– కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా
– మొదటి విడత 87 లక్షల మంది.. ఇప్పుడు 78.76 లక్షల మంది
– ఎనిమిదిన్నర లక్షల మంది ఏమయ్యారు జగన్ రెడ్డీ.?
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఆసరా పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది డ్వాక్రా మహిళలను నిట్ల నిలువునా మోసం చేస్తున్నారు. స్వయం ఉపాధి, మహిళా సాధికారిత విషయంలో దగా చేస్తున్నారు. ఆసరా పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారని.. వారికి సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నానని సొంత పత్రిక సాక్షికలో ప్రచారం చేసుకుంటున్నావు. కానీ.. పథకాలు అమలు చేయాల్సి వచ్చినపుడు లక్షలాది మంది మహిళల సంఖ్యను తగ్గించేస్తున్నావు. వాళ్లేమన్నా అంకెలు అనుకున్నావా.? వారు ప్రతి ఒక్కరూ ఒక్కో కుటుంబానికి ప్రతినిధి. సమాజానికి మార్గదర్శి. గతేడాది ఆసరా 87 లక్షల మందికి అన్నావు.. ఈ ఏడాది 78.76 లక్షల మందికే అంటున్నావు. మిగిలిన ఎనిమిదిన్నర లక్షల మంది డ్వాక్రా మహిళలు ఏమయ్యారు.? ఇది ఆసరానా.. వాళ్లని ఆదుకునే పథకమా.?
మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ హడావుడి చేశావ్. నవరత్నాలకు క్యాలెండర్ విడుదల చేశావ్. చెప్పిన తేదీన మీట నొక్కి పథకం సొమ్ము ఖాతాల్లో జమ చేస్తానన్నావ్. సెప్టెంబరులో నొక్కాల్సిన మీట.. ఎందుకు నొక్కలేదు.? ఇప్పుడు.. నెల తర్వాత పది రోజుల పాటు విడతలుగా మీట నొక్కి జమ చేస్తాను అంటున్నావు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్. ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావు. ఇది.. మాట తప్పడం మడమ తిప్పడం కాదా.?
తెలుగుదేశం ప్రభుత్వంలో నీ సాక్షి లెక్క ప్రకారమే.. 2014 నాటికి రూ.14,204 కోట్లు డ్వాక్రా రుణాలు అన్నావు. వాటిని.. రద్దు చేస్తానన్న చంద్రబాబు నాయుడు రూ.18,600 కోట్లు డ్వాక్రా రుణమాఫీ, పసుపు-కుంకుమ ద్వారా ఇచ్చి.. మహిళల పట్ల తనకున్న పెద్ద మనసును చాటుకున్నారు. ఇది నిజం కాదా.? దీనిపై చర్చకు సిద్ధమా.? ఈ రోజు ప్రకటనలో.. వైఎస్‌ఆర్ ఆసరా అంటూ మహిళల్ని గొప్పగా ఉద్దరిస్తున్నట్లు ప్రకటనలిచ్చుకున్నావు.
ఎన్నికల ప్రచారం, పాదయాత్రలో.. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు నెలకు రూ.3వేల చొప్పున సహాయం చేస్తానన్నావు. దీంతో సంవత్సరానికి రూ.36వేల చొప్పున ఐదేళ్లకు రూ.1.80లక్షలు వస్తుందని రాష్ట్రంలోని 45లక్షల పైచిలుకు మహిళలు నీకు ఓట్లు వేసి గెలిపించారు.
గెలిచిన నీవు.. చేయూత పేరుతో సంవత్సరానికి రూ.18,750 చొప్పున ఇస్తానంటూ మాట తప్పి.. మడమ తిప్పి.. ఒక్కో మహిళకు రూ.1.05 లక్షల చొప్పున ఎగనామం పెట్టావు. ఇది మహిళలను ఉద్దరించడమా.? మోసం చేయడమా.?తెలుగుదేశం ప్రభుత్వం అసలు రుణాలే మంజూరు చేయలేదని ప్రకటనలో చెబుతున్న జగన్ రెడ్డి.. ఇప్పుడు చెల్లిస్తున్న రూ.25,517 కోట్ల రుణాలు ఎవరి ప్రభుత్వం ఇచ్చిందో సమాధానం చెప్పాలి.
అసలు నీ అంకెల గారడీ ఏమిటి జగన్ రెడ్డీ.? :
గతేడాది రూ.27,168 కోట్ల రుణాలు ఉన్నాయి అన్న జగన్ రెడ్డి.. ఈ ఏడాది రూ.25,517 కోట్లకు తగ్గించి.. రూ.1,651 కోట్లు ఎగ్గొట్టడం మహిళా సంఘాలను ఉద్దరించినట్లా.? గతేడాది నీ రంగుల ప్రకటనలో రూ.6,792 కోట్లు మాఫీ చేసేస్తున్నామంటూ మీట నొక్కావు. ఇప్పుడు.. అదే రంగుల ప్రకటనలో గతేడాది మాఫీ చేసింది కేవలం రూ. రూ.6,319 కోట్లే చెల్లించామన్నావు.
రెండో విడతగా.. రూ.6,440 కోట్లు చెల్లిస్తున్నట్లు చెబుతున్నావు. ఒకవైపు.. లబ్దిదారుల సంఖ్య 8.26 లక్షలు తగ్గించి.. మరోవైపేమో.. రూ.121 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నట్లు చెప్తున్నావు. లబ్దిదారుల సంఖ్య తగ్గినపుడు.. చెల్లించాల్సిన మొత్తం తగ్గాలి కదా. ఇదంతా.. నీ తాడేపల్లి ప్యాలస్ కేంద్రంగా జరుగుతున్న మాయాజాలం కాదా.?
సున్నా వడ్డీ.. పేరుతో దగా :
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.5లక్షల రుణం వరకు సున్నా మంజూరు చేస్తే.. మీరు ఆ రుణాల పరిమితిని రూ.3 లక్షలకు కుదించడం ఏ రకంగా అక్కచెల్లెమ్మలకు మేలు చేసినట్లు.? ఈ రెండున్నరేళ్లలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణం మంజూరు చేయించావో శ్వేతపత్రం విడుదల చేయాలి. డ్వాక్రాను ఉద్దరిస్తున్నట్లు చెప్పుకుంటున్న నీవు.. డ్వాక్రా మహిళల రూ.8700 కోట్ల పొదుపు నిధిని అస్తవ్యస్తంగా ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులకు మళ్లించి వాళ్లను అగాథంలోకి నెట్టే ప్రయత్నం కాదా.? ఇళ్ల నిర్మాణాలకు డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్మును మళ్లించేందుకు ప్రయత్నించడం వారి సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదా.?
తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఉన్నతి పథకం ద్వారా రూ.800 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా రూ.4,455 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.68,830 కోట్లు, పసుపు కుంకుమ ద్వారా రూ.18,600 కోట్లు, వడ్డీ రాయితీ ద్వారా రూ.2,514 కోట్లు, రుణమాఫీ పథకం మొదటి విడతలో రూ.3,800 కోట్లు, 2వ విడతలో రూ.2,500కోట్లు చొప్పున మొత్తంగా రూ.1,01,449 కోట్లు డ్వాక్రా మహిళల సాధికారతకు ఉపయోగపడిరది నిజం కాదా.? రెండున్నరేళ్లలో మీరు ఇచ్చిందెంత.? చేసుకున్న ప్రచారం ఎంత.?
ఆసరా సొమ్ము‘గ్యాస్’ :
వైఎస్‌ఆర్ ఆసరా అంటూ ఆర్భాటంగా ప్రారంభించారు. ఇంకా ఆ సొమ్ములు మహిళల ఖాతాలకు చేరక ముందే.. జగన్ రెడ్డి తన చేతివాటాన్ని చూపించారు. అమ్మఒడి అంటూ ఆర్భాటం చేసి.. మద్యం ధరలు పెంచి నాన్న బుడ్డీలో లాగేశారు. రైతు భరోసా, పెన్షన్ల ద్వారా అందించిన సొమ్మును.. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల్లో లాగేశారు. వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన సొమ్మును పెట్రోల్, డీజిల్ ధరల్లో లాగేశారు. ఇప్పుడు.. ఆసరా పథకం ద్వారా మహిళలకు ఇచ్చే సొమ్మును గ్యాస్ ధరల్లో లాగేస్తున్నారు. వాట్ ఏ స్ట్రాటజీ.. గురూజీ.. దొంగ తెలివితేటలు.. దోపిడీ ప్రయత్నాలు దొంగలకు తెలిసినంతగా.. సామాన్యులకు తెలియవు అనడానికి జగన్ రెడ్డి మరోసారి నిరూపించారు. నాడు క్విడ్ ప్రోకో విధానంలో నీకిది నాకది అని వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి.. ఇప్పుడు పేదలకు అందించే సాయంలోనూ క్విడ్ ప్రోకో విధానానికి పాల్పడుతుండడం సిగ్గుచేటు.
గ్యాస్ పై 14.5శాతంగా ఉన్న పన్నును 10% పెంచి 24.5శాతానికి తీసుకెళ్లారు. అంటే.. నిన్న ఆసరా పేరుతో చెల్లించిన సొమ్ము మొత్తాన్ని పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల రూపంలో వెనక్కి లాక్కునేందుకు స్కెచ్ వేశారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ఆ ఆదాయాన్ని పూడ్చుకోవడం కోసమే వ్యాట్ పెంచుతున్నట్లు జీవోలో పేర్కొనడం అత్యంత దుర్మార్గం. దుర్భరం.
మహిళా సాధికారత టీడీపీ హయాంలోనే..
మహిళా సాధికారత గురించి కనీసం మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. మహిళలను బూటు కాళ్లతో తన్నించిన జగన్ రెడ్డి.. ఏ విధంగా మహిళా సంక్షేమం గురించి మాట్లాడగలరు.? అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఏం చేశారో జగన్ రెడ్డి చెప్పలగరా.? అమరావతి పరిధిలో అక్రమ కేసులు పెట్టి మహిళలను వేధిస్తున్నారు. అత్యాచారాలు, హత్యలతో మహిళా లోకం భయాందోళనలకు గురవుతోంది.
దిశ చట్టం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు ఓ బాలికను 12 మంది అత్యాచారం చేసి పడేస్తే.. కనీసం పట్టించుకున్న దాఖాల్లేవు. ఒక్కో మహిళకు రూ.2లక్షల చొప్పున రుణాలిచ్చి.. అందులో రూ. లక్షను సబ్సిడీగా పొందే పథకాలను, కార్పొరేషన్ల రుణాలను రద్దు చేసి.. అరకొర సాయం చేయడం మహిళా సాధికారతా.? మహిళా సాధికారతకు అసలైన రూపం తెలుగుదేశం పార్టీయే. అందుకే మహిళలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో నాడు డ్వాక్రా మహిళా సంఘాలకు శ్రీకారం చుట్టాం. ప్రతి మహిళ ఎవరిపైనో ఆధారపడకూడదు,తన కాళ్లపై తాను నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన డ్వాక్రా సంఘాలకు తెలుగుదేశం ఎప్పుడూ అండగా నిలుస్తూనే ఉంది.
ఎక్కువ రుణాలు ఉండి, ఇంకా బ్యాంకులకు చెల్లించని వారికి మాత్రమే ఆసరా పథకంతో ప్రయోజనం తప్ప.. రుణభారం తప్పించుకోవడం కోసం తీసుకున్న రుణాలను ముందే చెల్లించినవారికి పైసా ప్రయోజనం ఉండబోదు. గతంలో పసుపు – కుంకుమ పథకం ద్వారా ప్రతి డ్వాక్రా మహిళకు ఆర్ధిక సాయం అందగా.. ఇప్పుడు రుణాలు అధికంగా తీసుకుని, ఇంకా చెల్లించని వారికే ప్రయోజనం కలుగుతోంది.