం నిర్వహించాలని, 51 శాతం మంది అనుకూలంగా ఓటు వేస్తే, ఇక ఎవ్వరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు.

కోనసీమ ప్రాంత ప్రజలు శాంతి కాముకుల ని, అల్లర్లు అంటేనే ఆమడ దూరం ఉండేవారని, కులాలకు అతీతంగా కలిసి ఉండే ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం మంచిది కాదన్న ఆయన, ఈ అల్లర్లకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కారణమన్నారు. కోనసీమ చిచ్చును ఎవరు రాజేసిన, అర్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక విదేశీ ఆర్దిక విహారయాత్ర ముగించుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, కోనసీమ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటే , మంచిదన్నారు.

యాదృచ్చిక ఘటనలకు బ్రేకు వేయాలి
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పై పోలీస్ స్టేషన్ లోని దాడికి ప్రయత్నించడం వంటి యాదృచ్ఛిక ఘటనలకు బ్రేక్ వేయాలని లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్రతిష్టపాలు కావాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి రఘురామకృష్ణంరాజు సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత, ఎస్ఐ ని కలవడం… ఆ తరువాత మస్తాన్ ట్రాక్టర్ సామాన్లు పోవడం, దానికి దస్తగిరితో రవి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే చొక్కా పట్టుకొని ఘర్షణకు దిగడం వంటి సంఘటనలు పరిశీలిస్తే, ఎన్నో అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.

దస్తగిరి కి ఏమైనా జరిగితే, దానికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిందించే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయన్నారు. వివేకా హత్య కేసును వేగవంతంగా విచారణ పూర్తి చేయడానికి సిబిఐ కి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందించాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉందని అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు
సూపర్ స్టార్ కృష్ణకు రఘురామకృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. మంచితనం, ధైర్యం ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు అని, అటువంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE