చీకటి రాజ్యంలో అగ్నితేజం ఆర్యసమాజం

బానిస వంశరాజులు, మొగలాయి చక్రవర్తులే ఆదర్శంగా పాలన సాగిస్తున్న నైజాం రాజ్యంలో అధిక సంఖ్యా మతస్థుల గుండె నిబ్బరమై నిలిచిన సంస్థ ఆర్య సమాజం. హిందూ జీవనం, ధర్మం, విశ్వాసాలు, ప్రజల భాష అణచివేతకు గురైన ఆ చీకటియుగంలో అగ్నితేజమై వెలిగి, హిందూ జనవాహినిలో ఉత్తేజం నింపినదేే ఆర్య సమాజం. నిజాం మకుటాన్నీ, మతోన్మాదాన్నీ మట్టి కరిపించడంలో ఆర్య సమాజం పాత్ర దాచేస్తే దాగని నిజం.

నైజాం రాజ్యంలో బీడ్‌ జిల్లా ధారూర్‌లో ఆర్య సమాజం మొదటి శాఖ 1891లో ఆవిర్భవించింది. 1892లో హైదరబాద్‌ శాఖ జనించింది. ఈ శాఖకు కాంతాప్రసాద్‌ మిశ్రా అధ్యక్షులు. లక్ష్మణదాస్‌, ఆదిపూడి సోమనాథరావు ఉపదేశకులు. ఆర్య సమాజం కేవల ధార్మిక సంస్థ కాదు. కొత్త ప్రపంచంలోకి, అసమానతలు, దురాచారాలు లేని కొత్త జీవనంలోకి హిందువులను నడిపించాలని స్వప్నించిన మహోన్నత సంస్థ. ప్రతి భారతీయునిలో స్వాతంత్య్ర భావన నింపి, జాతికి స్వేచ్ఛ కల్పించాలని తపించిన సామాజిక సంస్థ. ఆ తాత్వికతతోనే హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిమ్న వర్గాలను వేద మార్గంలోనే నడిపించడం, మత దురహంకారులను ఎదుర్కోవడం అనే రెండు చరిత్రాత్మక కార్యక్రమాలను చేపట్టింది.

ఆర్యసమాజం జనవరి 25,1939న ‘హైదరాబాద్‌ డే’ నిర్వహించింది. నిజాం హిందువులను పెట్టే బాధలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. రెండవ సారి మార్చి 22, 1939న, మూడవసారి ఏప్రిల్‌ 22, 1939న, నాల్గవసారి మే 22, 1939న, ఐదోసారి జూన్‌ 22,1939న హైదరాబాద్‌ డే నిర్వహించింది. నిజాం రాజ్యంలో పరిస్థితుల నేపథ్యంలో ఆర్య సమాజ సిద్ధాంతం ఒక ఉప్పెనలా ప్రజల హృదయాలను చేరుకుంది. దీనితో నిజాం అణచివేత కూడా ఎక్కువైంది. ఆర్య సమాజాన్ని సమర్థించినందుకు రజాకార్లు బీదర్‌లో దుకాణాలను తగలబెట్టారు. నైజాం రాజ్యంలో ఎక్కడా యజ్ఞయాగాలు జరపరాదనీ, (హిందూ) మతపరమైన ఉపన్యాసాలు చేయరాదని జూన్‌ 18, 1937న హోంమంత్రి ఆంక్షలు విధించాడు. ప్రభుత్వ శాసనం ధిక్కరించినందుకు మురఖేడ్‌లో చౌదరి శ్రీరాంను, నాగార్‌సోగాలో రఘునాథ్‌ ప్రసాద్‌ను, ఘనశ్యాం ప్రసాద్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ‘ఇతైహాదుల్‌ ముసల్మీన్‌’ పక్షాన బహదూర్‌ యార్‌జంగ్‌ హరిజనులను (ఇప్పుడు షెడ్యూల్డ్‌ కులాలు) ‘తబ్లిగ్‌’ పేరుతో మతం మార్చే పని విస్తృతంగా చేపట్టాడు. ఇందుకోసం ఓరహస్య పత్రం అతడు విడుదల చేస్తే, ఆర్యసమాజ కార్యకర్త వి. వెంకటస్వామి దానిని సంపాదించాడు. ఆర్యసమాజం ఈ కుట్రను బహిర్గతం చేసింది. నిజాం ప్రభుత్వం తట్టుకోలేక కార్యకర్తలపై మరింత కక్ష పెంచుకొంది.

ఆర్యసమాజ పెద్దలు సుల్తాన్‌ బజార్‌లో సమావేశం జరిపి ఈ రహస్యపత్రం నాటి ఆర్యసమాజ పెద్దలైన పండిట్‌ నరేంద్రజీకి వినిపించారు. అందరి రక్తం వేడెక్కింది. హరిజనులను మతం మార్చే ప్రక్రియకు ప్రభుత్వం పరోక్షంగా ధన సహాయం చేస్తూ రజాకార్లకు స్వేచ్ఛను ఇచ్చింది.

పండిత నరేంద్రజీ, పండిత్‌ చందూలాల్‌, గజానంద్‌, నారాయణలాల్‌ పిత్తి, బలదేవ్‌జీ పతంగె, శంకర్‌రెడ్డి మొదలైన వాళ్లంతా కలసి ‘ఓమ్‌ టీం’ సిద్ధం చేశారు. బహదూర్‌ యార్‌జంగ్‌ చేసే తబ్లిగ్‌ (మతమార్పిడి) అడ్డుకొని, మతం మారిన వాళ్లను ‘శుద్ధి’ ఉద్యమంతో వెనక్కి తీసుకొచ్చేవారు.

ఆర్యసమాజంలో మహాత్ముడిగా పేరొందిన స్వామి శ్రద్ధానంద ఈ శుద్ధి ప్రక్రియను ప్రారంభించారు. ఖాజా హసన్‌ నిజాం అనే మతపెద్ద నిజాం సహకారంతో అబ్దుల్‌రషీద్‌తో డిసెంబర్‌ 23, 1926న స్వామిని హత్య చేరుంచాడు. ఆ తర్వాత మరింత పట్టుదలతో మతమార్పిడి వ్యతిరేకోద్యమాన్ని ఆర్యసమాజ కార్యకర్తలు పెద్ద ఎత్తున సృష్టించగలిగారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ, బీదర్‌ ప్రాంతల్లో ఆర్యసమాజ శాఖలు ప్రారంభమై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది.

అలా తబ్లిక్‌కు ఆటంకం ఏర్పడి, జంగ్‌కు తల తీసినంత పనైంది. దానితో నిజాం ప్రభుత్వంలో మత ఛాందసవాదులు ఆర్యసమాజంపైన కక్ష కట్టారు. మందుముల నరసింగరావు ‘రయ్యత్‌’ పత్రిక ద్వారా బాల్యవివాహాలు రద్దు చట్టం ప్రస్తావన తెస్తే ఆర్య సమాజం మద్దతు ఇచ్చింది. స్త్రీల చదువులు, వ్యాయామశాలలు, పుస్తక ప్రచురణలతో ఆర్యసమాజం ప్రజల్లోకి వెళ్లింది. 1941 జూలై 22న హిందీ మాధ్యమంగా కేశవ స్మారక ఆర్య విద్యాలయం స్థాపించారు.

వీటిని జీర్ణించుకోలేని నైజాం ప్రభుత్వం ‘రహబరే దక్కన్‌’, ‘సుబహే దక్కన్‌’ వంటి పెంపుడు పత్రికలతో ఆర్యసమాజం మీద విషం కక్కించింది. ఆర్యసమాజం కూడా ‘వైదిక ఆదర్శ’ అనే పత్రికతో వాటికి సమాధానం ఇచ్చేది.

నిజామాబాద్‌లో బక్రీదు పండుగ రోజు ఓ మతోన్మాద రజాకార్‌ ఆజంరోడ్‌ మధ్యలో ఆవు తల నరికి దానిని మూసి ఉన్న భవాని మెడికల్‌ స్టోర్‌కు కట్టాడు. దీనితో అల్లర్లు చెలరేగారు. ఇదే అదునుగా పోలీసులు ఆర్యసమాజ కార్యకర్తలైన ఎమ్‌. శ్రీనివాస్‌, మాణిక్యరెడ్డి, రఘువీర్‌సింహలను అరెస్ట్‌ చేశారు. వాళ్ల జంధ్యాలను తెంపి, హింసించి, నోళ్లల్లో బలవంతంగా మాంసం కుక్కారు.

జూన్‌ 24, 1938న కల్యాణినగరంలో ఆర్యసమాజంలో చురుకైన కార్యకర్త ధర్మప్రకాశ్‌ ఆర్యసమాజ ఓం పతాకాన్ని ఆవిష్కరిస్తానంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అప్పటికే ఆయన హైందవధర్మ రక్షణకు ఎందరో యువకులను తయారు చేస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా హిందూ యువకులకు శిక్షణ ఇవ్వడం రజాకార్లు తట్టుకోలేకపోయారు. పోలీసులను, రజాకార్లను తోసిరాజని ఓ రోజు ఓం పతాకాన్ని ఆవిష్కరించి ఇంటికి వస్తూంటే దారిలో కాపుకాసి ధర్మప్రకాశ్‌ను హత్యచేశారు. ఈ ఘటనతో భయభ్రాంతులైన ప్రజలు ఇళ్లను వదలి వెళ్లిపోయారు.

ఆగష్టు 21, 1939న హిందూ యువకార్యకర్త రాధాకృష్ణ మోదాణీని కొత్వాలీ చౌక్‌ లేదా కోటగల్లీ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న ప్రాంతంలో మజ్లిస్‌ రజాకార్‌ రాక్షసులు హత్య చేశారు. వైదిక భావజాలం ఆ ప్రాంతంలో ప్రచారం చేయడమే అతడు చేసిన తప్పు. ఈ హత్యలో ఓ అరబ్బు చాహుష్‌ పాల్గొని రక్తంతో తడిసిన కత్తిని పట్టుకొని అందరూ చూస్తుండగానే పరారయ్యాడు. ధూల్‌పేటలో జరిగిన అల్లర్లలో ఆర్యసమాజ కార్యకర్తలను జైళ్లకు పంపారు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ కార్యకర్తలైన రజాకార్లు వీలు అయినపుడల్లా ఓం పతాకాలను పీకేయడం, వాటిని కాల్చడం, కిందేసి తొక్కడం, యజ్ఞ మండపాలను ధ్వంసం చేయడం అలవాటుగా చేసుకొన్నారు.

బహదూర్‌యార్‌జంగ్‌ వీలైనపుడల్లా మతవిషం కక్కేవాడు. ఆర్యసమాజాన్ని లక్ష్యంగా చేసుకొని ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఉర్దూ పత్రికలు రజాకార్ల తొత్తులుగా వ్యవహరిస్తూ ‘హిందువులు విగ్రహారాధకులు, కాఫిర్లు’ అనే రజాకార్ల మాటలను బాగా ప్రచారం చేసేవి.

ఆర్యసమాజం ఆధ్వర్యంలో 1938 డిశంబర్‌ 25-29 వరకు షోలాపూర్‌లో అఖిల భారత ఆర్యసమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశం లోక్‌నాయక్‌ మాధవరావు నేతృత్వంలో నిజాంపై ధర్మయుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్లకు జైలుశిక్ష విధించారు.

ఆర్యసమాజం కూడా నిర్గుణ పరబ్రహ్మ ఆరాధన చెప్తుంది కాబట్టి ముస్లింలను ఈ విషయంలో ధీటుగా ఎదుర్కొనేది. ఆర్య సమాజంపై ఇన్ని అకృత్యాలు జరిగినా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు. పండిత వినాయకరావు విద్యాలంకార్‌ గారి నేతృత్వంలో ‘హైదరాబాద్‌ ప్రాంతీయ ఆర్యసభలు’ ఎంతో వైభవంగా జరిగాయి. శ్రీమతి సుశీలాదేవి అధ్యక్షతన మహిళాసభలు జరిగారు. ఈ సమయంలోనే ఔరంగాబాద్ లో శుక్రవారం నమాజు జరిగాక, ముస్లింలు గుంపుగా బయటకు వచ్చి హిందువుల దుకాణాలపై రాళ్లు రువ్వుతూ దాడిచేసి దుకాణాలకు నిప్పు పెట్టారు. లక్షల్లో హిందువుల ఆస్తులు దెబ్బతిన్నారు. చించోలి, సంజోటి, హింగోలీ, గుల్బర్గా, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్గొండల్లో హిందువులపై రజాకార్లు భీకరమైన అకృత్యాలు జరిపారు.

డిసెంబర్‌ 29, 1938న ఆర్యవీరుల సమ్మేళనం జరిగింది. ఆ సభకు వీర సావర్కర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ‘హైద్రాబాద్‌ స్వతంత్ర ఉద్యమానికి’ మద్దతు పలికారు. జనవరి 14, 1939 నాడు ‘హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే అదేరీతిలో మేమూ జవాబిస్తాం’ అని నిజాంను హెచ్చరించారు.

