-మారణాయుధాలతో ప్రజల్ని భయపెట్టిన వారిపై హత్యాయత్నం కేసు కాకుండా నామమాత్రపు కేసులు పెడతారా.?
-శాంతియుతంగా నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారు?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసి కట్టబెట్టిన నీ తండ్రి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు ఉండకూడదా.? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లే. తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడమంటే తెలుగుజాతిని అవమానించడమే.
ఇంతటి నీచమైన వ్యక్తులు రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యం. విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుదాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ సెక్షన్ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు.? విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా.? టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలి.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా.? జగన్ రెడ్డి వచ్చాక ప్రశాంతమైన పల్నాడును ఫ్యాక్షన్ కు అడ్డాగా మారుస్తున్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాల జోలికి వెళ్లొద్దని వైసీపీని హెచ్చరిస్తున్నాం. విగ్రహాలు కూల్చి రాజకీయాలనుకుంటే ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే చాలాసార్లు విగ్రహాలు ధ్వంసం చేశారు. వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. మరోసారి ఎన్టీఆర్ విగ్రహాల జోలికివస్తే ఊరుకునేది లేదు.