Suryaa.co.in

Political News

చరిత్ర ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ఉంటాడు

పరిపాలన ఒక నిరంతర ప్రక్రియ. అభివృద్ధి ఒక అంతులేని కథ. ప్రతి ఎన్నికల తరువాత ప్రభుత్వాలు మారుతాయి,ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మారతారు. కానీ వాళ్లు ప్రారంభించిన చాలా కార్యక్రమాలు తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగిస్తారు.ముఖ్యంగా దీర్ఘకాలిక అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు.

432 సంవత్సరాల క్రితం గోల్కొండ కోటలో ఉన్న కులీ కుతుబ్ షా….కోటకు ఎదురుగా,ప్రస్తుత చార్మినార్ ప్రాంతంలో ఒక నూతన పట్టణానికి అంకురార్పణ చేశాడు. ఇస్లాం ప్రపంచానికి అధిపతి అయిన ఖలీఫా ఆలీ ఇబాన్‌ అభి తాలిబ్ (ఆయన మరో పేరు హైదర్) కు గుర్తుగా హైదరాబాద్ అని నామకరణం చేశాడు.

ఒక చెరువు చేపలతో నిండినట్టు నా నగరం జనంతో నిండి ఉండే విధంగా ఆశీర్వదించు ప్రభు…..అని కులి కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణం ప్రారంభించిన రోజు అల్లాని ప్రార్థించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ నూతన నగరంలో కొన్ని వందల భాగ్ లు (ఉద్యానవనాలు/పార్కులు) ఉండటంవల్ల ఈ నగరాన్ని భాగ్ నగరం అని కూడా పిలిచారు.(ఇప్పటికీ హైదరాబాదులో బషీర్ బాగ్/బాగ్ లింగంపల్లి/ పూల్ బాగ్/ కుందన్ బాగ్….మొదలైన పేర్లు చూస్తే చరిత్ర అర్థం అవుతుంది.

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన హైదరాబాద్ నగరంలో ఇస్లాం సంస్కృతి ఆధిపత్యం కారణంగా,మరియు బ్రిటిష్ వాళ్లు హైదరాబాద్ నగరాన్ని పాలించలేదు కాబట్టి ఇతర బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో వచ్చిన ఆధునిక మార్పులు …హైదరాబాద్ నగరంలో రాలేదు.

1724లో మొగలు చక్రవర్తుల గవర్నర్ గా దక్షిణ భారతదేశం వచ్చిన నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ ని స్వతంత్రంగా పాలించటం మొదలు పెట్టిన తర్వాత హైదరాబాద్ నిజాం సంస్థానమైంది.1798లో హైదరాబాద్ నిజాం– ఈస్టిండియా కంపెనీతో చేసుకున్న సైనిక ఒప్పందం కారణంగా…హైదరాబాద్ సంస్థాన రక్షణ కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం వచ్చింది.

ఆ సైన్యం కోసం హైదరాబాద్ నగర శివారులో సైనిక కేంద్రం ఏర్పాటు అయింది.దాని పేరు కంటోన్మెంట్. ఆ కంటోన్మెంట్ లో ఉండే బ్రిటిష్ సైనికుల కోసం/అధికారుల కోసం చర్చీలు /ఆసుపత్రులు/ విద్యాసంస్థలు/ పార్కులు/ఇతర నిర్మాణాలు జరిగాయి…. అలా ఏర్పడ్డ నగరం పేరు సికింద్రాబాద్.

దేశానికి స్వాతంత్రం వచ్చి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేంతవరకు హైదరాబాద్ నగరం కేవలం ఒక చారిత్రక నగరం.
చార్మినార్/మక్కా మసీదు/ గోల్కొండ….ఆ తర్వాత వచ్చిన పాల రాతి బిర్లా మందిర్.
ఎన్టీఆర్ అభివృద్ధి చేసిన ట్యాంక్ బండ్….
హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు…
ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమా థియేటర్లు…
ఎదురుగా బవార్చిలో బిర్యాని….
అక్కడ నుంచి విద్యానగర్ దాటి ముందుకెళితే….40 ఏళ్ల క్రితమే అనుక్షణికం నవలలో వడ్డెర చండీదాస్ చెప్పినట్టు 30 ఏళ్ల వయసులో ఎదుగుదల ఆగిపోయిన ఒక అద్భుత సౌందర్య రాశిలా కనపడే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ భవనం…..
ఇవి హైదరాబాద్ వచ్చే యాత్రికులు చూడాలనుకునే ప్రదేశాలు.

హైదరాబాద్ వాతావరణం కారణంగా//ఒకరకంగా దేశానికి మధ్యలో ఉండటం వలన/మరి కొన్ని రాజకీయ కారణాల వల్ల… కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. ఫలితంగా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు హైదరాబాద్ కేంద్రమైంది.

బీహెచ్ఈఎల్ ఒక చివర/డి ఆర్ డి ఏ ఇంకో చివర/ఐడిపిఎల్ మరో చివర/ ఈసీఐఎల్ ఇంకో చివర ఉన్న కారణంగా….నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అంతగా జరగలేదు. రోడ్లు చాలా ఇరుకుగా ఉండేవి.

1990వ దశకం ప్రారంభ వరకు….హైదరాబాద్/ లక్నో/ పాట్నా/ బెంగళూరు….దాదాపు ఒకే రకంగా ఉండేవి.( సముద్ర తీరంలో ఉండి రేవు పట్టణాలు కావడం వల్ల బొంబాయి/ కలకత్తా/ మద్రాసు నగరాల వ్యాపార కార్యకలాపాల వల్ల ఆ నగరాలలో ఎక్కువ అభివృద్ధి జరిగి జనసాంద్రత పెరిగింది)

పారిశ్రామిక విప్లవం ఫలితంగా పశ్చిమ దేశాలలో వస్తు ఉత్పత్తి పెరిగింది,వాళ్ల ఎగుమతులు పెరిగాయి, వాళ్ల ఆదాయం పెరిగింది. ఫలితంగా వారికి అవసరమైన పెట్టుబడి కన్నా….ఎన్నో రెట్ల సంపద వాళ్ళ దగ్గర చేరింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన అనేక ఆసియా ఆఫ్రికా దేశాలు వలస పాలన అనుభవంతో విదేశీ పెట్టుబడిని/విదేశీ వస్తువులను అనుమతించలేదు.
(ఎందుకంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి పాలకులు అవుతారు)

దాంతోపాటు భారత రాజ్యాంగంలో సామ్యవాద భావాలు ఉండటం వల్ల విదేశీ పెట్టుబడుల ను నియంత్రించడం జరిగింది. ఒకపక్క ఆసియా/ఆఫ్రికా దేశాల్లో అవసరానికి తగిన పెట్టుబడి లేని కారణంగా, అభివృద్ధి లేక పేదరికం పెరుగుతుంది.
మరోపక్క ఐరోపాలోను అమెరికాలోనూ….అవసరానికి మించి ఎన్నో రెట్ల పెట్టుబడి పోగుపడి ఉంది.
అలాంటి నేపథ్యంలో….
డబ్బులు ఉన్నవాడు వడ్డీ వ్యాపారం మొదలుపెట్టినట్టు…..అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలు ప్రైవేటీకరణ….అనే నూతన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీసాయి.
ప్రజల అవసరాలన్నీ తీర్చే ఆర్థిక వనరులు ప్రభుత్వ రంగంలో లేవు కాబట్టి….అందుబాటులో ఉన్న ప్రైవేటు పెట్టుబడిని ఉపయోగించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని….ఆసియా/ఆఫ్రికాలో పేద దేశాలకు వ్రత భంగం చేసి….తలుపులు బార్ల తెరిపించారు.

ఈ నేపథ్యంలో……
ప్రైవేటు రంగాన్ని నియంత్రిస్తూ,ప్రభుత్వ రంగ నాయకత్వంలో పనిచేస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ తలుపులను..1991లో భారత దేశ ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహారావు…….పూర్తిగా తెరిచారు.

1991లో భారత పార్లమెంటు ఆర్థిక సంస్కరణల పేరుతో నూతన ఆర్థిక విధానాన్ని ఆమోదించింది. ఆ విధానం ఫలితమే సరళీకరణ/ప్రైవేటీకరణ/ ప్రపంచీకరణ. ఈ మార్పులు జరుగుతున్న సమయానికి భారతదేశ వివిధ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమం త్రులు అందరూ సాంప్రదాయ/మూస పద్ధతిలోనే పరిపాలన సాగిస్తున్నారు.

ముఖ్యంగా….కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల దృష్టి మొత్తం తమ పదవిని కాపాడుకునే అంశంపైనే ఉండేది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు
పాలనాపరమైన స్వేచ్ఛ లేకపోవడం/ మెజారిటీ ముఖ్యమంత్రులు వృద్ధులు కావడం/సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం/ అన్నిటికీ మించి దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథం లేకపోవడం…ఫలితంగా…. ఆర్థిక విధానాలలో మరియు సాంకేతిక విజ్ఞానంలో వచ్చిన మార్పులను గుర్తించి తమ అవసరాలకు తగినట్టుగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించడంలో విఫలమయ్యారు. ఫలితంగా మెజారిటీ రాష్ట్రాలలో ఆశించిన ఆర్థిక అభివృద్ధి జరగలేదు.

సరిగ్గా అలాంటి సమయంలో 1995లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

45 సంవత్సరాల వయస్సు/ఏదైనా వేగంగా నేర్చుకునే స్వభావం/ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థిక సంక్షోభం/దూసుకొస్తున్న సాంకేతిక విప్లవం/ఏం చేసినా… భారీ స్థాయిలో చేయాలనే…థింక్ బిగ్…ఆలోచన విధానం/ నెలల తరబడి ఆర్థిక పరిస్థితి పై మధనం/పరిమిత వనరులు/ అపరిమితమైన ప్రజల అవసరాలు /ఏదో చేయాలన్న తపన……….ఇవన్నీ కలిసి…. ముఖ్యమంత్రిని……సీఈఓ గా మార్చి వేశాయి.
ముఖ్యమంత్రి అంటే రాజకీయం. సీఈఓ అంటే గ్రోత్. ముఖ్యమంత్రి అంటే అధికార దర్పం…… సీఈఓ అంటే రోజుకు 20 గంటలు గాడిద చాకిరి.

అప్పటివరకు
ముఖ్యమంత్రి అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం.
సీఈఓ అంటే…ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిని/బిల్ గేట్స్ ని/సత్యం రామలింగరాజుని ఆహ్వానించడం.

ముఖ్యమంత్రి అంటే కుటుంబ సభ్యులతో విదేశీ విహారాలు…. సీఈఓ అంటే దావోసులో ప్రపంచ దేశాల పెట్టుబడిదారులకు…974 కిలోమీటర్ల ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంత సంపద గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
ముఖ్యమంత్రి అంటే అవసరం లేకపోయినా నవ్వటం…అదో గొప్ప లక్షణంగా చెప్పుకోవడం.
సీఈఓ అంటే టార్గెట్ సాధించే వర్క్ కల్చర్ సృష్టించడం కోసం సన్నిహితుల దగ్గర కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం.