హైదరాబాద్‌ సంస్థానం ఓ చెరసాల అన్నందుకు పండిట్‌ నరేంద్రజీని రాజద్రోహం క్రింద నిర్బంధించి ఆరునెలల ‘కాలాపానీ’ (ద్వీపాంతరశిక్ష) విధించారు. ఇక్కడి కోర్టుల్లో న్యాయం లేదన్నందుకు పండిట్‌ గణపతిలాల్‌ అనే ఆర్యసమాజ పెద్దకు 3 నెలల శిక్ష విధించారు. 23 జూన్‌ 1939న బన్సీలాల్‌ వ్యాస్‌ను అతని అనుచరులైన 18 మందిని తీవ్రంగా కొట్టి, గాయపరచి జైలుకు పంపారు. ఉమరగాంలో సత్యర్థప్రకాశ్‌ పత్రికను రామచంద్ర సింహ నడుపుతూ ఉండేవాడు. దాన్ని నిజాం ప్రభుత్వం జప్తు చేసింది. ఆర్యసమాజ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న మోహన్‌ సింగ్‌ను కళ్యాణి ప్రాంతంలో ఘోరంగా హత్యచేశారు. నిజాం రాష్ట్రంలో జరుగుతున్న ఆరాచకాలను ఎప్పటికపుడు విమర్శించినందుకు రాంశర్మ, రాజారాం శాస్త్రి, హకీం గణపతిరావు, చంద్రపాల్‌, విష్ణు భగవంత్‌, స్వామి సత్యానంద్‌లకు 2 మే 1939 నాడు రెండేళ్ల కారాగార శిక్ష విధించారు.

వైదిక ధర్మ శాస్త్రాల్లో అగ్రగణ్యుడు, శాస్త్రచర్చలో అసమాన ధీరుడైన పండిత శ్యాంలాల్‌ ఆనాటి ముస్లిం మతప్రచారకులకు కొరకరాని కొయ్యగా మారాడు. అద్భుతమైన తర్కంతో ఎంతటివారితోనైనా వాదించగల అజేయుడు శ్యాంలాల్‌ను అక్రమంగా అరెస్ట్‌చేసి బీదర్‌ జైలులో ఉంచారు. ఔషధం పేరుతో 16 డిసెంబర్‌ 1938 నాడు ఆయనకు విషమిచ్చి చంపేశారు.

1947 జూలై 15న వరంగల్‌లో తొలి ఏకాదశి రోజు ఉరుసు ప్రాంతంలో ఆర్యసమాజ మందిరంపై పతాకావిష్కరణ చేశారు. దానికి ముస్లింలు ఆందోళన చేసి, జెండాను దింపి అవతల పారేశారు. దాంతో హిందువులకు ఆగ్రహం వచ్చింది. పట్టణంలో ఘర్షణలు చెలరేగి ముగ్గురు యువకులు హత్యకు గురయ్యారు. అందులో ఎవరు మరణించారో అధికారులే తేల్చలేకపోయారని మాదిరాజు రామకోటేశ్వరరావు చెప్పారు. ఈ క్రమంలో చెలరేగిన మతఘర్షణల్లో ముస్లింలు ద్వాదశి బోనాలను కూడా దర్గా ప్రక్కనుండి వెళ్లకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.

బల్గా గ్రామంలో మహదేవ్‌ అనే ఆర్యసమాజ మేధావి ఉండేవారు. వేదధర్మ ప్రబోధంతో అక్కడి ప్రజలను విధర్మీయుల నుండి కాపాడి, వాళ్లలో చైతన్యం కలిగించారు. ఎన్నోసార్లు అతనిపై దాడిచేసి అతని పుస్తకాలు లాక్కున్నారు. రజాకార్లు, పోలీసులు అతణ్ణి లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. జూలై 17, 1938న గ్రామాంతరం నుండి వస్తున్న అతడిని చుట్టు ముట్టి హత్య చేశారు.

ఏది ఏమైనా హైదారాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలో ఆర్యసమాజం పాత్ర మరువలేనిది. ఆనాటి ఆర్యసమాజానికి చెందిన యువకులు ప్రాణాలు అర్పించగా, పెద్దలెందరో భయకంపిత జీవితాన్ని గడిపారు. ఇందులో కొందరు చేసిన త్యాగం భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లకు తక్కువేం కాదు.

ఓంకా ఝండా
హమారా ఓంకా ఝండా
సారా దునియామే లహరా యేంగే ఓంకా ఝండా
హమారా ఓంకా ఝండా
అంటూ వాళ్లు పాడిన పాటలు, వదలిన ప్రాణాలు, చిందించిన రక్తం ఈ నేలను ఇంకా కాషాయపు రంగుతో ఉంచాయనే చెప్పవచ్చు.

– (జాగృతి సౌజన్యం తో)
vsktelangana.org