Suryaa.co.in

Andhra Pradesh

అమ్మ ఒడి నిలుపుదలతో అమ్మలకు మోసం

– బడులకు వెళ్లే విద్యార్ధులకు మోసం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు
ఏ పథకమైన ప్రజలకు ఊరించి ఉసూరు మనిపించడం జగన్ రెడ్డికే సాధ్యం. అమ్మ ఒడి పేరుతో వచ్చే పథకాన్ని నిలిపివేశారు. అమ్మ ఒడి పథకాన్ని ఎగనామం పెట్టేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే జిత్తుల మారి నక్క గుర్తుకు వస్తుంది. బడికి వెళ్లి ప్రతి పిల్ల వాడికి అమ్మ ఒడిని అమలు చేస్తానని మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పిల్లల తల్లులకు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 84 లక్షల మంది విద్యార్ధులు ఉంటే ఈ ఏడాది కేవలం 44 లక్షల మంది విద్యార్ధులకు మాత్రమే వర్తింపజేస్తూ సగం మంది విద్యార్ధులను మోసం చేస్తున్నారు.
అమ్మ ఒడి పథకాన్ని మొదటి నుంచి ఆంక్షల సుడిగా మార్చారు. విద్యార్ధుల సంఖ్యను కుదించేందుకు 7 రకాల వింత ఆంక్షలు విధించారు. అది కూడా రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చి దానిని రూ.14వేలకు కుదించారు. ఈ ఏడాది రూ.14వేలు కాకుండా లాప్ ట్యాప్ లు ఇస్తున్నామని దానికి 90 శాతం మంది తల్లి దండ్రులు ఒప్పుకున్నారని తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అమ్మ ఒడి పథకం అమలు కోసం విద్యార్ధుల హాజరును ఏనాడు పట్టించుకోని ప్రభుత్వం నేడు హాజరును సాకుగా చూపించి విద్యార్ధులకు పంగనామాలు పెట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దపడటం సిగ్గుచేటు.
2021లో కరోనా కారణంతో పాఠశాలలు తెరుచుకోకపోయినా అమ్మ ఒడిని అమలు చేశామని ఆర్బాటంగా చెప్పుకున్నారు. కాని నేడు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. విద్యార్ధులు స్కూళ్లకు వెళుతున్న తరుణంలో 75 శాతం హాజరును బూచిగా చూపించి అమ్మ ఒడిని అమలు చేయలేకపోతున్నామని చెప్పడం హేయం.
గత ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనాలు, సైకిళ్లు, విద్యార్ధులకు ఉచిత వైద్యం వంటి ఎన్నో కార్యక్రమాలను నిలిపివేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్ధులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే నిరుపేద విద్యార్ధులకు కరోనా సమయంలో ఈ నిర్ణయం మరో శరాఘాతం. రంగులు వేయడం, సలహాదారుల నియమాలను రద్దు చేసి ఆ నిధులు అమ్మ ఒడికి వర్తింపజేయవచ్చు.

LEAVE A RESPONSE