9 సంవత్సరాలు…..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డ్.
పెట్టుబడుల కోసం దావోస్ వెళితే….మౌలిక సదుపాయాల గురించివాళ్ల అడిగిన ప్రశ్నలకు సమాధానం గా…. ఇరుకు రోడ్లను విస్తరించాడు.
చారిత్రక నగరాన్ని… నవీన నగరంగా రూపు మార్చాడు.
డైరెక్ట్ కనెక్టివిటీ ఉందా అని అడిగారు…..శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం సృష్టించాడు. ప్రపంచ స్థాయి హోటల్స్ ఉన్నాయా అని అడిగారు….హైదరాబాదుని హాస్పిటాలిటీ టి హబ్ గా మార్చాడు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నోవాటెల్ సెవెన్ స్టార్ హోటల్ కి వెళ్లే దారిలో ట్రాఫిక్ జాములు ఉండకూడదు అని అడిగారు…..ఫ్లై ఓవర్లతో ‘ ( FLY over the jam) సమాధానం చెప్పాడు.
సరే మేం కంపెనీ పెడితే మ్యాన్ పవర్ ఎలా అని అడిగారు….30 ఇంజనీరింగ్ కాలేజీలను 300 చేసి లక్షలాది సాంకేతిక సైన్యాన్ని కంపెనీలకు ఇచ్చాడు.

పేరు కోసం చేయలేదు.
డబ్బు కోసం చేయలేదు.
అధికారం కోసం చేయలేదు.

కేవలం…. యంత్రం లా పని చేసుకుంటూ పోయాడు.

వెనక్కి తిరిగి చూస్తే…..
హైదరాబాదు లోగోను మార్చిన హైటెక్ సిటీ/హైదరాబాద్ దూరాన్ని మార్చిన శంషాబాద్ ఎయిర్పోర్ట్/ హైదరాబాద్ వేగాన్ని మార్చిన ఔటర్ రింగ్ రోడ్డు/హైదరాబాద్ బిజినెస్ ను పెంచిన బిజినెస్ స్కూల్/త్రిబుల్ ఐటీ/ఉర్దూ యూనివర్సిటీ/ నల్సార్ యూనివర్సిటీ/ఇలా చెప్పుకుంటూ పోతే….
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,
బయో టెక్నాలజీ రంగం తోపాటు…
వైద్య రంగానికి/
ఆతిధ్య రంగానికి/
విద్యా రంగానికి/
ఎంటర్టైన్మెంట్ రంగానికి/రియల్ ఎస్టేట్ రంగానికి/ఫార్మా రంగానికి/క్రీడారంగానికి/రవాణా రంగానికి….. హైదరాబాద్ నగరం కేంద్రం అయింది.

చారిత్రక హైదరాబాదులో ఒక్కచోట మాత్రమే చార్మినార్ ఉంటుంది.
ఆధునిక హైదరాబాదులో అడుగడుగున….చంద్రబాబు నాయుడు ఉంటాడు.
ఇప్పుడు హైదరాబాద్ …..హద్దులు లేని ఒక అభివృద్ధి.
ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలు కాదు.
నాలుగు నగరాలు.

హైదరాబాద్
సికింద్రాబాద్
సైబరాబాద్
శంషాబాద్.

స్వతంత్ర భారత చరిత్రలో ఒక్క నగరం నిర్మించిన రాజకీయ నాయకుడు లేడు….
కానీ చంద్రబాబు నాయుడు మాత్రం….
ఒకటి కాదు….
మూడు నగరాల నిర్మించాడు….
అందరూ చెప్పే సైబరాబాద్….
చాలామంది గుర్తించని శంషాబాద్….

చీకటిని చీల్చుకుని రాబోతున్న
అమరావతి.
ఇదంతా…..ఇప్పుడు ఎందుకంటే….

ప్రస్తుత తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు…. సోదరుడు రేవంత్ రెడ్డి గారు …….

హైటెక్ సిటీ/శంషాబాద్ విమానాశ్రయం/ ఔటర్ రింగ్ రోడ్ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినికాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో…..చరిత్రని వక్రీకరిస్తుంటే చూడలేక…. కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తీసుకు వచ్చాను.
రాజకీయ నాయకులు పార్టీ కండవాలు మార్చవచ్చు…..కానీ చరిత్రను మార్చలేరు.
చరిత్ర ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడు ఉంటాడు….ఎందుకంటే…ఆ చరిత్రను సృష్టించింది ఆయనే కాబట్టి.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE